హైదరాబాద్ : 11/07/2021
హుజూరా‘వార్’ లోకి టీజేఎస్
హుజూరాబాద్ ఉపఎన్నిక రోజురోజుకూ ఉత్కంఠను పెంచుతోంది. ఇప్పటిదాకా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అనుకున్నాం. కానీ.. బరిలోకి మేము కూడా దిగుతున్నామంటూ ప్రకటించారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. ఆగస్టు నెలాఖరులో ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు కోదండరామ్.
టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అందులో వాస్తవం లేదన్నారు. తమ పార్టీని కాంగ్రెస్ లో కలిపే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే అధికారికంగా తామే ప్రకటిస్తామని… సోషల్ మీడియాలో అధికార పార్టీనే దుష్ప్రచారం చూపిస్తోందని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం.. అమరుల ఆశయ సాధన కోసమే తమ తాపత్రయమని చెప్పారు కోదండరాం. నోట్లు పోసి ఓట్లు కొనుక్కునే రాజకీయాలను సంపూర్ణంగా మార్చి… రాజ్యాంగబద్ధమైన పాలన సాధించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. దానికోసం ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తూ.. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డ కోదండరాం.. లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బులతో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని… ఏపీతో కుమ్మక్కై నీటి పంపకాలపై నాటకాలు ఆడుతోందని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీయ అస్తిత్వాన్ని వదులుకునే ప్రసక్తే లేదని చెప్పారాయన. నిరుద్యోగం, పోడు భూములు, ప్రజా సమస్యలపై పోరాటం నిర్వహిస్తామని తెలిపారు.
No comments:
Post a Comment