హైదరాబాద్ : 07/07/2021
*నిజమైన జర్నలిజం అంటే ఇదే.. !!*
Venugopal (link Media H. India Herald)
జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు, జర్నలిస్ట్ అంటే అక్షరాలను తూటాల్లా చేసుకుని, అవినీతి లొసుగులను బయటకులాగే వేటగాడు.. పొలంలో విత్తుని మొలకెత్తించడానికి రైతు తన శ్రమను ఎలా ధారపోస్తాడో, ఒక వార్తను సేకరించడానికి, విలేఖరి తన సర్వశక్తులూ ఉపయోగిస్తాడు.. అతనిది బ్రతుకు పోరాటం.. ఇతనిది మంచిని బ్రతికించాలనే ఆరాటం.. జర్నలిజం బ్రతుకు అక్షరాల వెంట పరిగెడుతుంది..
ఉరుకుల పరుగుల జీవితంలో, తన చుట్టూ ఎన్ని సమస్యలు చుట్టిముట్టినా తట్టుకుని సమాజంలో ఉన్న సమస్యలకి పరిష్కారం చూపించాలనే తపనతో, కనిపించిన ప్రతి దాంట్లో జర్నో కోణాన్ని వెతుక్కుంటాడు.. అలా రోజూ కామన్ మ్యాన్ లా ఆలోచించి జర్నీ మొదలు పెడతాడు జర్నలిస్టు... ఆ గడియారం ముల్లు ఒకటి నుండి పన్నెండుదాకా తిరిగితే.. జర్నలిస్టు లోకం చుట్టు తిరుగుతూ, 24 గంటలు అదే ధ్యాసలో బ్రతికేస్తాడు. పేరుకు అతనికి 8 గంటలే డ్యూటీ అయినా.. నిద్రపోనంత వరకు, బుర్ర మాత్రం సమాజం చుట్టే తిరుగుతూ ఉంటుంది.
తాను పడే వేదనలో, తన మెదడులో మెదిలో ఆలోచనల్లో బాస్ దగ్గర శభాష్ అనిపించుకోవాలంటే ఏలాంటి స్టోరీలు రాయాలి, కళ్ల ముందు ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించేలా వాటిని ఎలా ప్రెజెంట్ చేయాలి, ఇందులో ఏ స్టోరీ పేలిపోతుంది. కంటికి కనిపించిన స్టోరీని ఏ యాంగిల్లో ప్రజంటేషన్ చేయాలి, అని బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచిస్తుంటాడు. ఇలా ఆలోచించి ఆలోచించి అనారోగ్యం కొని తెచ్చుకుంటాడు.. తనకు తెలియకుండానే బాడీ మొత్తం స్లో పాయిజన్ ఎక్కించేసుకుంటాడు...
ఇలా అందరి గుండెచప్పుళ్లు వినే ఎందరో జర్నలిస్టులు.. తమ గుండెను మాత్రం కాపాడుకోలేక పోతున్నారు.. ఇకపోతే నేటి సమాజంలో జర్నలిజం అంటే దోపిడిలా మారింది. జర్నలిజం పేరు చెప్పుకుని జేబులు నింపుకుంటున్న చోరులను చూసి అక్షరాలు సిగ్గుపడుతున్నాయి.. అక్షరాలను ఆయుధాలుగా మార్చే చేతులు అవినీతిపనులకు అడ్డాగా మారుతుంటే కలం కూడా కన్నీరు కారుస్తుంది.. సోదరుల్లారా జర్నలిజం అంటే బ్రోకరిజం కాదు.. తూటా లేని తుపాకి లాంటిది. రక్తం చూడని కత్తి లాంటిది.. నేలను చదును చేసే నాగలి వంటిది.. కాబట్టి అక్షర యజ్ఞం చేయండి నిజాయితీగా జీవించండని ప్రతి అక్షరం అనుక్షణం జర్నలిస్టులను వేడుకుంటుంది.
కానీ ఈ వేదన నిజమైన జర్నలిస్టుకు మాత్రమే అర్ధం అవుతుంది.. నువ్వు అనుకుంటావు అక్షరాలకు ఊపిరి పోస్తున్నా అని, కాని నీకో గుర్తింపును ఆ అక్షరాలే సంపాదిస్తున్నాయనే విషయాన్ని విస్మరించకు మిత్రమా.. ఎందుకంటే అమ్మకంటే అత్యుత్తమమైనది అక్షరం. ఆ అమ్మను పిలవాలంటే అక్షరమే తోడవ్వాలి మరి... ఇదే నిజమైన జర్నలిజం...
No comments:
Post a Comment