హైదరాబాద్ : 06/07/2021
@TelanganaCMO ట్విట్టర్ సౌజన్యంతో
కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు.
నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటా సహా, లిఫ్టులను నడిపించుకునేందుకు జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగింపుపై రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని నిర్ణయించింది.
తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను నిర్ధారించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందార్భాల్లో కేంద్రంపై వత్తిడిచేస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో, కృష్ణా ట్రిబ్యునల్, కెఆర్ఎంబీ తదితర వేదికల మీద తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందడానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు దిశగా, సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న సాగునీటి వివక్ష గురించి లోతుగా చర్చించింది.
స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని సమావేశం తీర్మానించింది. రాష్ట్రం తరఫున ఎటువంటి వ్యూహాన్ని ఎత్తుగడలను అనుసరించాలనే విషయాలకు సంబంధించి సమావేశంలో చర్చించిన సీఎం అధికారులకు ఆ దిశగా మార్గనిర్దేశం చేశారు.
No comments:
Post a Comment