హైదరాబాద్ : 07/07/2021
విస్తరణకు వేళాయె.. నేడు కేంద్ర క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ
- కొత్తగా 20మందికి పైగా చోటు?
- కేంద్రంలో చేరేందుకు జేడీయూ సుముఖం
- ఢిల్లీకి సింధియా, రాణె, శర్బానంద
- థావర్‌చంద్ స్థానంలో జితిన్ లేక త్రివేది
- యూపీ, మహారాష్ట్ర, బెంగాల్‌కు ప్రాధాన్యం
- పాశ్వాన్ సోదరుడు పరాస్‌కూ పదవి
కేంద్రంలో కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు కానుంది. సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు గాను ఈ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
న్యూఢిల్లీ, జూలై 6: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధాని నరేంద్రమోదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు తన క్యాబినెట్‌ను విస్తరించనున్నారని ఆ వర్గాలు తెలిపాయి. క్యాబినెట్‌లోకి కొత్తగా తీసుకోనున్న వారి పేర్లను సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో జరిపిన భేటీలో ప్రధాని ఖరారు చేశారని పేర్కొన్నాయి. క్యాబినెట్‌లోకి కొత్తగా 20 మందికి పైగా చోటు దక్కుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో కొందరు మంత్రులు పదవులు కోల్పోయే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ సహా వచ్చే ఏడాది పలు రాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికలు, 2024 జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విస్తరణ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. పెద్ద రాష్ర్టాలైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు క్యాబినెట్‌లో అధిక ప్రాతినిధ్యం లభించనున్నదని అంచనా వేస్తున్నారు. విస్తరణ తర్వాత మంత్రుల సగటు వయసు గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరికొందరు మహిళలకు, పరిపాలనా అనుభవం కలిగిన వారికి అవకాశం లభించనున్నదని అంటున్నారు. ‘చిన్న సామాజిక వర్గాలకు అవకాశమివ్వాలన్నది లక్ష్యం. మొత్తంగా దాదాపు 25 ఓబీసీలకు ప్రాతినిధ్యం లభిస్తుంద’ని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. మంత్రుల సగటు విద్యార్హత కూడా అధికంగా ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. విస్తరణ దృష్ట్యా మంత్రుల పనితీరుపై ప్రధాని నెల రోజుల పాటు సమీక్ష జరిపారు.
రెండేండ్ల తర్వాత..
ప్రధాని మోదీ 2019లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటిదాకా క్యాబినెట్‌ను విస్తరించలేదు. కేంద్ర క్యాబినెట్‌లో 81 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం 53 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 28 మంది వరకు కొత్తవారిని తీసుకునే అవకాశం ఉంది. క్యాబినెట్‌లో చోటు దక్కనున్నవారిలో నారాయణ్ రాణె (మహారాష్ట్ర), జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్), ఎల్జేపీ నేత పశుపతి పరాస్ (బీహార్), శర్బానంద సోనోవాల్ (అస్సాం), వరుణ్ గాంధీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొందరు మంత్రులకు ఉద్వాసన పలుకవచ్చని తెలుస్తున్నది. వారితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం నుంచి భేటీ కానున్నారని సమాచారం.
థావర్‌చంద్ చోటెవరికి?
కేంద్ర సామాజిక న్యాయ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌ను కర్ణాటక గవర్నర్‌గా నియమించడంతో క్యాబినెట్‌లో ఒక బెర్త్ ఖాళీ అయింది. రాజ్యసభ సభ్యుడైన ఆయన పదవీ కాలం 2024 ఏప్రిల్ వరకు ఉంది. ఆయన రాజీనామాతో రాజ్యసభలో కూడా ఖాళీ ఏర్పడుతుంది. దీన్ని బట్టి లోక్‌సభ, రాజ్యసభలో సభ్యుడు కాని నాయకుడిని క్యాబినెట్‌లోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ బెర్త్‌ను ఇటీవల బీజేపీలో చేరిన దినేశ్ త్రివేది (బెంగాల్), జితిన్ ప్రసాద (యూపీ)లలో ఒకరికి కేటాయించొచ్చు.
ఢిల్లీలో వాలిన నేతలు
హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం ఆయనను బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కలుసుకున్నారు. మరోవైపు, అధిష్ఠానం పిలుపు అందుకున్న పలువురు బీజేపీ నేతలు మంగళవారం ఢిల్లీలో వాలిపోయారు. మరికొందరు బుధవారం రానున్నారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య ఆగమేఘాలపై ఢిల్లీ చేరుకున్నారు. మధ్యప్రదేశ్‌లో తన పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకుని, ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్ ఆలయాన్ని సందర్శించుకుని ఢిల్లీ విమానమెక్కారు. ఢిల్లీ చేరుకున్న వారిలో అనుప్రియా పటేల్ (అప్నాదళ్), పంకజ్
చౌధరి, రీటా బహుగుణ జోషి, రామ్‌శంకర్ కథేరియా, లలన్ సింగ్, రాహుల్ కశ్వాన్ తదితరులు ఉన్నారు.
జేడీయూ డీల్ కుదిరిందా?
క్యాబినెట్ విస్తరణలో తాము కూడా మోదీ ప్రభుత్వంలో చేరుతున్నామని జేడీయూ బీహార్ అధ్యక్షుడు ఉమేశ్ కుష్వాహా తెలిపారు. ఈ విషయంపై బీజేపీతో చర్చిస్తున్నట్టు బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ప్రకటించారు. బీహార్‌లో 16 మంది ఎంపీలు ఉన్న జేడీయూ కేంద్ర క్యాబినెట్‌లో నాలుగు బెర్త్‌లు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. జేడీయూ 2019లో అలిగి క్యాబినెట్‌లో చేరని విషయం తెలిసిందే. ఎల్జేపీ చీలిక వర్గం నాయకుడు పశుపతి పరాస్‌కు క్యాబినెట్‌లో బెర్త్ లభించవచ్చని భావిస్తున్నారు.
No comments:
Post a Comment