హైదరాబాద్ : 27/07/2021
ప్రధాన వ్యాఖ్యానం
నమూనా గ్రామాల అవతరణ
దేశ జనాభాలో అధిక శాతం ఇప్పటికీ పల్లెల్లోనే నివసిస్తున్నారు. వివిధ కారణాల వల్ల గ్రామీణులకు బీమా ప్రయోజనాలు పూర్తిగా అందడం లేదు. ఏదైనా అనారోగ్యం, ప్రకృతి విపత్తులతో పంటలు దెబ్బతినడం వంటివి సంభవించినప్పుడు- ఆ నష్టాన్ని భరించే ఆర్థిక శక్తి లేక ఎన్నో కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ‘నమూనా బీమా గ్రామాలు ఏర్పాటు చేయాలని దేశీయ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఇర్డాయ్) నిర్ణయించింది. గ్రామీణులకు సమగ్ర బీమా రక్షణ పథకాలను రూపొందించి- తక్కువ, రాయితీ ప్రీమియంతో అంటుబాటులోకి తీసుకురావడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర, కేంద్ర స్థాయుల్లో వివిధ ప్రభుత్వ పురస్కారాలను గెలుచుకున్న; సాంఘిక సంక్షేమం, పర్యావరణ అనుకూల కార్యక్రమాలను అమలు చేసిన; సమాజ ఆధారిత భాగస్వామ్య సంక్షేమ ప్రయత్నాల్లో ప్రవేశం ఉన్న పల్లెలకు నమూనా బీమా గ్రామాల ఎంపికలో ప్రాధాన్యమిస్తారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ముందు 500 గ్రామాలను ఎంపిక చేస్తారు. రాబోయే రెండేళ్లలో దీన్ని వెయ్యి గ్రామాలకు విస్తరిస్తారు.
రైతుల ఆదాయం పెరిగితేనే...
దేశంలో అసంఘటిత రంగంలోని అధిక శాతం కార్మికులకు కనీస వేతనాలు లేవు. వారికి ఎటువంటి సామాజిక భద్రతా లేదు. కొవిడ్ కారణంగా అసంఘటిత రంగంలోని 40 కోట్ల శ్రామికులు దుర్భర దారిద్య్రంలోకి జారిపోవచ్చన్నది అంచనా! వీరికి బీమా అవసరం చాలా ఉంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో బీమా ఉత్పత్తుల లభ్యత, వాటి పంపిణీ అంతంత మాత్రమే. ఈ ప్రాంతాల్లోనే బీమా సంస్థలు మెరుగైన పనితీరును ప్రదర్శించాలి. గ్రామీణ ప్రాంతాల్లో బీమా సేవలు అందించడం అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనే వాదన ఉంది. ఉత్పత్తుల్లో కొత్త ఆవిష్కరణలకు, ఆధునికతకు ప్రాధాన్యమిస్తే లాభాలవైపు పయనించడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చు. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని ప్రభుత్వం 74 శాతానికి పెంచింది. దీని ద్వారా వచ్చే మూలధనాన్ని బీమా సంస్థలు సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై కేంద్రీకృతం చేయడం ద్వారా గ్రామాల్లో బీమా సేవలను విస్తరించవచ్చు. గడచిన ఏడాది కాలంగా కొవిడ్ వల్ల ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. పాలసీల విక్రయాల్లో నమోదైన వృద్ధే దీనికి నిదర్శనం. నమూనా బీమా గ్రామాల ప్రాజెక్టును బీమా సంస్థలు పకడ్బందీగా అమలు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో జీవన, ఆరోగ్య బీమా ఉత్పత్తులతో పాటు, వ్యవసాయ సంబంధ బీమా ఉత్పత్తుల వ్యాప్తి సైతం అధికమవుతుంది. ఉరుము లేని పిడుగులా వచ్చి పడే నష్టాలతో గ్రామీణులు పేదరికంలోకి జారిపోకుండా ఉండటానికి ఇది అక్కరకొస్తుంది.
అవగాహన కల్పించాలి
బీమా వ్యాప్తి (జీడీపీలో బీమా ప్రీమియం శాతం) అతి తక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. ఇర్డాయ్ 2019-20 వార్షిక నివేదిక ప్రకారం దేశీయంగా 3.6 శాతానికి మాత్రమే ఈ వ్యాప్తి పరిమితమైంది. రష్యా మినహా మిగిలిన బ్రిక్స్ దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో 86శాతం, పట్టణాల్లో 81శాతం ప్రజలకు ఆరోగ్య బీమా రక్షణ లేదని 75వ జాతీయ నమూనా సర్వే తేల్చింది. భారత్‌లో బీమా ఉత్పత్తుల వ్యాప్తి తక్కువగా ఉండటానికి అనేక కారణాలున్నాయి. బీమా ప్రయోజనాలు, దావా పరిష్కార విధానాలపై ప్రజల్లో సరైన నమ్మకం, అవగాహన లేకపోవడం వీటిలో ముఖ్యమైనది. గ్రామీణులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో ఉండే పాలసీలు అందుబాటులో లేవు. స్నేహపూర్వక, పారదర్శక దావా పరిష్కార విధానాలు కరవయ్యాయి.
No comments:
Post a Comment