*చట్టాన్ని పక్కన పెట్టి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టవద్దు...!*
*జర్నలిస్ట్ కేవీఆర్ రెడ్డి అరెస్ట్ గురించి స్పందించిన సామజిక కార్యకర్త, న్యాయవాది వి. రవికృష్ణ*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 01:
జర్నలిస్ట్ కేవీఆర్ రెడ్డి అరెస్ట్ విషయంలో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో, కొన్ని రాజకీయ వర్గాల్లో "ఏపీ పోలీసులు తెలంగాణలో అక్రమంగా అరెస్ట్ చేశారు", "తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు అక్రమ అరెస్ట్‌కు సహకరించారు" అనే ప్రచారం జరుగుతోంది.ఆంధ్ర నుంచి వచ్చిన పోలీసులు చట్ట విరుద్ధంగా జర్నలిస్ట్ని అరెస్టు చేసినట్టు ఇంతవరకు ఎటువంటి ఆధారం లేదు. కోర్టు ఇచ్చిన వారెంట్ని స్పష్టంగా మీడియాకు చూపించిన తర్వాత కూడా, సరూర్నగర్ పోలీసుల సమక్షంలో ఆంధ్ర నుంచి వచ్చిన పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆంధ్ర - తెలంగాణ అని మాట్లాడడం అవివేకానికి మూర్ఖత్వానికి నిదర్శనం.
*చట్టం ఏమి చెబుతోంది?*
1. సమర్థ అధికార పరిధి కలిగిన కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) ఉంటే, భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా దానిని అమలు చేసే అధికారం పోలీసులకు ఉంది.
2.అరెస్ట్ చేయడానికి పోలీసులు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలనే చట్టం లేదు. సివిల్ డ్రస్‌లో అరెస్ట్ చేయడం మాత్రమే అక్రమం కాదు. అయితే, వారు తమను తాము పోలీసు అధికారులుగా గుర్తించాలి.
3. ఒక రాష్ట్ర పోలీసులు మరో రాష్ట్రంలో వారెంట్ అమలు చేసే సందర్భంలో సాధారణంగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదా సమన్వయం చేసుకోవడం అనేది అనుసరించే విధానం. స్థానిక పోలీసులు శాంతి భద్రతలు కాపాడడం లేదా చట్టబద్ధమైన అరెస్టుకు సహకరించడం మాత్రమే ఆ అరెస్టును అక్రమంగా మార్చదు.
4. ఒకవేళ నిజంగా చెల్లుబాటు అయ్యే కోర్టు వారెంట్ ఆధారంగా అరెస్ట్ జరిగి ఉంటే, ఆ అరెస్టు చట్టబద్ధమా కాదా అనేది BNSS, 2023, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 21, 22, అలాగే సుప్రీంకోర్టు నిర్దేశించిన అరెస్ట్ విధానాలను పాటించారా లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
*సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది:*
D.K. Basu v. State of West Bengal కేసులో అరెస్టు సమయంలో పాటించాల్సిన తప్పనిసరి రక్షణ చర్యలను నిర్దేశించింది. పోలీసు అధికారులు తమ గుర్తింపును తెలియజేయడం, అరెస్ట్ కారణం చెప్పడం, అరెస్ట్ మెమో తయారు చేయడం, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం, వైద్య పరీక్షలు, చట్టం ప్రకారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం వంటి విధానాలు తప్పనిసరి.
*Arnesh Kumar v. State of Bihar తీర్పులో కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యున్నత ప్రాధాన్యత ఉందని, చట్ట ప్రక్రియను ఖచ్చితంగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.*
అందువల్ల, కోర్టు నిర్ణయం లేకుండానే...
❌ "ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు."
❌ "తెలంగాణ పోలీసులు అక్రమ అరెస్టుకు సహకరించారు."
❌ "ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం."అని దుష్ప్రచారం చేయడం చట్టపరంగా సరైనది కాదు.ఒకవేళ అరెస్టు ప్రక్రియలో చట్ట ఉల్లంఘన జరిగి ఉంటే, దానిని నిర్ణయించే అధికారం కోర్టుకే ఉంది. సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ డిబేట్లు లేదా రాజకీయ వ్యాఖ్యలు కాదు.
ఏది పడితే అది మాట్లాడి వాక్ స్వాతంత్రం అని, తెలంగాణ వాదాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు.నమోదు చేసిన కేసు తప్పా వోప్పా అరెస్టు తప్పా వొప్పా అనేది తేల్చాల్సింది యూట్యూబర్లు కాదు, సోషల్ మీడియా కాదు, సంబంధిత కోర్టు నిర్ణయిస్తుంది.
*Rule of Law is above Political Narratives and Regional Sentiments.*
No comments:
Post a Comment