Wednesday, July 29, 2026

తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం, అధికారులు గౌరవించడం నేర్చుకోవాలి_

*తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం, అధికారులు గౌరవించడం నేర్చుకోవాలి*

*కోర్టు ఆదేశాలతో విభేదిస్తే అప్పీల్ చేయాలి కానీ వాటిని ఉల్లంఘించకూడదు*

*వి. రవికృష్ణ, న్యాయవాది & సామాజిక కార్యకర్త*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 29:

తెలంగాణ హైకోర్టు ఇటీవల హైడ్రా HYDRAA వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు ఎంతో గంభీరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని వి.రవికృష్ణ (న్యాయవాది మరియు సామాజిక కార్యకర్త) అన్నారు. ఈ సందర్బంగా రవికృష్ణ మాట్లాడుతూ హైడ్రా కమిషనర్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని హైకోర్టు చీఫ్ సెక్రటరీని ఆదేశించడం ఒక సాధారణ విషయం కాదు. ఆ ఆదేశానికి దారితీసిన కారణాలను కూడా న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా నమోదు చేసింది అని అన్నారు.ఒక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం లేదా అధికారి విభేదిస్తే, చట్టం చూపిన మార్గం పైకోర్టును ఆశ్రయించడం. డివిజన్ బెంచ్, అనంతరం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం రాజ్యాంగం కల్పించింది. అయితే కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా, అదే సమయంలో కోర్టు తప్పుదోవ పట్టిందని లేదా తమ చర్యలే సరైందని బహిరంగంగా ప్రకటించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని అన్నారు.హైడ్రా HYDRAA కమిషనర్ పలుమార్లు "ల్యాండ్ గ్రాబర్స్ 63 కంటెంప్ట్ కేసులు వేశారు, కోర్టును తప్పుదోవ పట్టించారు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి చేయాల్సినవా అనే ప్రశ్న తలెత్తుతోంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు అనేది కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించనప్పుడు వస్తుంది. ఆ ఆదేశాలు తప్పని భావిస్తే వాటిని చట్టబద్ధంగా సవాలు చేయాలి. కానీ వాటిని ఉల్లంఘించి, అనంతరం కోర్టు తప్పుదోవ పట్టిందని చెప్పడం సరైన విధానం కాదు.ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కూడా హైడ్రాను మరింత బలోపేతం చేస్తామని, కోర్టు అధికారాలపై వ్యాఖ్యానించడం కంటే ముందుగా కోర్టు తీర్పును గౌరవించి, అవసరమైతే చట్టబద్ధంగా అప్పీల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తించాలి అని అన్నారు. ఇటీవల ప్రభుత్వ సమాచార శాఖ (IPR) అధికారిక సోషల్ మీడియా వేదికలో ఐలాపూర్ ప్రాంతంలో 860 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందని ప్రచురించింది. అయితే అదే భూమికి సంబంధించి న్యాయస్థానాల్లో వివాదాలు పెండింగ్‌లో ఉండగా, స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉండగా, కోర్టు తుది నిర్ణయం రాకముందే దానిని ప్రభుత్వ భూమిగా ప్రకటించడం ఏ చట్టబద్ధమైన ఆధారంపై జరిగిందో ప్రభుత్వం ప్రజలకు వివరించాలి.అక్రమ నిర్మాణాల తొలగింపు అవసరమే. కానీ ఆ చర్యలు కూడా చట్టబద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా జరగాలి. బాధితులకు నోటీసులు ఇవ్వడం, వారి వస్తువులు తరలించుకునే అవకాశం కల్పించడం, అద్దెదారుల హక్కులను గౌరవించడం వంటి కనీస న్యాయ ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.నేను గత మూడు సంవత్సరాలుగా అమీన్పూర్, బీరంగూడ, శంభునికుంట తదితర ప్రాంతాల్లోని భారీ చెరువు ఆక్రమణలపై హైడ్రా కమిషనర్‌కు అనేక ఫిర్యాదులు చేశాను. ముఖ్యంగా శంభునికుంట చెరువు శికం భూమిలో నిర్మించబడిన ఐదు అంతస్తుల వాణిజ్య భవనంపై చర్యలు తీసుకోవాలని కోరినప్పుడు, "మిగతా శాఖలను అడగండి" అనే సమాధానం మాత్రమే వచ్చింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో మాత్రం అత్యంత వేగంగా కూల్చివేతలు జరగడం ప్రజల్లో సమాన న్యాయం అమలవుతోందా అనే అనుమానాలకు దారితీస్తోంది.హైడ్రా వంటి సంస్థ చట్ట పరిపాలనను బలోపేతం చేయడానికి ఉండాలి కానీ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా వ్యవహరించకూడదు. భూ చట్టాలు, సాగునీటి చట్టాలు, మున్సిపల్ చట్టాలు, పట్టణాభివృద్ధి చట్టాల అమలులో న్యాయపరమైన అవగాహన, పరిపాలనా సమతుల్యత అత్యంత అవసరం.ఈ అంశాన్ని నేను ఏ వ్యక్తి లేదా ఏ ప్రభుత్వంపై వ్యక్తిగత వ్యతిరేకతతో ప్రస్తావించడం లేదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం, చట్టం, న్యాయస్థానాల పట్ల గౌరవం ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి అధికారి చూపాల్సిన బాధ్యత. కోర్టు తీర్పుతో విభేదిస్తే చట్టబద్ధమైన అప్పీల్ చేయాలి; కానీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం లేదా న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

No comments:

Post a Comment