Thursday, July 2, 2026

_భూ అక్రమణదారులకు అండ... సామాన్య రైతులకు చుక్కలు చూపుతున్నారనే ఆరోపణలు_

*శాలి గౌరారం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందా?*

*భూ అక్రమణదారులకు అండ... సామాన్య రైతులకు చుక్కలు చూపుతున్నారనే ఆరోపణలు*

*లంచం ఇస్తేనే ఫైల్ కదులుతుందా?... జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలకూ విలువ లేదా?*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 02:

నల్లగొండ జిల్లా శాలి గౌరారం తహసీల్దార్ కార్యాలయం ప్రస్తుతం అవినీతి, అక్రమాలు, లంచాల ఆరోపణలకు కేంద్రబిందువుగా మారిందని మండల వ్యాప్తంగా ప్రజలు, రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ కార్యాలయం కొందరు భూ అక్రమణదారులకు రక్షణ కవచంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో ప్రభుత్వ భూములు భూ ఆక్రమణ దారుల చేతుల్లో ఉన్నా వారివద్ద ముడుపులు తీసుకొని చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారు.గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బదిలీపై వెళ్లిన ఎమ్మార్వో అనంతరం.. తహసీల్దార్ కార్యాలయంలో.. ఓ ముఖ్య అధికారి భూ వివాదాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ, నిజమైన రైతుల కంటే అక్రమ పట్టాదారులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.మండలంలోని అనేక గ్రామాల్లో వాస్తవంగా భూమిని సాగు చేస్తున్న రైతుల పేర్లు రికార్డుల్లో లేకపోగా, భూమి కబ్జాలో లేని కొందరి పేర్లపై పట్టాలు కొనసాగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పరిష్కారం చూపకుండా కాలయాపన చేస్తున్నారని వారు చెబుతున్నారు.
*"లంచం ఇస్తేనే పని... లేకపోతే నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే"* అనే పరిస్థితి నెలకొన్నదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ పట్టాలు కలిగిన వారి వద్ద భారీ మొత్తంలో లంచాలు తీసుకుని, నిజమైన భూ హక్కుదారుల వద్ద పదిగుంటల భూమి కి పదిలక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలు, సూచనలను సైతం పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఎమ్మార్వోపై కూడా ప్రభావం చూపుతూ, కార్యాలయంలో తాను చెప్పిందే తుది నిర్ణయంగా అమలు అవుతోందనే వాదనలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.ఈ పరిస్థితులతో మండల వ్యాప్తంగా రైతులు, బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడ ఫిర్యాదు చేసినా స్పందన లేక న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*మండల ప్రజల డిమాండ్లు:*
- శాలి గౌరారం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న అవినీతి వ్యవహారాలపై జిల్లా స్థాయి ప్రత్యేక విచారణ చేపట్టాలి.
- మండలంలోని అన్ని గ్రామాల భూ రికార్డులు, పట్టాలపై సమగ్ర పరిశీలన నిర్వహించాలి.
- అక్రమ పట్టాలు, భూ అక్రమాలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
- నిజమైన భూమి హక్కుదారులకు వెంటనే న్యాయం చేయాలి.
- రెవెన్యూ కార్యాలయంలో పారదర్శక పరిపాలనను అమలు చేసి రైతుల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి.

శాలి గౌరారం రెవెన్యూ కార్యాలయంపై వస్తున్న ఈ ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి స్వతంత్ర విచారణకు ఆదేశించి, వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment