Wednesday, July 22, 2026

ఆర్జీఐఏ RGIA (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో ఆహార దుకాణాల నిర్లక్ష్యం – ప్రయాణికుల హక్కులు ఎక్కడ?_

*ఆర్జీఐఏ RGIA (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో ఆహార దుకాణాల నిర్లక్ష్యం – ప్రయాణికుల హక్కులు ఎక్కడ?*

*ధూళిపాళ సీతారాం - వ్యవస్థాపక అధ్యక్షులు ది సిటిజన్స్ కౌన్సిల్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 21:

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆర్జీఐఏ(RGIA)లో ఆహార దుకాణాల నిర్వహణపై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి గణనీయమైన మార్పు కనిపించడం లేదు. ప్రయాణికుల సౌకర్యం కంటే యూజర్ డెవలప్‌మెంట్ ఫీజులు, ఆహార దుకాణాల అద్దెల వసూళ్లపైనే విమానాశ్రయ యాజమాన్యం, అలాగే భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది అని ది సిటిజన్స్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ధూళిపాళ సీతారాం అన్నారు.FSSAI నిబంధనల ప్రకారం ఆహార దుకాణాలు వినియోగదారులకు సురక్షితమైన తాగునీటిని ఉచితంగా అందించడం తప్పనిసరి అన్నారు. అయితే ఆర్జీఐఏలోని అనేక ఆహార దుకాణాలు తాగునీరు ఇవ్వకుండా, పక్కనే ఉన్న మరో దుకాణానికి వెళ్లాలని లేదా ఒక నిర్దిష్ట బ్రాండ్‌కు చెందిన ఒక లీటర్ నీటి సీసా కొనుగోలు చేయాలని సూచించడం అత్యంత విచారకరం అని అన్నారు. కేవలం ఒక గ్లాసు నీరు కావాలనుకునే ప్రయాణికులను కూడా ఇలా ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదు.ఇప్పటికే ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్నప్పటికీ, కనీస వినియోగదారుల హక్కుగా తాగునీటిని అందించకపోవడం లైసెన్స్ నిబంధనల ఉల్లంఘనే. అలాంటి దుకాణాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? వారి లైసెన్సులను ఎందుకు రద్దు చేయడం లేదు?అని ప్రశ్నించారు.ప్రస్తుత పరిస్థితిని చూస్తే ప్రయాణికుల ప్రయోజనాల కంటే ఒక నిర్దిష్ట బ్రాండ్‌కు చెందిన ఒక లీటర్ నీటి సీసాల విక్రయాలను ప్రోత్సహించడానికే ఆర్జీఐఏ యాజమాన్యం ఆసక్తి చూపుతున్నట్లుగా అనుమానం కలుగుతోంది.ఆర్జీఐఏ యాజమాన్యం మరియు FSSAI వెంటనే జోక్యం చేసుకొని అన్ని ఆహార దుకాణాల్లో ఉచిత తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా కల్పించేలా చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకొని ప్రయాణికుల హక్కులను పరిరక్షించాలి.

No comments:

Post a Comment