Tuesday, July 21, 2026

ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు_

*హైడ్రాకు రెండేళ్లు.. న‌గ‌రంలో సంబ‌రాలు*

*నెక్లెస్ రోడ్డులో ర్యాలీ తీసిన‌ న‌గ‌ర ప్ర‌జ‌లు*

*ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 20:

హైడ్రాకు రెండేళ్లు.. న‌గ‌ర‌వ్యాప్తంగా సంబ‌రాలు.. శ‌నివారం రోజు వివిధ ప్రాంతాల్లో జ‌రిగిన వేడుక‌లు నిరూపించాయి. పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడి మా కాల‌నీల‌కు జీవం పోశార‌ని కొన్ని కాల‌నీల్లో వేడుక‌లు చేసుకోగా.. చెరువుల‌ను పున‌రుద్ధ‌రించి అక్క‌డ ఆహ్లాద‌క‌ర‌ వాతావ‌ర‌ణం ఉండేలా హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంద‌ని మ‌రి కొన్ని ప్రాంతాల వారు సంబ‌రాలు చేసుకున్నారు. కొండ‌లు గుట్ట‌ల‌తో ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణం ఉన్న ప్ర‌భుత్వ భూములు క‌బ్జాలు కాకుండా చ‌ర్య‌లు తీసుకున్నారంటూ మ‌రి కొంత‌మంది వేడుక చేసుకున్నారు.  హైడ్రా ఫెన్సింగ్ వేసి కాపాడిన ప్ర‌భుత్వ భూముల్లో ట‌పాసులు పేల్చి కేరింతలు కొట్టారు.న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగ‌ర్‌, నెక్లెస్ రోడ్డుకు చేరుకుని  భారీ ర్యాలీ తీశారు. ఎన్‌టీఆర్ గార్డెన్ నుంచి లుంబినీ పార్కు వ‌ర‌కూ భారీ ర్యాలీ నిర్వ‌హించి ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసి న‌గ‌రానికి భ‌విష్య‌త్తునిచ్చిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిలువెత్తు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా దేశానికే ఆద‌ర్శ‌మంటూ ప‌లువురు ఈ సంద‌ర్భంగా కితాబునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రాను విస్త‌రించి జిల్లాల్లో కూడా చెరువులు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు డిమాండ్ చేశారు. రెండేళ్ల‌లో 3315 ఎక‌రాల భూమిని కాపాడిన హైడ్రాను అభినందించారు. ఈ భూముల విలువ లెక్క‌ల్లో చూస్తే రూ. 1.50 ల‌క్ష‌ల కోట్లు అయినా.. ప్రాణ‌వాయువును అందించే పార్కుల రూపంలో.. భూగ‌ర్భ జ‌లాల‌ను పెంపొందించి.. వ‌ర‌ద‌ల క‌ట్ట‌డి చేసిన చెరువుల విభాగంలో చూస్తే విలువ అనంత‌మంటూ కీర్తించారు. హైడ్రా ఏర్పాటు చేయ‌డం ప్ర‌భుత్వ సాహ‌సోపేత నిర్ణ‌యంగా ప‌లువురు అభివ‌ర్ణించారు. అనంత‌రం స‌చివాల‌యంలో వివిధ శాఖ‌ల అధికారుల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేశారు.

No comments:

Post a Comment