Monday, February 14, 2022

HYD : ఫ్లైట్‌లో వచ్చి.. సైకిల్‌పై రెక్కీ.. ఇళ్లను గుల్ల చేసి రైల్లో పరారీ

HYD : ఫ్లైట్‌లో వచ్చి.. సైకిల్‌పై రెక్కీ.. ఇళ్లను గుల్ల చేసి రైల్లో పరారీ


Courtesy by : ABN ఆంధ్రజ్యోతి మీడియా ట్విట్టర్ 

  • 14 నేరాలు చేసిన పశ్చిమబెంగాల్‌ ముఠా
  • ఇద్దరు దొంగల అరెస్టు
  • 27.16లక్షల సొత్తు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ : ఫ్లైట్లో నగరానికి వచ్చి సైకిల్‌పై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను రెక్కీ చేస్తారు. ఆ తర్వాత ఇంటిని గుల్ల చేసి రైల్లో పారిపోతారు. ఇలా రాచకొండ, సైబరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో ఇళ్లను దోచేస్తున్న పశ్చిమ బెంగాల్‌ దొంగల ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఇద్దరు దొంగలను, ఒక రిసీవర్‌ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి సైకిల్‌, 520గ్రా. బంగారం, 500గ్రా. వెండి, రూ.91వేలు నగదు సహా మొత్తం రూ.27.16లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనర్‌ సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన రిటైర్డ్‌ వీఆర్వో లక్ష్మీనర్సింహారావు గతేడాది డిసెంబర్‌ 18న కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్లి వచ్చే సరికి దుండగులు ఇంటిని దోచేశారు. ఇంటి వెనకాల ఉన్న డోర్‌ తాళం, అల్మారా, బీరువా తాళాలు పగులగొట్టి 30 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితుడి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


సైకిల్‌పై రెక్కి.. 

సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు కాలనీల్లో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వారు హయత్‌నగర్‌లోని సాహెబ్‌నగర్‌లో రూమ్‌ను అద్దెకు తీసుకున్నట్లు తేల్చారు. దొరికిన టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను బట్టి వాళ్లే ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానించారు. అదే దొంగల ముఠా సూర్యాపేటలో సైతం చోరీలకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టారు. ఈనెల 4న మళ్లీ చోరీ చేసేందుకు వచ్చిన దొంగలను పోలీ సులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం ముషీరాబాద్‌ జిల్లా కోల్‌కతాకు చెందిన రఫికుల్‌ ఖాన్‌, షేక్‌ సూరజ్‌లుగా గుర్తించి రిమాండుకు తరలించారు.

తెలంగాణలో 14 కేసులు 

దోచుకున్న సొత్తును నిందితులు ముషీరాబాద్‌ జిల్లాకు చెందిన అనిల్‌ సీతారాం బండగర్‌, నోబిన్‌, అనే రిసీవర్స్‌కు అమ్మేస్తారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ చోరీల కోసం బయలుదేరుతారని పోలీసుల విచారణలో తేలింది. ఇలా వారిపై కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులున్నాయి. తెలంగాణాలో ఇప్పటి వరకు 14 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. రాచకొండలో 11, సైబరాబాద్‌ లో-1, సూర్యాపేటలో 2 కేసులున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీస్‌ బృందాలను సీపీ అభినందించి రివార్డులు అందజేశారు. 

No comments:

Post a Comment