Monday, February 14, 2022

ఆగేదే, లే! ముందుకెళ్ళాల్సిందే.... మంత్రి కేటీఆర్ ఆదేశం.....!

*ఆగేదే, లే! ముందుకెళ్ళాల్సిందే.... మంత్రి కేటీఆర్ ఆదేశం.....!*

హైదరాబాద్‌: నగరంలో వాన సమస్యలకు ప్రధాన కారణమైన నాలా పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వానొలొచ్చినప్పుడు ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించేందుకు వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్‌ఎన్‌డీపీ) కింద పనులు చేసేందుకు రూ.858 కోట్లు మంజూరు చేసింది.
వివిధ కారణాలతో ఇటీవలి కాలం వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. వర్షాకాలంలోగా ఆ పనుల్ని పూర్తి చేయాల్సి ఉంది. అంటే నాలుగు నెలల్లోగా పనులు జరగాలి. అన్నీ అసాధ్యం కావడంతో అత్యంత సమస్యాత్మక, కీలక ప్రాంతాల్లోని పనులు ప్రాధాన్యతతో చేపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనులకు టెండర్లు ఖరారయ్యాక అంగీకార పత్రం (ఎల్‌ఓఏ) కోసం కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌కు (సీఓటీ) పంపించాల్సి ఉంటుందని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు.

అక్కడి నుంచి ఎల్‌ఓఏ వచ్చాకే కాంట్రాక్టర్లు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ తతంగమంతా జరగడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనుండటం, వర్షాకాలానికి ఇక ఎంతో సమయం లేకపోవడంతో, ఎల్‌ఓఏలు వచ్చేంతదాకా ఆగకుండా టెండర్లు ఖరారైన కాంట్రాక్టర్లతో పనులు చేయించాలని అధికారులకు మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ సూచించారు. నాలా పనుల పురోగతిపై తరచూ సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి దృష్టికి ఈ అంశం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌ఓఏ రాకముందే డీమ్డ్‌ అప్రూవల్‌గా భావించి పనులు చేయించాల్సిందిగా అధికారులకు సూచించినట్లు తెలిసింది. వేసవి కాలంలోగా వీలైనన్ని పనుల్ని పూర్తిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.దీంతోపాటు పనుల్ని త్వరితంగా చేసేందుకు టెండర్ల సమయాన్ని సైతం రెండు వారాల బదులు ఒకవారం గడువుతో పిలవాలని సూచించినట్లు సమాచారం. ఇంజినీరింగ్‌ నిబంధనల మేరకు అత్యవసర పనులకు వారం రోజుల వ్యవధితో స్వల్పకాలిక టెండర్లు పిలవవచ్చు. నాలా పనులు సైతం అత్యవసరమైనవే అయినందున వారం గడువుతో స్వల్పకాలిక టెండర్లు పిలవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఎస్‌ఎన్‌డీపీ ద్వారా చేపట్టేందుకు 55 ప్యాకేజీలుగా పనుల్ని ఖరారు చేయగా, వాటిల్లో 27 ప్యాకేజీల అంచనా వ్యయం రూ.10 కోట్లకు పైగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment