Sunday, February 27, 2022

తెలంగాణ లో ప్రశాంత్ కిషోర్ సర్వే....!

*తెలంగాణ లో ప్రశాంత్ కిషోర్ సర్వే....!*

*సీఎం కేసీఆర్‌తో భేటీ*
*దేశ రాజకీయాలపై చర్చ*

*సీఎం..పీకేల భేటీ దాదాపు ఎనిమిది గంటల పాటు సాగింది.*

*చివర్లో మంత్రి కేటీఆర్‌ సైతం పాల్గొన్నట్లు తెలిసింది* *జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక, భాజపాపై విమర్శలు, వివిధ రాష్ట్రాల్లో స్పందన, పార్టీల* *అభిప్రాయాలను సీఎంకు పీకే నివేదించినట్లు తెలుస్తోంది*

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌(పీకే) ఆదివారం ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్‌లో కలిశారు.ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, అయిదు రాష్ట్రాల ఎన్నికల పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తూ అభిప్రాయాలను సేకరిస్తున్న పీకే బృందం తెలంగాణలోనూ సర్వే నిర్వహించనున్నట్లు సమాచారం. వీరి భేటీని తెరాస వర్గాలు గోప్యంగా ఉంచాయి. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఆయనతో పీకే సమావేశం ఆసక్తి రేపుతోంది. శనివారం ఆయన హైదరాబాద్‌ వచ్చారు. అప్పటికే ప్రకాశ్‌రాజ్‌తో ముఖ్యమంత్రి సమావేశమై ఆయనను గజ్వేల్‌, మల్లన్నసాగర్‌, పోచమ్మసాగర్‌ పర్యటనకు పంపించారు. పీకేను సైతం ప్రాజెక్టులు చూసి రావాలని సూచించారు. ప్రకాశ్‌రాజ్‌ మల్లన్నసాగర్‌ పంపుహౌస్‌ పరిశీలిస్తుండగా...అక్కడికి పీకే వెళ్లారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లను వారు సందర్శించి ప్రాజెక్టుల వివరాలు తెలుసుకున్నారు. నిర్వాసిత కాలనీలకు వెళ్లి స్థానికులతో మాట్లాడారు. కేసీఆర్‌, ప్రశాంత్‌కిశోర్‌ల సమావేశం సుమారు ఎనిమిది గంటల పాటు సాగింది. ఇందులో కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికతో పాటు ఇటీవల ముంబయి పర్యటనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో కేసీఆర్‌ చర్చల సారాంశం, తదితర అంశాలపై కూడా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు, భవిష్యత్‌ కార్యాచరణపై మాట్లాడారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలపై తమ బృంద సర్వేను సైతం పీకే వెల్లడించినట్లు సమాచారం. ఆ తర్వాత తెలంగాణలో సర్వేపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వే ప్రాతిపదికలు, వాటి నమూనాలను పీకేకు చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తగిన సూచనలివ్వాలని ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల సదస్సు గురించి సైతం మాట్లాడినట్లు సమాచారం.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment