Saturday, February 5, 2022

Statue Of Equality: రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?

Statue Of Equality: రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?

  • బళ్ల సతీశ్
  • బీబీసీ ప్రతినిధి

స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ

రామానుజాచార్యులకు హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల గ్రామంలో శంషాబాద్ విమానాశ్రయ దగ్గర్లో ఒక విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇది భారతదేశంలో రెండవ పొడవైన విగ్రహం, ప్రపంచంలోని పెద్ద వాటిలో 26వది అవుతుందని దాన్ని నిర్మించిన వారు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయస్తులైన శ్రీ వైష్ణవ పీఠాధిపతి త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి తన ఆశ్రమ ప్రాంగణంలో దీన్ని నిర్మిస్తున్నారు.

2014 నుంచి ఈ ప్రతిపాదనలు ఉండగా, ఇది 2021లో పూర్తయింది.

విశిష్టాద్వైత సిద్ధాంతకర్త రామానుజాచార్య జన్మించి 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా రామానుజ సహస్రాబ్ది సమారోహాన్ని నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతున్నట్లు ప్రకటించారు.

Statue Of Equality

విగ్రహం ప్రత్యేకతలు:

ఈ వాస్తవ విగ్రహం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. రామానుజాచార్య చేతిలోని త్రిదండం (సాధారణంగా వైష్ణవ పీఠాధిపతుల చేతిలో ఉంటుంది) ఎత్తు 135 అడుగులు.

మొత్తం వేదిక ఎత్తు 54 అడుగులు, పద్మ పీఠం ఎత్తు 27 అడుగులు. ఈ వేదికకు భద్రపీఠం అని పేరు పెట్టారు.

కింద పీఠంతో కలపి 216 అడుగులు ఉంటుందీ విగ్రహం. ఆ విగ్రహం ఉండే పీఠంపై 54 కలువ రేకులు, వాటి కింద 36 ఏనుగు శిల్పాలు, కలువ రేకులపై 18 శంఖాలు, 18 చక్రాలు, విగ్రహం దగ్గరకు ఎక్కడానికి 108 మెట్లు ఉన్నాయి.

వివిధ ద్రవిడ రాజ్యాల శిల్ప రీతుల మేళవింపు ఈ విగ్రహంలో కనిపిస్తుంది. విగ్రహం చేతి వేళ్ల గోర్ల నుంచి 135 అడుగుల భారీ దండం వరకూ ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ నిర్మాణం చేశారు. విగ్రహంలో రామానుజులు ధ్యాన ముద్రలో కనిపిస్తారు.

ఆ భద్రపీఠంలో 120 కేజీల బంగారు విగ్రహం పెడుతున్నారు. రామానుజాచార్య 120 ఏళ్లు జీవించారని, కాబట్టి అన్ని కేజీల బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు ప్రకటించారు.

సమతా మూర్తి వద్ద చిన్న జీయర్, కేసీఆర్ దంపతులు, మనవడు, మైహోమ్ రామేశ్వరరావు

కేవలం విగ్రహమే కాకుండా, అక్కడ మరో 108 చిన్న దేవాలయాలను నిర్మిస్తున్నారు. శ్రీ వైష్ణవ శాఖలోని వారు విష్ణువు, విష్ణువు అవతారాలకు చెందిన మొత్తం 108 గుళ్లను 108 దివ్య దేశాలుగా భావిస్తారు. ఆ దివ్య దేశాలన్నటినీ పోలిన నమూనా దేవాలయాలను ఇక్కడ నిర్మిస్తున్నారు. వాటిని కూడా ప్రత్యేకంగా అందంగా మలిచారు. హొయసల వాస్తు శైలిలో ఈ నిర్మాణాలు ఉంటాయి. మొత్తం 468 స్తంభాలు ఇక్కడ ఉంటాయి. వివిధ ప్రాంతాల శిల్పులు, నిపుణులు దీనికి పనిచేశారు.

ఈ విగ్రహాలకు అదనంగా అక్కడ రామానుజల జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీ, వైదిక్ లైబ్రరీ, పండిత సభలకు, సెమినార్లకు ఆడిటోరియం, ఓమ్నీ మాక్స్ థియేటర్ వంటి ఏర్పాట్లు చేశారు. అక్కడే ఒక మ్యూజికల్ ఫౌంటేన్ ఏర్పాటు చేస్తున్నారు.

ఈ విగ్రహానికి సమతా మూర్తి, ఇంగ్లీషులో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు. ''ప్రపంచాన్ని మరింత సమానత్వంతో జీవించగలిగే ప్రదేశంగా మార్చడానికి అందరికీ స్ఫూర్తినిచ్చేలా, సాంస్కృతికంగా ఈ సమతా మూర్తిని సమున్నత ప్రదేశంగా ఉంచాలనుకుంటున్నాం. వసుధైక కుటుంబం అనే భావాన్ని చాటేలా, రామానుజ సహస్రాబ్దిని జరుపుకుంటున్నాం. లక్షలాది మందిని సామాజిక వివక్ష నుంచి విముక్తి చేసిన వ్యక్తి రామానుజులు'' అని ప్రకటించారు చిన్న జీయర్.

వెయ్యి కోట్ల ప్రాజెక్ట్:

మొత్తం ప్రాజెక్టుకు 1,000 కోట్ల ఖర్చు అవుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మొత్తం స్థలం 45 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ఆ స్థలాన్ని ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వర రావు విరాళంగా ఇచ్చినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మీడియాకు తెలిపారు. జూపల్లి రామేశ్వర రావు మై హోమ్స్ గ్రూపు అధినేత. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితులు. ఈ వెయ్యి కోట్ల మొత్తాన్ని విరాళాల ద్వారానే సేకరించినట్టు జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమి (జీవా) ప్రకటించింది. వెయ్యి కోట్లలో వాస్త విగ్రహానికి 130 కోట్లు (పన్నులు కాకుండా) అయినట్టు ఆ సంస్థ ప్రకటించింది.

మేడిన్ చైనా:

చైనా దేశంలోని నాన్జింగ్ నగరానికి చెందిన చెంగ్యాంగ్ గ్రూపులో భాగమైన ఏరోజన్ కార్పొరేషన్ అనే కంపెనీ ఈ విగ్రహ నిర్మాణంలో భాగస్వామైంది. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ అనేక భారీ విగ్రహాలను రూపొందించింది. ఇందులో 7 వేల టన్నుల పంచలోహాలను ఉపయోగించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.

బంగారు, వెండి, రాగి, కంచు, జింక్ పదార్థాలు ఉపయోగించారు. ఆరోజన్ కార్పొరేషన్ కీ, జీవా సంస్థకీ మధ్య విగ్రహ నిర్మాణం కోసం 2015 ఆగస్టు 14న ఒప్పందం కుదిరింది. దీనికి ప్రధాన స్థపతిగా డీఎన్వీ ప్రసాద్ వ్యవహరించారు. విగ్రహ నిర్మాణ ఒప్పందంపై జీవా తరపున రామేశ్వర రావు, ఆరోజన్ కార్పొరేషన్ తరపున జనరల్ మేనేజర్ మి జావో హుయా (MI ZHAO HUA) సంతకాలు చేశారు. భారతదేశానికి చెందిన ఒక కంపెనీతో పాటూ, వేర్వేరు దేశాలకు చెందిన అనేక కంపెనీలు పోటీ పడగా, చైనా కంపెనీకి ఈ పని అప్పగించారు.

ఎవరీ రామానుజులు:

''అందరి దుఃఖాలూ దూరం చేయడానికి నేనొక్కడినే నరకంపాలైనా ఆనందంగా అంగీకరిస్తాను. మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే. అతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉంది. ఆతని ఆలయం ప్రవేశించే అర్హత కులాలకు అతీతంగా అందరిదీ''.. ఇవి రామానుజులు వేర్వేరు సందర్భాల్లో చెప్పిన మాటలు.

రామానుజాచార్య హిందూమతానికి చెందిన భక్తి ఉద్యమకారులు, సిద్ధాంతకర్త. క్రీస్తు శకం 1017లో పుట్టి 1137లో సమాధి అయ్యారు. తమిళనాడులో శ్రీపెరంబుదూరులో బ్రాహ్మణ కులంలో పుట్టారు. కాంచీపురంలో చదువుకున్నారు. అక్కడి వరదరాజ స్వామిని పూజించారు. శ్రీరంగం వీరి ప్రధాన కేంద్రం. ఆయన సమాధి (బృందావనం లేదా తిరుమేని) ఇప్పటికీ శ్రీరంగం రంగనాథ స్వామి గుడిలో ఉంది.

విశిష్టాద్వైతం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని పాటించేవారినే శ్రీ వైష్ణవులుగా గుర్తిస్తారు. నుదుటన నిలువు నామం పెట్టుకుని భుజాలపై శాశ్వతంగా, శంఖ చక్రాల ముద్రలు వేసుకోవడం ఈ శాఖ/మతం లక్షణం. ఈ మత శాఖకు చెందిన సన్యాసాశ్రమం తీసుకున్న వారిని జీయర్లు అంటారు. ఇలయ పెరుమాళ్, ఎంబెరుమానార్, యతిరాజ, భాష్యకార వంటి పేర్లున్నాయి. వేదార్థ సంగ్రహం, శ్రీ భాష్యం, గీతా భాష్యం వంటి గ్రంథాలు రాశారు. శంకరాచార్యుల అద్వైతాన్ని సిద్ధాంతపరంగా తీవ్రంగా విభేధించారు.

శ్రీవైష్ణవుల మాటల్లో చెప్పాలంటే..‘‘ గోష్ఠీపూర్ణుడనే గురువు చెప్పిన రహస్య అష్టాక్షరీ మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు అన్న నిబంధన ఉన్నప్పటికీ, గుడి గోపురం ఎక్కి గట్టిగా అందిరికీ వినిపించేలా చెప్పారు. ఎవరికైనా చెబితే విన్న వారు పుణ్యాత్ములు, చెప్పిన వారు పాపాత్ములు అవుతారన్న నిబంధనను కావాలని అతిక్రమించారు. అందరికీ పుణ్యం వచ్చినప్పుడు తనకు పాపం వచ్చినా పర్వాలేదనేది ఆయన సిద్ధాంతం. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయ పూజా విధానాన్ని వ్యవస్థీకృతం చేసి, పర్యవేక్షణకు అక్కడ జీయంగార్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. కులోత్తుంగ చోళుడు శైవ మత భక్తితో వైష్ణవులను హింసిచినప్పుడు అక్కడ నుంచి తరలించిన ఉత్సవ మూర్తులతో తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడి కట్టించారు. కొన్ని దేవాలయాలలో దళితుల ఆలయ ప్రవేశానికి కృషి చేశారు. కింది కులాల వారిని వైష్ణవులుగా (మతం) మార్చారు. కొందరికి ఆలయంలో అర్చకత్వ అవకాశం కూడా కల్పించారు’’.

భారీ యజ్ఞం:

ఆధునిక ప్రపంచ చరిత్రలో పెద్దదిగా చెబుతోన్న ఒక యజ్ఞం కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చేస్తున్నారు. 144 హోమశాలలు, 1035 యజ్ఞ కుండాలు, 5 వేల మంది వేద పండితులతో శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం చేస్తున్నారు. 14 రోజుల పాటు సాగే ఈ యజ్ఞంలో నాలుగు వేదాల్లోని 9 శాఖల మంత్రాలు చదువుతారు. నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని కోటి సార్లు జపించనున్నారు. దీని కోసం లక్షన్నర కేజీల స్వచ్ఛమైన నెయ్యి దేశీ ఆవుల పాల నుంచి సేకరించారు. రాజస్థాన్ పత్మెద (Pathmeda) ప్రాంతం నుంచి ఈ నెయ్యి సేకరించారు. ఇందుకు ఆరు నెలల సమయం పట్టింది. యజ్ఞాల కోసం మాత్రమే వాడే నాలుగు రకాల చెట్లకు చెందిన సమిధలు సేకరించారు.

ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ 216 అడుగుల విగ్రహం, 108 దివ్యదేశాలను ఆవిష్కరిస్తారు. ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామనాథ కోవింద్ 120 కేజీల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 14 రోజుల పాటూ జరిగే ఈ ఉత్సవాల్లో వీరే కాకుండా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటారు.

హైదరాబాద్‌కి కొత్త ఆకర్షణ:

హైదరాబాద్ లో ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలతో పాటు ఈ విగ్రహం కూడా ఒక కొత్త ఆకర్షణ కానుంది. యాదాద్రి దేవాలయంతో పాటు రామానుజ విగ్రహం కూడా విష్ణు భక్తులను, ఇతరులను ఆకర్షించి, హైదరాబాద్ పర్యటనలను పెంచే అవకాశాలు ఉన్నాయి.

సోషల్ మీడియాలో చర్చ:

అయితే ఇంత భారీ విగ్రహం ఏర్పాటుపై, ఆ విగ్రహానికి సమతా మూర్తి అని పెట్టిన పేరు తీవ్రమైన చర్చ జరిగింది. రామానుజులు కొంత అభ్యుదయ భావాలు బోధించి ఉండవచ్చు కానీ, అవి కుల వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపినవి కావు అంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెట్టారు. అదే సమయంలో, ఈ విగ్రహాన్ని నిర్మిస్తోన్న చిన్న జీయర్ స్వామి గతంలో ‘‘కులాలు పోకూడదు, కులాలు ఉండాలి, ఎవరి పని వారు చేసుకోవాలి’’ అని చెప్పిన మాటలు కూడా విమర్శలకు దారి తీసాయి. ఇంత ఖర్చుతో భారీ విగ్రహం పెట్టడంపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

రామానుజాచార్యవిగ్రహాలు మంచివే. సమాజంపై తమ ప్రభావం చూపిన సంస్కర్తలు, ఇతర గొప్ప పనులు చేసిన వారి జ్ఞాపకార్థం విగ్రహాలు పెట్టొచ్చు. కానీ మరీ భారీ విగ్రహం, దాని అనుబంధ అంశాల కోసం వెయ్యి కోట్లు పెట్టడం కంటే ఆయన పేరిట ఒక విశ్వవిద్యాలయం పెట్టదమో, లేదా ఏదైనా యూనివర్సిటీలో రామనుజం ఫండ్ లేదా రామానుజం రీసెర్చ్ సెంటర్ వంటివి పెడితే ఇంకా బావుండేది. అమెరికా, యూరోప్ లలో ధనికులు ఇలా చేస్తుంటారు. ఆయా పరిశోధనలు వారి పేరిటే వెళతాయి. ఈ వెయ్యి కోట్లనూ సమాజానికి ప్రత్యక్షంగా ఉపయోగపడేలా ఏదైనా చేస్తే బావుండేది. ఉదాహరణకు రామానుజుల సిద్ధాంతాలకు అప్పట్లో వచ్చిన స్పందన, తరువాత మారిన విధానం, వెయ్యేళ్లలో ఆ సిద్ధాంతాల పరిణామ క్రమం, ఆ తాత్విక చింతనతో వచ్చిన సామాజిక మార్పు, ఆ సిద్ధాంతాలపై వచ్చిన విమర్శ, అభివృద్ధి వంటి వాటిపై డబ్బు ఖర్చు చేస్తే మరింత లాభదాయకం. అంబేడ్కర్ ఆలోచనలపై రీసెర్చ్ జరిగితే ఎక్కువ లాభం తప్ప, వంద అడుగుల అంబేడ్కర్ విగ్రహం వల్ల జరగదు. అలాగని అసలు విగ్రహమే వద్దని కాదు. రామానుజుల విషయంలోనూ అంతే. ఆ డబ్బును జ్ఞాన సముపార్జనపై ఖర్చు చేస్తే అప్పుడు నిజంగా వెనుకబాటుతనం పోతుంది. మరో చిత్రమైన విషయం ఏంటంటే.. రామానుజులు చాలా సాధారణ జీవితం గడిపారు. అలాంటి వ్యక్తి జ్ఞాపకార్థం ఇంత ఖర్చుపెట్టడం కాంట్రడిక్షన్. రామానుజుల సిద్ధాంతాన్ని ఒప్పుకోని వారు కూడా, ఆయనొక ముఖ్యమైన భారతీయ తత్త్వవేత్తగా అంగీకరిస్తారు. ఆయన సిద్ధాంతాల ప్రభావం, దానివల్ల వచ్చిన సామాజిక పరిణామం వంటివాటిపై అధ్యయనానికి డబ్బు ఖర్చు చేస్తే బావుండేది. రామానుజుల విగ్రహమే కాదు, మరెవరి విషయంలో అయినా ఇదే వర్తిస్తుంది'' అని బీబీసీతో చెప్పారు ఉస్మానియా విశ్వవిద్యాల రిటైర్డ్ ప్రొఫెసర్ కె శ్రీనివాసులు.

No comments:

Post a Comment