ఉక్రెయిన్ ను వీడాలని ఫిబ్రవరి 15నే అత్యవసర ప్రకటన జారీ చేసిన ఇండియన్ ఎంబసీ – హెచ్చరికల్ని పట్టించుకోని భారతీయులు
Courtesy by : MyIndMedia Twitter
భయపడ్డట్టుగానే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. దీంతో ఉక్రెయిన్లో చిక్కుకున్నభారతీయులు ఆందోళన చెందుతున్నారు. విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రత్నామ్నాయ మార్గాల్లో విద్యార్థులు సహా అక్కడున్న 18 వేల మంది భారతీయుల తరలింపునే ప్రాథామ్యాంశంగా తీసుకుంది భారత్.
గురువారం ఉక్రెయిన్లో సైనిక చర్యను ప్రకటించారు పుతిన్. ఆ వెంటనే భారత విదేశీ మంత్రిత్వ శాఖ పౌరుల కోసం రంగంలోకి దిగింది. వైద్య విద్య కోసం వెళ్లిన విద్యార్థులు సహా దాదాపు 18 వేల మంది భారతీయులు అక్కడ ఉన్నారని… విదేశాంగ శాఖ వారిని కాపాడే, తరలించే చర్యల్లో నిమగ్నమై ఉందని… విమాన సర్వీసులు మూతపడడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని , అక్కడున్నవారి కుటుంబసభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్ తెలిపారు. ఇప్పటివరకు రెండు విమానాల్లో భారతీయులు వచ్చారు.
అసలైతే రష్యా ఉక్రెయిన్ పై ఆకస్మిక దాడేం చేయలేదు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన విదేశాంగ శాఖ… దేశం విడిచి రావాలని అక్కడి భారతీయులకు సూచించింది. రష్యా సరిహద్దులో భారీ సైనిక సమీకరణ చేసినప్పుడే అప్రమత్తమైంది. రాబోయే ప్రమాదం గురించి హెచ్చరిస్తూ …ముఖ్యంగా విద్యార్థులు తాత్కాలికంగా భారత్ రావడానికి ఏర్పాట్లు చేసుకోమని, అందరిని తప్పని సరిగా భారత ఎంబసీ తో టచ్ లో ఉండమని చెప్తూ ఈనెల 15నే ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు, ఈ మెయిల్ ఐడీ కూడా ఇచ్చింది. అయితే అప్పుడెవరూ ఎంబసీ ప్రకటనను పట్టించుకోలేదు. ఇప్పుడిక యుద్ధం మొదలయ్యేసరికి వారంతా ఆందోళనచెందుతున్నారు.
రష్యాతో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తత దృష్ట్యా భారతీయ విద్యార్థులందరూ ఉక్రెయిన్‌ను విడిచిపెట్టాలి. ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. వీలైనంతవరకు స్వదేశానికి వెళ్లడం మేలు. ఎంబసీ తో టచ్ లో ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో వారిని సంప్రదించండి” అని స్పష్టమైన ప్రకటన జారీ చేశారు అక్కడి ఎంబసీ అధికారులు.
ప్రకటన జారీ చేసిన మరుసటిరోజే …అంటే ఫిబ్రవరి 16న భారత ప్రభుత్వం విమానాల సంఖ్యపై పరిమితులను కూడా తొలగించింది. ఉక్రెయిన్, భారత్ మధ్య తరలించాల్సిన ప్రయాణీకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని..వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ద్వైపాక్షిక ఒప్పందం కింద పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ విమానాల సంఖ్యపై పరిమితిని ఎత్తివేసింది.
2022 ఫిబ్రవరి 22, 24 , 26 తేదీల్లో భారతదేశం -ఉక్రెయిన్ మధ్య మూడు విమానాలను నడుపుతున్నట్లు ఫిబ్రవరి 18నే ఎయిర్ ఇండియా ప్రకటించింది. అయితే ఎవరూ భారత్ తరలివచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ఎవరూ విమాన టికెట్లు తీసుకోలేదు. దీంతో ఫిబ్రవరి 20న విమానాలను రీషెడ్యూల్ చేస్తూ వాయిదా వేసింది.
అదే రోజు అక్కడి భారతీయులకోసం మరోసారి అత్యవసర ప్రకటన జారీచేసింది. ఉక్రెయిన్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయని.. అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయని విద్యార్థులు సహా భారతీయ పౌరులు తాత్కాలికంగా ఆ దేశాన్ని వీడత తప్పదని ఎంబసీ తెలిపింది. ఇక 22 న మూడోసారి అలాంటి ప్రకటనే జారీ చేసింది. అయినా ఎలాంటి స్పందనా రాలేదు. చూస్తుండగానే యుద్ధమేఘాలు ఉక్రెయిన్ ను కమ్మేశాయి. ఇప్పుడు అక్కడ చిక్కుకుంటున్న వాళ్లు లబోదిబోమంటున్నారు. తమను కాపాడాలంటూ భారత ప్రభుత్వానికి మొర పట్టుకుంటున్నారు.
ఇంకా అక్కడ దాదాపు 18 వేలమందికిపైగా ఉన్నారు. వారిని ఎయిర్ రూట్ ద్వారా తీసుకువచ్చే పరిస్థితులు లేవు. అందువల్ల ఉక్రెయిన్ నుంచి అక్కడి రోడ్డు మార్గంతో సంబంధాలున్న హంగేరీ, పోలాండ్, స్లోవేకియా,రొమేనియా నుంచి విదేశీ మంత్రిత్వ శాఖ బృందాలు ఉక్రెయిన్‌తో ఆనుకుని ఉన్న భూ సరిహద్దులకు వెళ్తున్నాయి. సరిహద్దు పాయింట్లకు సమీపంలో ఉన్న భారతీయులు తమను సంప్రదించవచ్చని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
No comments:
Post a Comment