Tuesday, February 1, 2022

సుప్రీంలో కేసు.. జర్నలిస్టుల భూమిలో ఐటి టవర్స్

సుప్రీంలో కేసు.. జర్నలిస్టుల భూమిలో ఐటి టవర్స్

Courtesy by : Q Group Media 

హైదరాబాద్ : 15 సంవత్సరాలుగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారు." ఇగ ఇస్తాం .. అగ ఇస్తాం" అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రతి ఎన్నికల సందర్భంగా జర్నలిస్టులకు కచ్చితంగా ఇళ్ల స్థలాలను ఇస్తామని నమ్మిస్తూ వస్తున్నారు. జర్నలిస్టులకు జాగ వచ్చుడు లేదు.. ఆశ చావడం లేదు... 2007 నుంచి సీనియర్ జర్నలిస్టులుగా ఉన్న వారందరికీ హైదరాబాద్ లో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేట్ బషీరాబాద్, నిజాంపేట ప్రాంతాలలో కొంత భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అందులో సీనియర్ జర్నలిస్టులను గుర్తించి దాదాపు 1140 మందిని ఎంపిక చేశారు. వీరందరి నుంచి అప్పట్లో ఒక్కొక్కరి నుంచి రూ. రెండు లక్షల చొప్పున వసూలు చేసి 'జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ" పేరుతో ప్రభుత్వ ఖాతాలో దాదాపు 22 కోట్ల రూపాయలను జమ చేసింది. అప్పటి నుంచి ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే, కాలక్రమేణా ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ, ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఖచ్చితంగా మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని పలు సందర్భాలలో హామీ ఇచ్చారు. అయినప్పటికీ, ఆచరణలో పెట్టకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇదే విషయంపై జర్నలిస్టులు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కు కూడా వినతి పత్రాలు సమర్పించి అడిగినప్పుడు తాను బాధ్యత తీసుకుని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, అందులో, అందమైన భవనాలు నిర్మిస్తామని హామీలు గుప్పించారు.
సుప్రీంలో కేసు ఉండగా "ఐటీ"కి ఎలా ఇస్తారు..?
2007లో పేట్ బషీరాబాద్ లోని సర్వే నంబరు 25 /2లో 38 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయిస్తూ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దికాలం తరువాత రాష్ట్ర హైకోర్టు జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వరాదని కొంతమంది వేసిన పిటీషన్ల ఆధారంగా ఈ ఉత్తర్వులు కొట్టివేసింది. దీంతో, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తదనంతరం సుప్రీంకోర్టు వాదోపవాదనలు విని మధ్యంతర తీర్పును ఇచ్చింది. జర్నలిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములను డెవలప్ చేసుకోవచ్చని.. ఆయా భూములను సొసైటీలకు అప్పగించవచ్చు అని తీర్పు వెల్లడించింది... తదుపరి తీర్పు వచ్చేంతవరకు నిర్మాణాలు మాత్రం చేపట్ట రాదని స్పష్టంగా తీర్పునిచ్చింది. ఇంకా తుది తీర్పు రావాల్సి ఉంది. ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పు కాపీలను ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయడం జరిగింది. ఈ విషయంలో కూడా ముఖ్యమంత్రి తో పాటు ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో సుప్రీంకోర్టులో కేసు ఉండటంవల్ల మీకు ఆ భూములను స్వాధీనం చేయలేకపోతున్నామని అనేక సందర్భాల లో చెప్పినారు. అయినప్పటికీ, ప్రభుత్వంలోని పెద్దలే స్వయంగా ఈ స్థలాన్ని "ఐటీ టవర్ ల " కోసం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఈ భూములపై కేసులు కొనసాగుతున్నా , ఐటీ రంగానికి ఎలా కేటాయిస్తారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. నియమ నిబంధనల ప్రకారం ఏదైనా భూమిపై కోర్టులో వివాదం నడుస్తుంటే దాన్ని 'ఏ ఇతర వ్యక్తులకు గాని సంస్థలకు గాని" అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఉండదు.. అంతిమ తీర్పు వచ్చే వరకు యథాస్థితిని కొనసాగించాల్సి ఉంటుంది.. అయితే, ఇవేమీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు "జర్నలిస్టులు ఏం చేస్తారు లే.. వాళ్లంతా మా చేతిలో ఉన్నారు లే "" .. అనే నిర్లక్ష్య వైఖరితో, నేడు, జర్నలిస్టుల స్థలాన్ని ఐటీ సంస్థలకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం శ్రేయస్కరం కాదు. దీన్ని సంఘటితంగా ఎదుర్కోవలసిన అవసరం ఏర్పడింది... మిత్రులారా మేల్కొండి... ఈ సమయంలో అడ్డుకోకుంటే అసలు ఇళ్లస్థలాలు అనేవి జర్నలిస్టులకు ఎండమావిగా మారుతాయి.

హామీల ముసుగులో కుట్ర:
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో జర్నలిస్టులకు ఎలాంటి అనుమానం రాకుండా హామీ లిస్తూ కాలయాపన పేరుతో కుట్రలు చేసినట్లు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. పేట్ బషీరాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన 38 ఎకరాల స్థలంలో "ట్విన్ ఐటీ టవర్స్" నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జర్నలిస్టులను దగా చేయడమే అవుతుంది. ఫిబ్రవరి 8న, ఈ "ఐటి టవర్స్" కి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ భూమి పూజ కార్యక్రమం స్వయంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరుగనుంది. అంటే ఈ స్థలం జర్నలిస్టులకు ఇవ్వరాదని మంత్రి కేటీఆర్ గట్టిగా నిర్ణయించుకోవడం వల్లనే ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు అర్థమవుతోంది. మొదటి నుంచి మంత్రి కేటీఆర్ కు ఈ పేట్ బషీరాబాద్ స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయించిన విషయం తెలిసినప్పటికీ, ఐటీ కంపెనీలకు దారాదత్తం చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టులకు ఇస్తే ప్రభుత్వానికి "ఏం లాభం" అనే దిశగా ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది. అంతిమంగా జర్నలిస్టులకు స్థలాన్ని ఇవ్వకూడదని అభిప్రాయంతో ప్రభుత్వం స్థలాన్ని ఐటి కంపెనీల కోసం కేటాయించడం అత్యంత బాధాకరం. జర్నలిస్టుల ఈ విషయాన్ని గమనించి ఇళ్ల స్థలాల సాధనకోసం పోరాట కార్యక్రమాలను చేయాల్సిన అవసరం ఉంది. దీనిని అడ్డుకోకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇళ్లస్థలాలు ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి ఉండదు. కావున, విజ్ఞతతో ఆలోచించి "ఐటీ టవర్" నిర్మాణం భూమి పూజ కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా జర్నలిస్టులంతా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది.
 

No comments:

Post a Comment