Wednesday, February 16, 2022

ప్రారంభమైన తెలంగాణ కుంభమేళా సమ్మక్క – సారలమ్మ జాతర – వనదేవతల మహాజాతరకు పోటెత్తుతున్న భక్తకోటి

ప్రారంభమైన తెలంగాణ కుంభమేళా సమ్మక్క – సారలమ్మ జాతర – వనదేవతల మహాజాతరకు పోటెత్తుతున్న భక్తకోటి

తెలంగాణ కుంభమేళాగా చెప్పే సమ్మక్క-సారలమ్మ జాతర నేడు ప్రారంభమైంది. ఈనెల 19 వరకు వనదేవతల మహా జాతర జరగనుంది. అయితే కొద్ది రోజుల ముందునుంచే ములుగు జిల్లాలోని మేడారంలో కొలువైన అమ్మలిద్దరి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతల వేడుక నేపథ్యంలో మేడారం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు ఎత్తు బంగారాలతో వచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. చీర, సారె, పసుపు కుంకుమలు సమర్పించుకుంటున్నారు.


తెలంగాణ మాత్రమే కాక దేశవ్యాప్తంగా జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ప్రతి రెండేళ్లకోసారి జాతర జరుగుతుందది. కుంభమేళ తరహాలో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఓరుగల్లు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం తాడ్వాయ్ మండలంలో జరిగే ఈ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. మొదట్లో గిరిజనులు మాత్రమే జాతరలో పాలు పంచుకునేవారు. రాన్రాను అన్ని అందరూ అమ్మలకు భక్తులైపోయారు. ఇక ఈ ఏడాది తొలిరోజు నుంచి ఇప్పటి వరకు 50 లక్షల మందికి పైగా భక్తులను మేడారం దర్శించుకున్నారు. దర్శనానికి ముందు జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గద్దెలపై కొలువైన అమ్మలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇక ఈ జాతర జరిగే ముఖ్య దినాల కోసం అమ్మవార్లను అడవి మార్గాన తీసుకొచ్చే సందర్భంగా ఉద్వేగభరిత క్షణాలు అక్కడ కనిపిస్తాయి.
మేడారం జాతర వేళ ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం వచ్చే భక్తులంతా తొలుత ఇక్కడే ఆగి గట్టమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేస్తారు. ఇక్కడ పూజలు చేసిన తర్వాతే మేడారం జాతరకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే గట్టమ్మ ఆలయాన్ని గేట్ వే ఆఫ్ మేడారంగా పిలుస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్ద రాజును గిరిజన సంప్రదాయంలో ముందు మేడారానికి చేరుస్తారు. తరువాత అమ్మలిద్దర్నీ గద్దెలకు చేరుస్తారు.
నాలుగు రోజుల జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బేగంపేటలోని పాత ఎయిర్‌పోర్ట్‌లో హెలికాఫ్టర్ సర్వీసును ప్రారంభించారు.

(మైఇండ్ మీడియా ఫేస్‌బుక్, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)

No comments:

Post a Comment