హుజురాబాద్ ఉప ఎన్నికపై ఇంటెలిజెన్స్ సర్వేలు టీఆర్ఎస్‌ను భయపెడుతున్నాయా? సెంటిమెంట్ పార్టీకి ఆ సెంటిమెంటే ఇప్పుడు మంటపెడుతోందా? హుజురాబాద్‌లో ఆ ఉపద్రవం ముంచుకురాకుండా చూసుకోవడం టీఆర్ఎస్ ప్రభుత్వం చేతుల్లో కూడా లేదా?
ఎన్నికలేవైనా సరే.. బరిలోకి దిగే ముందు సర్వేలు చేయించుకోవడం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ముందు నుంచి ఉన్న అలవాటు. ఇందుకోసం స్వయంగా ఇంటెలిజెన్స్ వర్గాలనే ఆయన రంగంలోకి దింపుతుంటారు. వారిచ్చే నివేదికలను బట్టి ఓటర్ల మానసిక పరిస్థితి ఏమిటి? అనుకూలంగా ఉన్నారా లేక వ్యతిరేకంగా ఉన్నారా? ఏం చేస్తే వారి మనసులను మార్చవచ్చు? ఎలా వెళ్తే వారిని గెలుచుకోవచ్చన్నది అన్నవాటిపై సుదీర్ఘ కసరత్తులు చేస్తుంటారు. ఆ అలవాటు ప్రకారం ఇప్పటికే హుజురాబాద్‌లోని ప్రతి ఇంటిని సర్వే చేసేందుకు సుమారు 40 మంది రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను కేసీఆర్ నియమించారని.. ఇప్పటికే రెండు సార్లు సర్వే నివేదికలని కేసీఆర్‌కు సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఇంటింటి సర్వేతో పాటు.. ఈటల ప్రచారానికి వస్తున్న స్పందనపై కూడా ఈ నివేదికల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఫీడ్ బ్యాక్ ఇచ్చాయట. అయితే ఈ నివేదికలు ఇప్పుడు కేసీఆర్‌ను టెన్షన్ పెట్టిస్తున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి.
బైపోల్ వేవ్ ఈటల రాజేందర్‌కే అనుకూలంగా ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌ల్లో కేసీఆర్‌కు తెలిసిందని చర్చ నడుస్తోంది. రెండు సర్వేల్లోనూ స్వల్ప తేడాతో ఈటల వైపు మెజార్టీ ఓటర్లు మొగ్గు చూపించారట. అయితే ఈ నివేదికలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కేసీఆర్ వివరించినట్టుగా సమాచారం. ఉప ఎన్నిక నిర్వహణకు 5 నెలలపైగానే సమయం ఉన్నందున.. ఎంత ఆలస్యంగా నిర్వహించేలా చేసుకోగలిగితే గెలుపునకు అంత మంచి అవకాశాలు ఉన్నాయని నివేదించారట.
హుజురాబాద్‌కు ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘమే. ఇప్పటికే సెప్టెంబర్ 10 లోపు నిర్వహించే యోచనలో ఉందన్న వార్తలు వెలువెడుతున్నాయి. అయితే అంత త్వరగా ఎన్నికలకు వెళ్లడం టీఆర్ఎస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. ఒకవేల ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరితే.. డిసెంబర్‌లోనే నిర్వహిస్తే బాగుటుందని చెప్పాలని డిసైడ్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఈటల మాత్రం ఎంత వీలైతే అంత త్వరగా.. ఎన్నికలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
No comments:
Post a Comment