హైదరాబాద్ : 02/07/2021
భళా కృష్ణమూర్తి.. బాగుందయ్యా నీ సృష్టి!
ప్రపంచంలో ఏ ఆవిష్కరణకైనా మూలం అవసరం. అవసరం ఏదైనా నేర్పిస్తుంది. దేన్నైనా చేధిస్తుంది. ఆ యువరైతు విషయంలోనూ అదే జరిగింది. ఏటా దుక్కి దున్నేందుకు లక్షల రూపాయల ఖర్చు పెట్టీ పెట్టి విసిగిపోయిన అతడు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతికాడు. చివరికి అతని ప్రయత్నం ఫలించి.. అతి తక్కువ ధరలో ట్రాక్టర్‌కు తీసిపోయే వ్యవసాయ యంత్రాన్ని కనుక్కొని నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పల్సర్ బైక్ పార్టులతో.. ట్రాక్టర్ చేసే పనులన్నీ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
భైంసాకు చెందిన ఈ యువరైతు పేరు కృష్ణమూర్తి. మొదటి నుంచి వ్యవసాయంపై ఆసక్తి ఎక్కువ. అయితే తల్లిదండ్రులు దుక్కి దున్నడం కోసం ట్రాక్టర్, కలుపు తీయడం కోసం పదుల సంఖ్యలో కూలీల కోసం ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేయడం, ఆపై ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడం అతన్ని తీవ్ర ఆలోచనలో పడేసింది. తక్కువ ధరలోనే ఈ పనులను చేయలేమా అని ఆలోచించి.. యూట్యూబ్‌లో దాని గురించి బాగా వెతికాడు. రాజస్థాన్‌లో కొందరు యువ రైతులు ట్రాక్టర్ లాగా పనిచేసే చిన్న చిన్న యంత్రాల వాడటాన్ని అందులో చూశాడు. లక్ష రూపాయలతో కల్టీవేటర్, సీడ్ డ్రిళ్లర్, స్ప్రే మిషన్ కొనుగోలు చేశాడు.
తన తగ్గరున్న పల్సర్ బైక్ వెనుక చక్రం తొలగించి.. దాని స్థానంలో వీటిని ఉపయోగిస్తూ దుక్కి దున్నడం, కలుపు తీయడం, విత్తనాలు వేయడం, పురుగుల మందు స్ప్రే చేయడం వంటివన్నీ చేస్తున్నాడు. దీంతో అతని నూతన విధాన వ్యవసాయాన్ని చూసి ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. విషయం ఆ నోటా, ఈ నోటా జిల్లా వ్యాప్తంగా తెలిసిపోవడంతో.. అతని ఆవిష్కరణను చూసేందుకు క్యూకడుతున్నారు. మామూలుగా ఈ పనులన్నీ చేసే యంత్రాలు కొనాలంటే లక్షల రూపాయలు అవసరం అని.. కానీ రూ. లక్షలోపు ఖర్చుతో ఈ పనులన్నీ తాను రూపొందించుకున్న యంత్రంతో చేసుకోగలుగుతున్నానని గర్వంగా చెబుతున్నాడు కృష్ణమూర్తి.
No comments:
Post a Comment