Thursday, July 1, 2021

కారా నుంచి కథకులు నేర్చుకోవాల్సిన విషయాలు......*కొలిమి* (ప్రత్యామ్నాయ కళా సాహిత్య సాంస్కృతిక వేదిక)

దాదాపు నెల రోజులుగా కాళీపట్నం రామారావు గారి మీద విస్తారంగా వచ్చిన వ్యాసాలు చదివాక ఇంకా ఆయన గురించి రాయడానికి ఏముంటుందని అనుకున్నాను, ‘కొలిమి’ టీమ్ ఆయన గురించి నన్ను రాయమన్నపుడు. ఆయన దగ్గరనుంచి పాఠకులు ఏమి ఆశించవచ్చో, చాలా తక్కువగా రాసినా ఆయన కథల్లోని గాఢత గురించి చాలా మంది రాశారు. నన్నడిగితే, కారా గారి దగ్గరనుంచి రచయితలు – ముఖ్యంగా కథకులు – నేర్చుకోవాల్సింది చాలా వుంది. తన చుట్టూ వున్న జీవితాన్ని నిశితంగా గమనించడం, ఆయా సందర్భాల్లో మనుషులు ఎలా ప్రవర్తించారు, అలా ఎందుకు ప్రవర్తించారు, ఆయా సంబంధాలను ప్రభావితం చేస్తున్న శక్తులేమిటి?, ఆ శక్తులు ఎలా ఆపరేట్ అవుతున్నాయి?… ఇలాటి మౌలికమైన గమనింపు అవసరమని ఆయన రచనలు చెప్తాయి.

“సుందరపాలెంలో శ్రీరాములు నాయుడిని, సూర్యంగారిని, లక్ష్మణ నాయుడిని ఎరిగినంతగా స్పష్టంగా మన ప్రధాన మంత్రులను, అంబానీ, హర్షద్ మెహతాలను దగ్గరగా తెలుసుకునే అవకాశం లేదు నాకు,” అని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
మనకి తెలిసిన జీవితాన్ని దగ్గరనుండి చూడడం, అందులోని సంక్లిష్టతలను సంపూర్ణంగా అర్ధం చేసుకుని రాయడం ఎంత ముఖ్యమో, తెలియని జీవితం గురించి రాయకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం.

ఆయన రాసిన కథల్లో ఎక్కువమందికి తెలియని కొన్ని మంచికథలున్నాయి. అందులో చెప్పుకోతగ్గది – ‘అప్రజ్ఞాతం’. ఈ కథని కారా మాస్టారు ఇరవైనాలుగేళ్ల వయసులోనే రాశారంటే ఆశ్చర్యం వేస్తుంది. స్వయంగా లెక్కల మాస్టారు అయివుండడంవల్ల – డబ్బు దానికదే ఎలా పిల్లలు పెడుతుందో, అసలు ‘మిగులు’ ఎలా పుడుతుందో, వడ్డీల వెనక దోపిడీ ఎలావుంటుందో, అసలు కంటే వడ్డీ పెరిగే మాయాలేమిటో, ఆ లెక్కల మతలబు వల్ల డబ్బు కొంతమంది దగ్గర ఎలా పోగుపడుతుందో లెక్కలు వేసి చూపిస్తుంది సుదర్శనం పాత్ర.

కళ్ళు తెరుచుకుని కూడా అబద్దం చెప్పగల వాళ్ళని చూసి ఆశ్చర్యపడతాడు. అవసరమైనపుడు, బ్లాక్ మెయిల్ చెయ్యడానికి, దేవుడి పేరు చెప్పి ఊరంతటికీ విచక్షణ లేకుండా ఎలా చెయ్యగలరో… అని ఆశ్చర్యపోతాడు. గ్రామాల్లో జరిగే దోపిడీని, ఆ దోపిడీ చేసే వాళ్ళ ముందే విప్పి చెప్పే అద్భుత దృశ్యం కనిపిస్తుంది మనకి.

నిజానికి ఈ కథ ఆయన మరో పదిహేను సంవత్సరాల తర్వాత రాసిన ‘యజ్ఞం’ కథకు బీజరూపం. అప్పటినుంచే ఆయన గ్రామాల్లోని కనిపించని హింస గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. నిత్యజీవితంలో ఆర్ధిక దోపిడీని ఇంత నేర్పుగా పట్టుకున్న తెలుగు కథలు బహుశా ఇవే మొదటివి కావచ్చు.

మన చుట్టూ వున్న జీవితంలో కనిపించే, కనిపించని దోపిడీని, సంక్లిష్టతలను, భావోద్వేగాలను, కోపతాపాల వెనుకనున్న ఆర్ధిక సంబంధాలను ఎంత సునిశితంగా గమనించాలో రామారావు మాస్టారి కథలు చదివితే తెలుస్తుంది. సంక్లిష్టతల, భావోద్వేగాల తీవ్రతని ప్రతిఫలిస్తాయి ఆయన కథలు. చావు, ఆర్తి, భయం, సంకల్పం, నవలలు రాయడం నాకు చేతకాక రాయలేదని ఆయన అన్నారు గాని నిజానికి ఆయన కథలు కొన్ని నవల రాయదగ్గ విస్తృతి వుంది. బహుశా కథను వివరంగా రాయాలన్న ఆయన పెట్టుకున్న నియమం కావచ్చు. చిన్న సంఘటననైనా ఆయన చాలా శ్రద్ధగా మనముందు కథను పరుస్తారు. ‘వస్తువు’ పట్ల, దాని నేపథ్యమ్మీద, కథలోని పాత్రలపట్ల ఆయనకున్న సాధికారత వల్ల అది సాధ్యమైందనిపిస్తుంది.

తన కథల్లో ఏ విలువ గురించి చెప్పలేదని ఆయన వినయంగా అన్నారు గానీ ఆయన కథలు సమాజంలోని ద్వంద్వ నీతిని, వివక్షని, వివక్షా రూపాలకు వెన్నుదన్నుగా నిలిచే వ్యవస్థ, స్వార్ధాన్ని, భయాన్ని ప్రతిఫలిస్తాయి. మాస్టారి కథల్లో నాకు ఇష్టమైన కథల్లో ‘భయం’ ఒకటి. పాకుకాటుకి బలయిన వ్యక్తికి పుట్టిన సత్తెయ్య పాముల్ని పట్టడంలో మెళకువులు నేర్చుకుని ఎక్కడ పాము కనిపించినా జనాలు అతడినే పిలిచేస్థాయికి చేరుకుంటాడు. ఒక భద్రజీవి ఇంట్లో పాము చేరితే ఒకామె తన కొడుకుకి ప్రాణాపాయం లేకుండా కాపాడుకుని సత్తెయ్యని ఎలా రప్పించి పాముని దొరకబట్టిస్తోందో, ఈ ప్రాసెస్ లో పాముకాటుకు సత్తెయ్య బలవుతాడో ఈ కథ చెప్తుంది.

సాధారణంగా ప్రతిగ్రామంలో జరిగే తంతు ఇది. పాము భయం గురించి, ఈ భయాన్ని అధిగమించే మనుషుల గురించి, ప్రమాదాలు తమకు జరగకుండా వేరే వాళ్ళ బతుకుల్ని ఫణంగా పెట్టి తాము తప్పించుకునే వారి గురించి — ఒక మామూలు కథ చెప్తూనే, సమాంతరంగా మరో కథ చెప్పేరు మాస్టారు ఈ కథలో. మనకి వాచ్యంగా ఎక్కడా కనబడదు కానీ మనకి స్ఫురిస్తూ ఉంటుంది.

‘జీవాధార’లో మంచినీళ్ల సమస్యగురించి చెప్తూదాని వెనుక సమాజంలో వున్న ఇతర తారతమ్యాల గురించి చెప్తారు. కథని సాదాగా చెప్పడం ఇష్టపడే మాస్టారు, అన్ని రకాల కథల్ని ఆసక్తితో, అకడమిక్ ఇంటరెస్ట్ తో చదివేవారు. కొత్త రచయితల కథల్ని చదివి వాళ్ళతో సంభాషించేవారు. “ప్రయోగం ప్రయోగం కోసం,” ఉండకూడదని, అర్ధవంతమైన కథనరీతులవల్ల ప్రయోజనం ఉంటుందని నమ్మేవారు.

“మంచికి అపకారం, చెడుకు ఉపకారం,” చెయ్యని రచనలు చెయ్యాలని రావిశాస్త్రిగారు చెప్తే, కారా మాస్టారు రచయితలు సత్యానికి, ప్రజలకు జవాబుదారీగా వుండాలని అనేవారు. “నీవు రాసేది సత్యానికి విరుద్ధంగా ఉంటే ఆ వస్తువుని రాయకుండా ఉండడం మంచిది. నువ్వు నమ్మిన సిద్ధాంతానికి ఆ సత్యం అడ్డుపడితే కథ రాయకుండా వుండు కానీ సత్యాన్ని వక్రీకరించకు”, అనేవారు. కారా మాస్టారి రచనలు కథకులు తమను తాము మలుచుకోడానికి ఎంతో ఉపయోగపడతాయి.

రచయిత, జర్నలిస్టు.

No comments:

Post a Comment