Wednesday, October 26, 2022

పసిపిల్లలపై పశుకామం...మతం మాటున గ్రేస్ సంస్థ

పసిపిల్లలపై పశుకామం

_◆ మతం మాటున గ్రేస్ సంస్థ_
_◆ చిల్డ్రన్ హోం పేరిట మైత్రి_
_◆ బాడీ మసాజ్‌లు, ఎన్నో వికృతాలు_
_◆ 85 మందికి విముక్తి_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)

*_మతం మాటున గ్రేస్ అనాథాశ్రమం. చిల్డ్రన్స్ హోం పేరిట మైత్రి అనే సంస్థలు చిన్నారులపై సభ్య సమాజం తలదించుకునే జిగుబ్సాకరమైన అకృత్యాలకు తెగబడ్డాయి. గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న ఈ తంతు ఇప్పుడు బయపపడింది. రెండు సంఘటనలలో గ్రేస్ సంస్థలో ఉన్న 34 మంది బాలికలు, మైత్రి సంస్థ ఉన్న 51 మంది మొత్తం 85 మంది చిన్నారులు స్వేచ్ఛా జీవితంలోకి వచ్చారు._*

*_గ్రేస్‌ అనాథాశ్రమంలో.._*
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నేరెడ్‌మెట్‌లోని జేజేనగర్‌లో ఉన్న గ్రేస్‌ అనాథాశ్రమంలో 14-15 ఏళ్ల మధ్య వయసుగల 34 మంది బాలికలు ఉన్నారు. వీరిపై కొంతకాలంగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. విషయాన్ని బటయకు పొక్కనీయకుండా ఆశ్రమ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం రాత్రి ముగ్గురు బాలికలపై లైంగిక దాడి జరిగిందంటూ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌కు ఫిర్యాదు అందింది. దీంతో.. నేరెడ్‌మెట్‌ పోలీసులు, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు గ్రేస్‌ ఆశ్రమానికి చేరుకుని, విచారణ చేపట్టారు. బాధిత బాలికలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆశ్రమంలోని మిగతా బాలికలను నింబోలిఅడ్డాలోని స్టేట్‌ హోంకు తరలించారు.

బాక్స్
*_మైత్రిలో అకృత్యాలు_*
కూకట్‌పల్లి కేబీహెచ్‌బీ కాలనీలోని మైత్రి చిల్డ్రన్స్‌ హోమ్‌లో బాలికలపై అకృత్యాలు కొనసాగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు దాడులు నిర్వహించి.. నిర్వాహకుడు బీఎల్‌ నర్సింహారావు, అతని కుమారుడు ప్రణీత్‌కుమార్‌లను అరెస్టు చేశారు. మైత్రి చిల్డ్రన్స్‌ హోంలో బాలికలతో వీరిద్దరూ బాడీ మసాజ్‌లు చేయించుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా.. హోంలోని బాలికలతో బాత్‌రూంలను శుభ్రపరచడం, కూరగాయలు తరగడం, గదులను శుభ్రం చేయడం వంటి పనులను చేయించుకుంటున్నారు. ఆ పనులు చేసేందుకు చిన్నారులు నిరాకరిస్తే.. బెల్టుతో కొడుతున్నారు. ఫిర్యాదు అందుకున్న చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు బాల రక్షక్‌ భవన్‌ కో-ఆర్డినేటర్‌ బి.నాగమణి, పీవో ఎన్‌ఐసీ నాగమధు, సఖీ సెంటర్‌ అడ్మిన్‌ నిత్యూష, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ టీమ్‌ సభ్యులు ప్రశాంత్‌, స్వప్న హోమ్‌ను సందర్శించారు. చిన్నారుల వాంగ్మూలం తీసుకున్నారు. తమకు అందిన ఫిర్యాదు నిజమేనని గుర్తించి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడిచేసి, నర్సింహారావు, ప్రణీత్‌లను అరెస్టు చేశారు. వారిపై జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఆశ్రమంలో ఉన్న 51 మంది బాలికలను నింబోలి అడ్డాలోని స్టేట్‌హోంకు తరలించారు. గ్రేస్‌ అనాథాశ్రమం, మైత్రి చిల్డ్రన్‌హోంలను మూసివేస్తున్నట్లు చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ అధికారులు ప్రకటించారు.

No comments:

Post a Comment