*సోనియా ట్రస్ట్ లకు..... ఎఫ్ సీ ఆర్ ఏ లైసెన్సులు రద్దు*
*కేంద్ర హోంశాఖ నిర్ణయం....!*
దిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ నేతృత్వంలోని రెండు స్వచ్ఛంద సంస్థలకు 'విదేశీ విరాళాల నియంత్రణ చట్టం' (ఎఫ్‌సీఆర్‌ఏ) లైసెన్సులను కేంద్ర హోం శాఖ రద్దుచేసింది
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్టు (ఆర్‌జీసీటీ) అనే ఈ రెండు సంస్థలు చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ అధికారులు ఆదివారం ప్రకటించారు. 2020లో హోంశాఖ ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం చేపట్టిన విచారణ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలులో అక్రమాలు, చైనా సహా పలు దేశాల నుంచి అందిన నిధుల దుర్వినియోగం, నగదు అక్రమ చలామణి తదితర ఆరోపణలు ఈ సంస్థలపై వచ్చాయి. ఆర్‌జీఎఫ్, ఆర్‌జీసీటీ రెండింటికీ సోనియాగాంధీ అధ్యక్షురాలు.
రెండు ట్రస్టుల్లో ఇతరులతో పాటు ట్రస్టీగా రాహుల్‌గాంధీ ఉన్నారు. రెండు సంస్థలూ పార్లమెంటు సమీపంలోని జవహర్ భవన్ నుంచి పనిచేస్తాయి. ఇందిరాగాంధీ స్మారక ట్రస్టు కార్యకలాపాలపైనా విచారణ జరిగినా, దానిపై ప్రస్తుతానికి చర్యలేమీ తీసుకోలేదు. 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.
భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆ సమయంలో ఆర్‌జీఎఫ్‌పై పలు ఆరోపణలు చేశారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే కొన్ని అధ్యయనాలు చేపట్టడానికి 2005-09 మధ్య ఆర్‌జీఎఫ్‌కు నిధులు అందాయని ఆరోపించారు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు మెహుల్ ఛోక్సీ వంటి వారి నుంచి ఆ సంస్థలకు నిధులు వచ్చాయనీ, అప్పట్లో ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి కూడా డబ్బును వీటికి మళ్లించారని చెప్పారు. 2005-06 వార్షిక నివేదిక ప్రకారం.. ఆర్‌జీఎఫ్‌కు నిధులు అందించిన దేశాల జాబితాలో చైనా ఉంది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment