Thursday, October 27, 2022

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు.... హైకోర్టులో బిజెపి పిటిషన్.....!

*మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు.... హైకోర్టులో బిజెపి పిటిషన్.....!*

హైదరాబాద్‌: మొయినాబాద్‌ ఫాంహౌజ్‌ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బీజేపీ గురువారం ఒక రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించాలని బీజేపీ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.

రాష్ట్ర పోలీసుల వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాన్ని వేయాలని కోరింది. సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పిటిషన్‌లో బీజేపీ అభ్యర్థించినట్లు తెలుస్తోంది.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని ఫిరాయింపు కోసం ప్రలోభ పర్వానికి గురిచేసే క్రమంలో భారీ ఆపరేషన్‌ను చేపట్టినట్లు సైబరాబాద్‌ పోలీసులు ప్రకటించుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఈ మేరకు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. బీజేపీ పార్టీ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్‌ఎస్‌ కుట్ర చేసిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ డీజీపీ,సైబరాబాద్ పోలీస్ కమీషనర్, రాజేంద్ర నగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో, ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్.

బీజేపీ పార్టీ ప్రచారాలను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు అందులో భాగంగానే మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన అని పిటిషనర్‌ పేర్కొనగా.. ఈ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment