Sunday, October 30, 2022

భారత విద్యార్థులకు భారీ...... ఊరట

*భారత విద్యార్థులకు భారీ...... ఊరట*

*అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనుకుంటున్న భారత విద్యార్థులకు భారీ ఊరట లభించింది.*

హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో (United States) ఉన్నత విద్యనభ్యసించాలనుకుంటున్న భారత విద్యార్థులకు (Indian Students) భారీ ఊరట లభించింది. యూఎస్ ప్రభుత్వం శనివారం భారీ సంఖ్యలో స్టూడెంట్ వీసా (F-1 Student Visa) స్లాట్లను విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎంబసీతో పాటు హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, చెన్నైలోని అన్ని కాన్సులేట్లు ఏకకాలంలో స్లాట్లను విడుదల చేశాయి. దాంతో ఇంటర్వ్యూ సమయాల కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్ ఒక్కసారిగా ప్రయత్నించటంతో సంబంధిత సైట్లు నెమ్మదించాయి. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ప్రారంభకానున్న అగ్రరాజ్యంలోని పలు యూనివర్శిటీల తరగతులకు అనుగుణంగా తాజాగా భారత విద్యార్థుల కోసం అమెరికా ప్రభుత్వం విద్యార్థి వీసాల స్లాట్లను (Studen Visa Slots) విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. ఈ ఏడాది జూలై, ఆగస్టుతో ముగిసిన విద్యా సంవత్సరంలో దాదాపు 82వేల మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలను (F-1 Visas) యూఎస్ జారీచేసిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఇండియన్ స్టూడెంట్స్ (Indian Students)కు అమెరికా ఇంత భారీ మొత్తంలో వీసాలు ఇవ్వడం ఇదే మొదటిసారి. అంతేగాక త్వరలో ప్రారంభంకానున్న విద్యా సంవత్సరంలోనూ ఇదే మాదిరిగా భారీగానే వీసాలు జారీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇక వీసాల జారీలో చోటు చేసుకుంటున్న ఆలస్యాన్ని నియంత్రించేందుకు యూఎస్ గవర్నమెంట్ పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించి ఇంటర్య్యూ అధికారులుగా ఇటీవలే ఇండియాకు పంపించింది. తాజాగా వారు కాన్సులేట్ ఆఫీసుల్లో విధుల్లో చేరటంతో శనివారం భారీగా స్లాట్లు విడుదల చేయడం జరిగింది. కాగా, స్లాట్లు విడుదలైన క్షణాల్లోనే నవంబర్ నెల కోటా పూర్తికావడం విశేషం. నవంబర్ రెండోవారంలో మరోదఫా మరికొన్ని స్లాట్లు విడుదల చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఇలా రెండు దఫాలుగా స్లాట్లు విడుదల చేయనున్నట్లు ఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో మినిస్టర్ కాన్సులర్ డాన్ హెప్లిన్ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment