Tuesday, October 11, 2022

16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. ఫిబ్రవరిలో మెయిన్స్‌

16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. ఫిబ్రవరిలో మెయిన్స్‌


16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. ఫిబ్రవరిలో మెయిన్స్‌
  • గ్రూప్‌-1లో తొలిసారి బయోమెట్రిక్‌
  • మూడు రోజుల్లో ప్రాథమిక ‘కీ’
  • బబ్లింగ్‌లో తప్పులుంటే నో కరక్షన్‌
  • 2 గంటల ముందే రావాలి
  • త్వరలో గ్రూప్‌-2, 3
  • నమస్తే తెలంగాణతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 11 (నమస్తే తెలంగాణ): గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. 16వ తేదీన 33 జిల్లా కేంద్రాల్లో 1,019 సెంటర్లలో పరీక్ష జరగనున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్‌-1లో టీఎస్‌పీఎస్సీ కీలక మార్పు చేసింది. తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశ పెట్టబోతున్నది. తొలిసారిగా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా జంబ్లింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్ల గురించి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్ధన్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. పరీక్ష నిర్వహించే తీరు, కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలు ఆయన మాటల్లోనే..

మాస్‌ కాపీయింగ్‌కు చెక్‌…
గ్రూప్‌-1 పరీక్షల్లో కొత్తగా ఎన్నో సవరణలు చేశాం. ప్రశ్నలను భారీగా జంబ్లింగ్‌ చేశాం. ఇప్పటివరకూ ఏ, బీ, సీ, డీ సిరీస్‌ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు వరుస క్రమంలో ఇచ్చేవారు. కానీ ఇకపై ఎక్కువ సిరీస్‌లలో వచ్చేలా ప్రశ్నపత్రాలను సిద్ధం చేశాం. ఆ ప్రశ్నలను కంప్యూటర్‌లో జంబ్లింగ్‌ చేశాం. ఉదాహరణకు.. రాము, రాజేశ్‌ పక్కపక్కనే కూర్చున్నారు. రాముకు ఒకటో నంబర్‌లో ఒక ప్రశ్న వస్తే.. రాజేశ్‌కు అదే ఒకటో నంబర్‌లో మరో ప్రశ్న వస్తుంది. రాముకు 1వ నంబర్‌లో వచ్చిన ప్రశ్నకు 4 చాయిస్‌లు ఒకలా ఉంటే.. రాజేశ్‌కు అదే ప్రశ్నకు 4 చాయిస్‌లు రివర్స్‌లో వస్తాయి. తద్వారా మాస్‌ కాపీయింగ్‌కు చెక్‌ పెట్టాం.

బబ్లింగ్‌లో తప్పులుంటే..
బబ్లింగ్‌ చేసేటప్పుడు ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎవరైనా తమకు కేటాయించిన నంబర్‌ను ఓఎంఆర్‌ షీటులో సరిగా బబ్లింగ్‌ చేయకపోయినా, లేదా అభ్యర్థి, ఇన్విజిలేటర్‌ సంతకాలు లేకపోయినా అతని పేపర్‌ను మూల్యాంకనం చేయబోం. ఈ విషయంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు కూడా ఉన్నాయి.

మూడు రోజుల్లో ప్రాథమిక ‘కీ’
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ముగిసిన మూడురోజుల్లో ప్రాథమిక కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తాం. ఈ నెల 20లోపు ‘కీ’ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తాం. ఆ తర్వాత నిపుణుల కమిటీ ఫైనల్‌ ‘కీ’ని ప్రకటిస్తుంది. గ్రూప్‌ -1 పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఓఎమ్మార్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతాం. పరీక్షకు హాజరైన వారందరి ఓఎమ్మార్‌ షీట్లను అభ్యర్థులు చూసుకోవచ్చు. కీతో పోల్చుకుని ఎన్ని మార్కులొస్తాయో తెలుసుకోవచ్చు. ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా ఫలితాల్లో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తాం.

హాల్‌ టికెట్‌పై ఫొటో సరిగా లేకుంటే..
దరఖాస్తు సమయంలో కొంతమంది ఫొటోలు సరైనవి ఇవ్వలేదు. ఫలితంగా హాల్‌టికెట్‌లో ఫొటో సరిగా లేకపోతే.. అభ్యర్థులు మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకొని గెజిటెడ్‌ ఆఫీసర్‌తో సంతకం చేయించుకుని పరీక్ష కేంద్రానికి రావాలి. అప్పుడే ఆ అభ్యర్థిని పరీక్షకు అనుమతిస్తాం. అందరూ త్వరగా www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సందేహాలుంటే టీఎస్‌పీఎస్సీని సంప్రదించాలి.

ప్రతి అరగంటకూ అలెర్ట్‌ చేస్తాం
పరీక్ష హాలులోకి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించం. పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు కూడా ఉండవు. అందుకే ప్రతి అరగంటకు ఓ సారి అలర్ట్‌ చేసేలా గంట మోగిస్తాం. పరీక్ష కేంద్రంలోకి చెప్పులు మాత్రమే వేసుకొని రావాలి. మెహిందీలు వేసుకొని వస్తే అనుమతించం. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైనప్పుడు ఆ అభ్యర్థి వేలిముద్రలు తీసుకుంటాం. మళ్లీ మెయిన్‌ పరీక్షకు వచ్చినప్పుడు బయోమెట్రిక్‌ తీసుకుంటాం. వేలిముద్ర తీసుకోగానే అభ్యర్థి ఫొటోతోపాటు పూర్తి వివరాలు తెలిసిపోతాయి. ఎవరైనా ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. అభ్యర్థిపై జీవితకాల నిషేధం విధిస్తాం.

ఫిబ్రవరిలోనే మెయిన్స్‌
గ్రూప్‌-1 పరీక్ష ఫలితాలను రెండునెలల్లోనే విడుదల చేస్తాం. ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మరో నెల ఆలస్యం కావచ్చు. ఫిబ్రవరిలోనే మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తాం. క్వాలిఫై మార్కుల కోసం నిర్వహించే ఇంగ్లిష్‌ పరీక్షను సైతం మెయిన్స్‌లో భాగంగానే నిర్వహిస్తాం. గ్రూప్‌-1లో సెలక్ట్‌ అయ్యే అభ్యర్థులు భవిష్యత్తులో ఐఏఎస్‌లుగా కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. త్వరలోనే గ్రూప్‌ -2, 3 ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్లు ఇస్తాం. దీనికోసం కావాల్సిన కసరత్తు పూర్తయింది. గిరిజన రిజర్వేషన్ల కోసం వెయిట్‌ చేస్తున్నాం. అవి ఖరారు కాగానే నోటిఫికేషన్లు ఇచ్చేస్తాం. అభ్యర్థులు ఎవరూ దళారుల మాటలు నమ్మొద్దు, మోసపోవద్దు.

తొలిసారిగా సీసీ కెమెరాలు
రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో గ్రూప్‌-1 పరీక్ష నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లో ఉండి కెమెరాలను టీఎస్‌పీఎస్సీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. ప్రశ్నపత్రాలను ప్రత్యేక నిఘాలో ఉంచేలా ఏర్పాటుచేశాం. పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌, టీఎస్‌పీఎస్సీ అధికారి సమక్షంలో ప్రశ్నపత్రం ఓపెన్‌ చేస్తాం. దీన్ని మొత్తం వీడియో తీస్తాం. పరీక్ష ముగిసిన తర్వాత ఓఎంఆర్‌ షీట్‌ను సీల్‌ చేసేటప్పుడు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తాం. ప్రతికేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని టీఎస్‌ఆర్టీసీకి సూచించాం. హైదరాబాద్‌ సహా నగరాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాం.

రెండు గంటల ముందే రండి
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ నిర్వహిస్తాం. 10.15 నిమిషాల వరకే పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తాం. గ్రూప్స్‌ వంటి పరీక్ష రాసే అభ్యర్థులకు సమయపాలన ఎంతో అవసరం. తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఒక్కొక్కరి బయోమెట్రిక్‌కు సుమారు 15 సెకన్ల సమయం పడుతుంది. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలలోపే పరీక్ష కేంద్రానికి రావాలి. అలా రావడం వల్ల.. టెన్షన్‌ పడకుండా ప్రశాంతంగా పరీక్ష రాయొచ్చు.

Courtesy by : నమస్తే తెలంగాణ మీడియా 

No comments:

Post a Comment