*తెరాస ఆపరేషన్ ఆకర్శ్ జోరు....పెంచిందా..?*
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. వార్డు స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నాయకుల చేరికలతో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.
మునుగోడు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ తెరాస కారు జోరు పెంచి ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరం చేసింది. ఘర్ వాపసీ అంటూ గతంలో పార్టీని వీడిన నేతలను ఆహ్వానించి కండువా కప్పేస్తోంది. భారాసగా మారుతున్న తెరాస.. ఓ వైపు జాతీయ రాజకీయాలు, మరోవైపు మునుగోడు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది.
తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. నల్లాల ఓదెలు దంపతులను పార్టీలోకి ఆహ్వానించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల గులాబీ కండువా కప్పారు. చేరికల పట్ల ఆచితూచి వ్యవహరించిన తెరాస.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భాజపాలో చేరడంతో వేగం పెంచింది. తెరాసలో బీసీలకు అవమానం జరుగుతోందని బూర నర్సయ్య వ్యాఖ్యలను తిప్పికొట్టేలా వ్యూహాలతో దూకుడు పెంచింది.
*ఒకరు పోతే నలుగురు వస్తారనేలా..*
బీసీ నాయకులు తెరాస వైపే ఉన్నారనే సంకేతం ఇచ్చేలా.. మొదట వారిపైనే దృష్టి పెట్టింది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించిన పల్లె రవికుమార్ గౌడ్ దంపతులను పార్టీలో చేర్చుకున్నారు. ఒకరు పోతే నలుగురు వస్తారనే సంకేతాలిచ్చేలా మరింత దూకుడు పెంచింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ భాజపాకు రాజీనామా చేసి తెరాసలో చేరారు. శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, భాజపాలో ఉన్న దాసోజు శ్రవణ్‌కు ఒకేరోజు ఒకే వేదికపై గులాబీ కండువా కప్పి మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ ఉద్యమ సమయంలో తెరాసలో ఉండి కీలక పాత్ర పోషించిన నాయకులే. తెరాసలో బీసీలు, గతంలో బయటకు వెళ్లిన నేతల చేరికలు ఊపందుకోవడంతో.. మరికొందరు నాయకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. రాష్ట్రస్థాయిలో మరికొందరు నేతలు తెరాసలో చేరబోతున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో ఆపరేషన్ ఆకర్ష్‌పై ప్రత్యేక కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది.
ఇక మునుగోడు నియోజకవర్గంలో నాయకులు ఏపూట ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల భాజపా, కాంగ్రెస్‌లో చేరిన పలువురు మండల, గ్రామ స్థాయి నాయకులను మంత్రి జగదీశ్‌రెడ్డి మళ్లీ పార్టీలోకి చేర్చుకున్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలతో పాటు.. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు, శాసనమండలి ఎన్నికల్లో పదవులు, టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలోకి ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment