Wednesday, October 26, 2022

ఎమ్మెల్యేల కొనుగోలుకు.... బేరసారాలు.... పోలీసుల విచారణ వేగవంతం...!

ఎమ్మెల్యేల కొనుగోలుకు.... బేరసారాలు.... పోలీసుల విచారణ వేగవంతం...!

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారంపై విచారణను పోలీసుల వేగవంతం చేశారు. మొయినాబాద్‌ సమీపంలోని ఫాంహౌస్‌లో పట్టుబడిన ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు.వారిని పోలీసు అధికారులు రహస్య ప్రాంతాల్లో ఉంచి విచారిస్తున్నారు. బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై కూపీ లాగుతున్నట్లు సమాచారం.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరించిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రలోభాలకు గురిచేయడం, బేరసారాలకు పాల్పడటంపై మొయినాబాద్‌ పీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

మరోవైపు ఫామ్‌హౌస్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని పరిశీలిస్తున్నారు. ఇతరులెవరినీ లోనికి అనుమతించడం లేదు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ఫామ్‌ హౌస్‌కు డబ్బు తెచ్చారా? తెస్తే ఎక్కడ దాచారు? అనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు. శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు పూర్వాపరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
*అసలేం జరిగింది?*
తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే తెలుగు రాష్ట్రాల్లో అంశం సంచలనం సృష్టించింది. సైబరాబాద్‌ పోలీసులు తమకు అందిన సమాచారంతో హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేశారు. తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్‌, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. 'డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ తమను కొందరు ప్రలోభపెడుతున్నట్లు తెరాస ఎమ్మెల్యేలు సమాచారం ఇవ్వగా సోదాలు నిర్వహించాం. అజీజ్‌నగర్‌లోని ఫాంహౌస్‌లో కొందరు సమావేశమయ్యారని తెలిసింది. దిల్లీలోని ఫరీదాబాద్‌ ఆలయంలో ఉండే రామచంద్రభారతి అలియాస్‌ సతీశ్‌శర్మ వీరితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఫాంహౌస్‌లో రామచంద్రభారతితోపాటు తిరుపతికి చెందిన స్వామీజీ సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ ఉన్నారు. నందకుమార్‌ వీరిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రలోభపెడుతున్నట్లు సమాచారం అందింది. దర్యాప్తు చేసి పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తాం. న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం' అని రవీంద్ర చెప్పారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment