Sunday, October 16, 2022

ఆ 8 గుర్తులపై తెరాస న్యాయపోరాటం...!

*ఆ 8 గుర్తులపై తెరాస న్యాయపోరాటం...!*

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలంటూ తెరాస న్యాయపోరాటానికి దిగింది. హౌజ్‌ మోషన్‌ విచారణ చేపట్టాలని నిన్న కోరగాన్యాయమూర్తి ఇంట్లో అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో సోమవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయాలని నిర్ణయించింది. గుర్తుల జాబితా నుంచి కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను తొలగించాలని కోరుతూ ఈనెల 10న ఎన్నికల కమిషన్ ను తెరాస కోరింది. ''పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో తెరాస అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే ఈసారి ఎన్నికల్లో వాటిని కేటాయించవద్దు'' అని టీఆర్‌ఎస్‌ నేతలు సీఈవోని కోరారు. అయితే ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు.

2018 ఎన్నికల్లోనూ తెరాసకు నష్టం..

గతంలో 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని తెరాస చెబుతోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకన్నా.. ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కారును పోలి ఉన్నందునే వారికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకీ తెరాస వివరించింది. మునుగోడు, జహీరాబాద్‌, సిర్పూర్‌, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్‌రోలర్‌ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని తెరాస నేతలు తెలిపారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్ లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. అందువల్ల ఆ ఎనిమిది గుర్తులను తొలగించాలని కోరారు. సోమవారం లంచ్ మోషన్ కు అనుమతి కోరి పిటిషన్ వేసేందుకు తెరాస సిద్ధమైంది.

దుబ్బాకలో దెబ్బకొట్టిన 'రోటీ మేకర్‌'

దుబ్బాకలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బండారు నాగరాజు అనే వ్యక్తి 'రోటీ మేకర్' గుర్తుపై పోటీ చేశారు. ఉపఎన్నికలో ఆయనకు దాదాపు 3500 ఓట్లు పోలయ్యాయి. నిజానికి ఈ 3500 ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో పడాల్సినవని... రోటీ మేకర్ గుర్తు కారు గుర్తును పోలి ఉండటంతో కొంత నష్టం జరిగిందని అధికార పార్టీ మద్దతుదారులు అంటున్నారు. అయోమయానికి గురైన కొందరు ఓటర్లు కారు గుర్తుకు బదులు రోటీ మేకర్‌కు ఓటేశారని చెబుతున్నారు. ఆ ఓట్లు కూడా టీఆర్ఎస్ ఖాతాలో పడి ఉంటే ఫలితం మరోలా ఉండేదంటున్నారు. ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు.. సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థిపై 1,470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులు ఓట్లు రాబట్టుకోవడంలో పోటీపడ్డారు. ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌ ఈవీఎంలో గుర్తు రోటీ మేకర్‌ (చపాతీ పీట, కర్ర). ఆయనకు 1918 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి కంటె సాయన్న గుర్తు వజ్రం. ఆయనకు 1843 ఓట్లు పోలయ్యాయి. ఈవీఎంలో ఈ రెండు గుర్తులు కారు, కమలం గుర్తులను పోలిఉండటంతో ఓట్లు విషయంలో తేడా వచ్చి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment