*హైదరాబాద్ లో అడుగుపెట్టిన...డోనాల్డ్ ట్రంప్ కంపెనీ....!*
*ఖానామెట్‌లో 27 అంతస్తులలో ప్రాజెక్టు*
*స్థానిక నిర్మాణ సంస్థతో కలసి నిర్మాణం*
*దక్షిణాదిలో తొలిసారిగా నగరానికి ఎంట్రీ*
*తుది దశలో అనుమతులు; డిసెంబర్‌లో ప్రారంభం*
హైదరాబాద్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ ట్రంప్ రియల్టీ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది. స్థానికంగా ఓ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇటీవల ఖానామెట్‌లో హెచ్‌ఎండీఏ వేలం వేసిన 2.92 ఎకరాలను సొంతం చేసుకున్న ఓ నిర్మాణ సంస్థతో కలసి 27 అంతస్తుల చొప్పున రెండు టవర్లను నిర్మించనుంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) లభించినట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ అనుమతులు తుది దశలో ఉన్నాయని, అవి వచ్చాక రెరాలో నమోదు చేసి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికల్లా అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. మూడున్నరేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
*ఒక్క ఫ్లాట్ రూ. 5.5 కోట్లపైనే....!*
ఈ ప్రాజెక్టులో మొత్తం 270 లగ్జరీ ఫ్లాట్లు నిర్మించనున్నారు. అన్నీ 4, 5 పడక గదులే కావడం విశేషం. 4-5 వేల చదరపు అడుగుల (చ.అ.) మధ్య 4 బీహెచ్‌కే, 6 వేల చ.అ.ల్లో 5 బీహెచ్‌కే విస్తీర్ణాలుంటాయి. ప్రాజెక్టు లాంచింగ్ తర్వాత నుంచి ప్రారంభ ధర చ.అ.కు రూ. 13 వేలుగా నిర్ణయించనున్నట్లు సమాచారం. అంటే 4 వేల చ.అ. ఫ్లాట్‌కు ఎంతలేదన్నా రూ. 5.5 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందన్నమాట.
ట్రంప్ టవర్ ప్రాజెక్టులో అన్నీ అంతర్జాతీయ స్థాయి వసతులు ఉండనున్నాయి. ప్రతి ఫ్లాట్‌కు ప్రైవేటు ఎలివేటర్, డబుల్ హైట్‌లో లివింగ్ స్పేస్, బాల్కనీలు ఉంటాయి. రెండు టవర్లను కలుపుతూ రూఫ్‌టాప్‌పై క్లబ్‌హౌస్ ఉంటుంది. ఈ ప్రాజెక్టులోని కామన్ ఏరియా ఇంటీరియర్‌ను ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుజేన్‌ఖాన్ డిజైన్ చేశారు
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment