Sunday, October 2, 2022

పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కేటీఆర్...?

*పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కేటీఆర్...?*

*తెరాసను జాతీయ పార్టీగా మార్చేందుకు ఈ నెల 6న ఈసీకి దరఖాస్తు*

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకు జాతీయ పార్టీగా పేరు మార్పిడి ప్రక్రియ ఈ నెల 5న ప్రారంభమవుతుంది.ఆ రోజు తెరాస విస్తృతస్థాయి సమావేశం ఆమోదం అనంతరం మరుసటి రోజు అంటే ఈ నెల ఆరున దిల్లీకి తెరాస ప్రతినిధుల బృందం వెళ్తుంది. తెరాస పేరును జాతీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ) దరఖాస్తు చేసుకుంటుంది. దాన్ని ఆమోదిస్తే వెంటనే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో మారుతుంది.

పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఉంటారు. తెలంగాణ విభాగానికి అధ్యక్షుడిగా ప్రస్తుత తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను నియమించే అవకాశం ఉంది. జాతీయ పార్టీగా పేరుకు ఆమోదం తెలిపిన తర్వాత ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. దాన్ని అనుసరించి పార్లమెంటులో, శాసనసభలో, మండలిలో పార్టీ పేరు మారుతుంది.

శాసనసభలో పార్టీ పక్ష నేతగా కేసీఆర్‌ కొనసాగుతారని తెలుస్తోంది. జాతీయ పార్టీ తరఫున తొలుత సమన్వయకర్తలను నియమించి ఆ తర్వాత రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించే అవకాశముందని సమాచారం. దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలతో పాటు సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలను వివిధ దశల్లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment