*యువత పై కమలం.... గురి....!*
*మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ..*
*మునుగోడులో 1.25 లక్షల యువ ఓటర్లు*
*ప్రచారంలో యువ నాయకులకే బాధ్యతలు*
*60 మంది ఓటర్ల బాధ్యత ఒక్కో నేతకు*
*పోలింగ్ బూత్‌కు 25 మంది కార్యకర్తలు*
*బాధ్యులుగా కీలక నేతల నియామకం*
*గంపగుత్తగా వేయించుకునే యత్నాల్లో బీజేపీ*
నల్లగొండ, : మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఇక్కడ గెలుపు కోసం ప్రధానంగా యువ ఓటర్లపై దృష్టి సారించింది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,367 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 40 ఏళ్లలోపు వయసున్న యువతీ, యువకులు 1,25,668 మంది ఉన్నారు. వీరందరినీ ఆకర్షిస్తే వారి కుటుంబ ఓట్లను కూడా తామే గంపగుత్తగా వేయించుకునే అవకాశం ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు. ఈ మేరకు గ్రామాల్లో యువ అధిక సంఖ్యలో పార్టీలో చేర్చుకుంటున్నారు.గ్రామాల్లో ప్రచార బాధ్యతలను ఎక్కువగా యువకులకే అప్పగించారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారం చేస్తూనే యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతోపాటు ప్రచారంలో తనవైన వ్యూహాలన్నింటినీ కమలం పార్టీ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి 60 మంది ఓటర్లకు ఒకరు చొప్పున నేతలకు బాధ్యత అప్పగించింది. మండలాల వారీగా, సామాజికవర్గాల వారీగా బాధ్యతలను రాష్ట్ర స్థాయి నేతలకు అప్పగించింది. వీరందరినీ పర్యవేక్షించేందుకు స్టీరింగ్ కమిటీని నియమించింది. ఎన్నికల్లో నిష్ణాతుడైన బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌తోపాటు మరో ఇద్దరు జాతీయ నాయకులు మునుగోడులోనే మకాం వేశారు. ఓవైపు ఇంటింటి ప్రచారం, మరోవైపు కీలక నేతల రోడ్‌షోలు కొనసాగుతున్నాయి. జాతీయ నేతలతో భారీ సభకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఆర్‌ఎ్‌సఎస్ కార్యకర్తలు బీజేపీతో సంబంధం లేకుండానే చాపకింద నీరులా ప్రచారం నిర్వహిస్తున్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment