Friday, March 25, 2022

పోరాటాలకు సిద్ధమైన కాంగ్రెస్....... టీపీసీసీ సమావేశంలో కీలక నిర్ణయం

*పోరాటాలకు సిద్ధమైన కాంగ్రెస్....... టీపీసీసీ  సమావేశంలో కీలక నిర్ణయం*

హైదరాబాద్‌: ఛార్జీల పెంపుపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించింది.ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని పీసీసీ వర్కింగ్‌ కమిటీ ఆర్గనైజింగ్‌ ఇన్‌ఛార్జి మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ జూమ్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అండగా ఉండే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఉద్యమించి రైతులకు న్యాయం జరిగేలా క్షేత్ర స్థాయి పోరాటాలు చేయాలని నిర్ణయించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు పేర్కొన్నారు.

విద్యుత్‌ ఛార్జీల పెంపు పేదలకు గుదిబండగా మారిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛార్జీలు పెంచుతూ వారే ఒకరిపై ఒకరు పోరాటాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ క్రియాశీల ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు. ప్రజలకు కాంగ్రెస్‌ హయాంలో ఉన్న ధరలు, ఇప్పటి ధరలు తెలియజేసి వారిని చైతన్య పరచాలని నేతలు అభిప్రాయపడ్డారు. 111 జీవోపై నిపుణులతో అధ్యయన కమిటీ వేయడంతో పాటు, పోరాటం చేయాలని నిర్ణయించారు. దళితబంధు పథకంలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్రామస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండటంతో ఎంపీలు సమావేశానికి హాజరుకాలేక పోయారని నేతలు తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్‌, రేణుకాచౌదరి, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, సీనియర్‌ ఉపాధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment