విచ్చలవిడిగా కబ్జాలు.. పట్టించుకునేది ఎవరు..?
నారగోని ప్రవీణ్ కుమార్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సాయి ప్రియ నగర్ పరిధిలోని రోడ్ నెంబర్ 6లో 1,200 గజాల పార్క్ స్థలం కబ్జాకు గురైంది. దాని విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుంది. కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా ఇళ్ల మధ్య కంపెనీ ఏర్పాటు చేశారు. దానికి పర్మిషన్ ఇచ్చిన అధికారి ఎవరో తెలియాలి.
రోడ్ నెంబర్ 3లో 1,200 గజాల పార్క్ స్థలంలో మున్సిపల్ కార్పొరేషన్ బోర్డు లేదు. కనీసం ఫెన్సింగ్ వేయలేదు. దాన్ని కూడా మింగేసేందుకు భూ బకాసురులు సిద్ధంగా ఉన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. గతంలో రోడ్ నెంబర్ 2లో 2,400 గజాల పార్క్ స్థలం కబ్జా అయితే.. దానిపై ఫిర్యాదు చేయగా ఇంతకుముందున్న కమిషనర్ ఇచ్చిన పర్మిషన్ ను రద్దు చేశారు.అయితే.. ఆ పార్క్ కు బదులు మరోచోట 1,200 గజాల స్థలాలు కబ్జాదారుడికి అధికారులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.10 కోట్ల విలువైన పార్క్ లను కాపాడాల్సిన అధికారులే కాసులకు కక్కుర్తిపడితే పట్టించుకునేది ఎవరు. ఇందులో సాయి ప్రియ నగర్ అసోసియేషన్ పాత్రపై అనుమానాలు ఉన్నాయి.ప్రభుత్వం పార్క్ స్థలం లేని కారణంగా ఎల్‌ఆర్‌ఎస్ లో అదనంగా ప్రతి ప్లాట్ ఓనర్ దగ్గర చార్జీ వసూలు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలు బాధితులను పీడించేలా ఉంటాయి కానీ.. కబ్జాదారుడిపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఉండవు. ఎందుకంటే ఎక్కువ భూములు కబ్జా చేసే బ్యాచ్ లో రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఉంటున్నారు.
సాలార్ జoగ్ సర్వే నెంబర్ 1లో 6 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా అయింది. మేడిపల్లి సేజ్ స్కూల్ వెనుక 3 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా పెట్టారు. పీర్జాదిగూడలో కబ్జాలపై ఏ ఒక్కరూ మాట్లాడరు. పట్టించుకోవాల్సిన కలెక్టర్ కు తీరిక ఉండదు. అధికారులందరిపై ఏసీబీ రైడ్ చేస్తే పాపాల పుట్టలు కదులుతాయి.
No comments:
Post a Comment