శ్రీనివాస్ గౌడ్‌పై హత్య కుట్ర వెనక అఫిడవిట్లు!
అఫిడవిట్లుపై మళ్లీ చర్చ!
రాఘవేంద్రరాజు అరెస్టుతో మళ్లీ తెరపైకి
గతంలోనే ఈసీకి చేరిన నివేదిక
రాష్ట్రపతిని కలవాలని నిందితుల యత్నం
మంత్రి, నిందితుల మధ్య తీవ్ర విభేదాలు
చినికి చినికి గాలివానలా తగువులు
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్య కుట్ర కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందుకు నిందితులకు, శ్రీనివాస్ గౌడ్‌కు మధ్య విభేదాలు కారణమని అంటున్నారు. ముఖ్యంగా, 2018 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌ను శ్రీనివాస్‌గౌడ్ ట్యాంపర్ చేశారంటూ రాఘవేందర్ రాజు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికే ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. విభేదాలు ముదిరి ఈ స్థాయికి చేరాయని అంటున్నారు.
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మంత్రి శ్రీనివా్‌సగౌడ్ హత్యకు కుట్ర పన్నారన్న ప్రకటన సంచలనం సృష్టించింది. మంత్రి హత్యకు రూ.15 కోట్లు సుపారీ ఇచ్చి ఢిల్లీలో తలదాచుకున్నారంటూ.. రాఘవేంద్రరాజు సహా నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే 2018 ఎన్నికల సందర్భంగా శ్రీనివా్‌సగౌడ్ అఫిడవిట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారంటూ రాఘవేంద్రరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన్ను అరెస్టు చేయడంతో మంత్రి అఫిడవిట్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2018 ఎన్నికల సందర్భంగా శ్రీనివా్‌సగౌడ్ మొదటి అఫిడవిట్‌లో కొన్ని విషయాలు దాచారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్ర్కూటినీ సమయంలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు రావడంతోనే వెబ్‌సైట్ ట్యాంపరింగ్‌కి పాల్పడి అఫిడవిట్‌నే మార్చారని ఈసీకి రాఘవేంద్రరాజు ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదుపై ఈసీ విచారణ జరుపుతుండడంతో మంత్రి మెడకు అఫిడవిట్ల ట్యాంపరింగ్ వివాదం శీర్షికన ఆంధ్రజ్యోతిలో జనవరిలో కథనం ప్రచురితమైంది. ఆ కథనానికి సరైన వివరణ ఇవ్వని మంత్రి.. ఆంధ్రజ్యోతిపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రిపై వచ్చిన ఫిర్యాదు మీద ఈసీ ఆదేశం మేరకు అప్పటి సీఈవో శశాంక్‌గోయల్ నివేదిక సమర్పించారు. ఆ నివేదికలోని వివరాలను మాత్రం అధికారులు వెల్లడించడంలేదు. ఈ వ్యవహారంపై ప్రస్తుత ఇన్‌చార్జి సీఈవో బుద్ధప్రకాశ్‌ను సంప్రదించగా.. స్పందించడానికి నిరాకరించారు. అఫిడవిట్ ట్యాంపరింగ్ ఆరోపణల్లో నిజానిజాలను ఈసీనే తేల్చాల్సి ఉందని అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. ఇది చాలా పెద్ద అంశమంటూ.. దానిపై మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. మరోవైపు శ్రీనివా్‌సగౌడ్‌పై హైకోర్టులో పలు ఎన్నికల పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయన ఎన్నికను కొట్టేయాలని కోరుతూ రాఘవేంద్రరాజు తదితరులు పిటిషన్లు వేశారు. అవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే మంత్రి హత్యకు కుట్ర పన్నారంటూ రాఘవేంద్రరాజు సహా నలుగురిని అరెస్టు చేయడం గమనార్హం.
రెండు అఫిడవిట్లు.. రెండు రకాలు!
1. డిపాజిట్లు, బాండ్లకు సంబంధించి మొదటి అఫిడవిట్‌లో శ్రీనివా్‌సగౌడ్ తన పేరున రూ.29,06,325 ఉన్నాయని పేర్కొన్నారు. రెండో అఫిడవిట్‌లో రూ.28,44,203 ఉన్నాయన్నారు.
2. వ్యవసాయ భూములకు సంబంధించి తన పేర ఉన్న భూముల అభివృద్ధి, ఇతర పెట్టుబడులకు ఖర్చు చేశారా? అనే కాలమ్‌లో మొదటి అఫిడవిట్‌లో నిల్ అని పేర్కొన్నారు. రెండో అఫిడవిట్‌లో తన పేర ఉన్న వ్యవసాయ భూమిలో రూ.15లక్షలు, స్పౌజ్ పేర ఉన్న భూమిలో రూ.25 లక్షలు ఖర్చు చేశామని పేర్కొన్నారు.
3. ఇక లయబిలిటీస్, డ్యూస్ టు పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ అనే కాలమ్‌లో ఎలాంటి బకాయిలు లేవని రెండు అఫిడవిట్లలో పేర్కొన్నారు. అయితే, పాలమూరు అభివృద్ధి ఫోరమ్ తరఫున మహబూబ్‌నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి చేసిన ఫిర్యాదు ప్రకారం.. శ్రీనివా్‌సగౌడ్ పేరున ఉన్న టీఎ్‌స06ఈఎల్ 6666 ఫార్చ్యూనర్ వాహనంపై 29 సార్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు గాను రూ.35,515 బకాయిలు ఉన్నాయి. ఆయన సతీమణి పేరున ఉన్న టీఎ్‌స06ఈఆర్ 6666 వాహనంపై 8 చలాన్లు రూ.10,180 కలిపి మొత్తం రూ.45,695 బకాయి ఉంది. ఈ వివరాలను శ్రీనివా్‌సగౌడ్ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదంటూ అప్పట్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆంధ్రజ్యోతి వివరాలతో సహా పేర్కొనగా, మంత్రి తన అక్కసు వెళ్లగక్కారు.
ఫిర్యాదులు ఇలా..
అఫిడవిట్లపై మొదటిసారి ఎన్నికల నామినేషన్ల స్ర్కూటినీ జరిగిన 20.11.2018న టీడీపీ అభ్యర్థి ఎం.చంద్రశేఖర్ (ఎర్రశేఖర్) ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో శ్రీనివాస్ ముందు అభ్యంతరం వ్యక్తం చేయగా, ఆయన దాన్ని తోసిపుచ్చారు.
శ్రీనివాసగౌడ్, ఆయన భార్య పేరిట ఉన్న వాహనాలపై ట్రాఫిక్ చలాన్ల బకాయిల గురించి అఫిడవిట్లో పేర్కొనలేదని, భార్య పేరిట ఏపీజీవీబీలో ఉన్న రుణం వివరాలనూ పొందుపర్చలేదంటూ 29.11.2018న పాలమూరు అభివృద్ధి ఫోరమ్ అధ్యక్షుడు బాండేకర్ విశ్వనాథరావు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును కూడా పట్టించుకోలేదు.
ఈ అఫిడవిట్ల దాఖలుపై రాఘవేంద్రరాజు తొలుత రాష్ట్ర హైకోర్టులో 24.11.2018న పిటిషన్ వేశారు.
ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా, తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించినట్లు రాఘవేంద్రరాజు తెలిపారు. పిటిషన్ ఎప్పుడు వేశారన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు.
రాఘవేంద్రరాజు కాకుండా ఈ అఫిడవిట్లపై టీడీపీ అభ్యర్థి ఎం.చంద్రశేఖర్ తెలంగాణ హైకోర్టులో ఎన్నికల తర్వాత పిటిషన్ వేశారు. కొన్నాళ్ల తర్వాత ఉపసంహరించుకున్నారు.
ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో మొదటి అఫిడవిట్‌ని 14.11.2018న అప్‌లోడ్ చేయగా, సవరించిన రెండో అఫిడవిట్‌ని 19.11.2018న అప్‌లోడ్ చేశారు.
అఫిడవిట్ మార్చారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆర్డీవో శ్రీనివాస్ కొవిడ్ మొదటి వేవ్ సమయంలో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆ తర్వాత బదిలీ అయ్యారని చెప్పారు తప్ప ఎక్కడికి అనే అంశం తెలియరాలేదు. ఆయనపై శాఖాపరమైన విచారణేదీ జరగలేదు.
అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసుపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ నిర్వహిస్తోంది. దీనిపై మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదికను తీసుకున్నారు. ఈ నివేదికను డిసెంబరులోనే కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు రాఘవేంద్రరాజు తెలిపారు.
నిందితుల కస్టడీకి నేడు పిటిషన్
శ్రీనివా్‌సగౌడ్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు శుక్రవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు
No comments:
Post a Comment