Monday, March 14, 2022

రేపటి నుంచే 12-14 ఏళ్ల వారికి...,... టీకా

*రేపటి నుంచే 12-14 ఏళ్ల వారికి...,... టీకా*

*బయో-ఈ రూపొందించిన కోర్బెవాక్స్‌ టీకా ఇవ్వనున్నట్టు కేంద్రం వెల్లడి*

*60 ఏళ్లు దాటినవారంతా మూడో డోసు తీసుకోవడానికి అర్హులే*

*దేశంలో 12-14 ఏళ్లవారు 7.11 కోట్లు*

*5 కోట్ల డోసులు ఇచ్చిన బయో-ఈ*

*కార్యాచరణ సిద్ధం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ*

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ టీకాలు వేసే కార్యక్రమం బుధవారం (16వ తేదీ) నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు.హైదరాబాద్‌కు చెందిన బయొలాజికల్‌-ఈ లిమిటెడ్‌ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్‌ టీకాను వారికి ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే.. 60 ఏళ్లు దాటి, మధుమేహం, అధికరక్తపోటు వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి మాత్రమే ఇస్తున్న ముందు జాగ్రత్త (మూడో) డోసును ఇకపై 60 ఏళ్లు దాటినవారందరికీ ఇవ్వనున్నట్టు తెలిపారు. ''పిల్లలు సురక్షితంగా ఉంటే దేశం కూడా సురక్షితంగా ఉన్నట్టు. 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ టీకా కార్యక్రమాన్ని మార్చి 16 నుంచి ప్రారంభించబోతున్న విషయం తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అలాగే, 60 ఏళ్లు దాటినవారంతా ప్రికాషన్‌ డోసు వేసుకోవడానికి ఇక అర్హులే'' అని ఆయన ట్వీట్‌ చేశారు.

12-14 ఏళ్ల పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్న కుటుంబాలు సత్వరమే వారికి టీకాలు వేయించాలని సూచించారు. శాస్త్రీయ సంస్థలతో విస్తృత చర్చలు జరిపిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం దేశంలో 12-14 ఏళ్లవారు (2008 నుంచి 2010 నడుమ జన్మించినవారు) 7.11 కోట్ల మంది ఉన్నారు. వీరికోసం బయొలాజికల్‌ ఈ సంస్థ ఇప్పటికే 5 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేసినట్లు సమాచారం. కరోనా కేసులు గణనీయంగా తగ్గిపోయి దేశవ్యాప్తంగా పాఠశాలలన్నీ తెరుచుకుంటున్న నేపథ్యంలో కొవిడ్‌ను మరింత సమర్థంగా నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. రాష్ట్రంలో 12-14 ఏళ్ల పిల్లలు 17,23,000 మంది ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా బుధవారం నుంచి వారికి టీకాలు వేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment