Thursday, March 10, 2022

బీజేపీ పట్ల దేశంలో తగ్గని ఆదరణ – నిరూపించిన తాజా ఎన్నికల ఫలితాలు

బీజేపీ పట్ల దేశంలో తగ్గని ఆదరణ – నిరూపించిన తాజా ఎన్నికల ఫలితాలు

భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. తాజా ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కమలం వికసించింది. దేశానికి గుండెకాయ లాంటి… కీలకంగా భావించే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా సహా ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో కాషాయ పార్టీ విజయభేరి మోగించింది. అయితే మరో రాష్ట్రం పంజాబ్ ను మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఊడ్చేసింది.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీని మరోసారి కైవసం చేసుకున్న బీజేపీ పలు రికార్డులను కొల్లగొట్టింది. గతంతో పోలిస్తే కాస్త సీట్లు తగ్గినా గణనీయంగా ఓట్లు పెంచుకుంది. అంతేకాదు దాదాపు నాలుగు దశాబ్దాల్లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన నాయకుడిగా నిలుస్తున్నారు యోగీ. కులమతాలకు అతీతంగా ఓటర్లు ఆ పార్టీకి పట్టం కట్టారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ కాషాయ జెండా ఎగిరింది. ఉత్తరప్రదేశ్ లో యోగీ సుపరిపాలనకు మంచి మార్కులేశారని చెప్పవచ్చు ప్రజలు.
ఇక వరుసగా రెండోసారి ఒకేపార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉన్న ఉత్తరాఖండ్ లోనూ ఆ సెంటిమెంట్ ను తప్పుతూ బీజేపీ అధికారంచేపట్టనుంది. ముగ్గురు సీఎంలను మార్చిన పరిస్థితుల్లో పార్టీకి అధికారం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అన్ని అంచనాలను పటాపంచలు చేస్తూ మరోసారి బీజేపీకే పాలనా పగ్గాలు కట్టబెట్టారు ఓటర్లు.

ఈశాన్య రాష్ట్రపు మణిపూస మణిపూర్ నూ నిలుపుకుంది భారతీయ జనతా పార్టీ. మరోసారి ఆ పార్టీకే పట్టంగడుతూ తీర్పు చెప్పేశారు ప్రజలు. క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రంలో హిందుత్వ పార్టీగా ముద్రపడిన భారతీయ జనతా పార్టీ వరుసగా గెలవడం ఆ పార్టీకి ప్రత్యేక విజయమనే చెప్పవచ్చు.
క్రైస్తవుల జనాభా అధికంగా ఉన్న మరో రాష్ట్రం గోవాలో బీజేపీ హవా కొనసాగింది. రెండో సారీ ఆ పార్టీనే ప్రజలు ఆదరించారు.
ఇక పంజాబ్ ను మాత్రం ఆప్ ఊడ్చేసింది. నాలుగింట మూడొంతుల అద్భుత విజయాన్ని ఆ పార్టీ సొంతం చేసుకుంది. మొన్నటివరకు అధికారంలో ఉన్న హస్తం పార్టీకి అక్కడఘోర పరాభవం ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రులు చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ సిద్దూ సహా మహామహులు మట్టికరిచారు.


No comments:

Post a Comment