Tuesday, March 1, 2022

మెడిసిన్ చదవటానికి.. ఉక్రెయిన్ కే ఎందుకు..?

మెడిసిన్ చదవటానికి.. ఉక్రెయిన్ కే ఎందుకు..?

ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో చాలా మంది భారతీయులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. ఆశ్చర్యకరంగా అందులో ఎక్కువగా వైద్య విద్యార్థులు ఉన్నారు. వారిలో పంజాబ్, హర్యానాలకు చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఈ విషయాలను గమనించినప్పుడు వైద్య విద్య కోసం అసలు ఇంత మంది ఉక్రెయిన్ కు ఎందుకు వెళుతున్నారు. మిగతా దేశాల కన్నా ఉక్రెయిన్ కే పంజాబ్, హర్యానా విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆలోచనలు రాకతప్పదు.

ఉక్రెయిన్ నే ఎందుకు ఎంచుకుంటున్నారు…
ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ డిగ్రీని ఇండియన్ మెడికల్ కౌన్సిల్, వరల్డ్ హెల్త్ కౌన్సిల్, యూరప్, అమెరికా ఇలా చాలా దేశాలు గుర్తించాయి. భారత్ తో పోలిస్తే ఇక్కడ అతి తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ ను పూర్తి చేయవచ్చని విద్యార్థులు చెబుతున్నారు.

తక్కువ ఫీజు…
భారత్ లో ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ చదివేందుకు ఏడాదికి రూ. 2 లక్షల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొద్ది మందికి మాత్రమే ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు దొరుకుతాయి. ఇక ప్రైవేట్ లో ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే సుమారు రూ. 50లక్షల వరకు ఖర్చవుతుంది.అదే ఉక్రెయిన్ లో అయితే ఏడాదికి రూ. 4 నుంచి 5 లక్షలు మాత్రమే ఉంటుంది. అది పంజాబ్ కళాశాలల్లో ఫీజుతో పోలిస్తే మూడు రెట్లు తక్కువగా ఉంటుంది. అందుకే తాము ఉక్రెయిన్ వెళుతున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు.

భారత్ లో తక్కువ కాలేజీలు

పంజాబ్ లో ప్రభుత్వ వైద్య కళాశాలలు 4 మాత్రమే ఉన్నాయి. ఇక 6 వరకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలతో పోలిస్తే ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు ఆరు రెట్లు అధికంగా ఉంటుంది. సీట్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ఎంబీబీఎస్ కు ఉక్రెయిన్ ను ఎంచుకోవడానికి ఇది కూడా ఓ కారణం.

ఉక్రెయిన్ లో అడ్మిషన్లు పొందటం సులువు

భారత్ లో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు గాను నీట్ పరీక్షలో అత్యధిక శాతంతో ఉత్తీర్ణత సాధించాలి. కానీ ఉక్రెయిన్ లో మెడికల్ సీటు పొందాలంటే కేవలం నీట్ లో ఉత్తీర్ణత సాధిస్తే చాలు. అందుకే చాలా మంది అక్కడకు వెళుతున్నారని నిపుణులు చెబుతున్నారు.


No comments:

Post a Comment