Saturday, March 12, 2022

రాజీనామా యోచనలో సోనియా.... రాహుల్.... ప్రియాంక.....!

*రాజీనామా యోచనలో   సోనియా.... రాహుల్.... ప్రియాంక.....!*

కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల వెల్లడైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవం పొందిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఉండి కూడా పంజాబ్‌లో అధికారాన్ని దక్కించుకోలేకపోయింది.ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలో కూడా గెలవలేకపోయింది. అయితే కాంగ్రెస్‌ జీ23 నేతల భేటీ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ కాంగ్రెస్‌లోని తమ పదవులకు రాజీనామాలు ప్రకటించనున్నట్లు సమాచారం. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. సీడబ్ల్యూసీ భేటీలో రాజీనామాల విషయాన్ని వారు వెల్లడించే అవకాశం ఉంది.

కాగా 5 రాష్ట్రాల ఎన్నికల పరాజయాలపై చర్చించేందుకు ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశం కాబోతోంది. ఈ భేటీకి సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటికే ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా పంజాబ్‌లోనూ అధికారం పొగొట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇక మిగిలిన రెండు రాష్ట్రాలు రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ నేతలు భేటీ కానున్నారు. వర్చువల్ విధానంలో జరిగే సీడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ,రాహుల్ గాంధీతో పాటు దిగ్విజయ్ సింగ్, ఏకే ఆంటోనీ, ఇతర నేతలు కూడా పాల్గొంటారు. అలాగే సీడబ్ల్యూసీలో ఉన్న జీ23 నేతలు కూడా ఈ భేటీలో తమ అభిప్రాయాలు వెల్లడించబోతున్నారు.మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాజీనామాలు చేస్తారనే వార్తలను ఆ పార్టీ ఖండించింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత, అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు. రాజీనామా చేయడం పూర్తి అవాస్తవమని, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment