Saturday, March 19, 2022

మంత్రులతో కేసీఆర్‌ భేటీ.. ఐటీ రెయిడ్స్ ఎఫెక్టేనా..?

మంత్రులతో కేసీఆర్‌ భేటీ.. ఐటీ రెయిడ్స్ ఎఫెక్టేనా..?

Courtesy by : తొలివెలుగు మీడియా website

తెలంగాణపై బీజేపీ ఆపరేషన్‌ ప్రారంభమైందని రెండు రోజులుగా రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ. హైదరాబాద్‌ తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో ఈ విషయాన్ని చెబుతున్నారు విశ్లేషకులు. ఐటీ రెయిడ్స్ జరిగిన కేఎన్‌ఆర్ కన్‌ స్ట్రక్షన్స్ అనే సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులకు పని చేస్తోంది. కాళేశ్వరం కింద దాదాపుగా రూ.10వేల కోట్ల వరకు ఈ కంపెనీ పలు ప్యాకేజీల పనులు నిర్వహిస్తోంది.

సాధారణంగా తాము టార్గెట్ చేసిన పార్టీ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం బీజేపీకి అలవాటే అనే అభిప్రాయం ఉంది. కేంద్ర సంస్థల ద్వారా దాడులు చేయించి కోలుకోలేని దెబ్బ కొడుతుందనే విమర్శలు ఉన్నాయి. కేఎన్‌ఆర్ సంస్థ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. టీఆర్‌ఎస్‌ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఐటీ దాడులు జరగడంతో.. టీఆర్‌ఎస్‌ పై బీజేపీ ఫోకస్‌ చేసిందనే వార్తలు వస్తున్నాయి.

అటు ఐటీ దాడులపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుండగా… సీఎం కేసీఆర్‌ మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఎర్రవల్లి ఫాంహౌస్ కు రావాలంటూ మంత్రులకు ఫోన్స్‌ వెళ్లడంతో ముగ్గురు మినహా మిగిలినవారంతా వెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కూడా చేరుకున్నారు. దీంతో ఈ అత్యవసర సమావేశంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

ఇంత అర్జెంట్‌ గా మంత్రులను కేసీఆర్‌ కలవడానికి గల కారణం ఏంటని దానిపై చర్చిస్తూ.. అనేక అనుమానాలు తెరపైకి తెస్తున్నారు విశ్లేషకులు. కేంద్రంపై యుద్ధం.. జాతీయ రాజకీయాలు అని తిరుగుతున్న కేసీఆర్‌.. మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన చేశారని అంటున్నారు. అదీగాక ఐటీ దాడులు జరగడంతో కేంద్రం తమపై సైలెంట్‌ యుద్ధం మొదలు పెట్టిందా? అనే అనుమానంతో కేసీఆర్‌ మంత్రులతో భేటీ అయ్యారా? అనే సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

No comments:

Post a Comment