Wednesday, March 23, 2022

టెట్ వ్యాలిడిటీ ఇక జీవితకాలం......!

*టెట్ వ్యాలిడిటీ ఇక జీవితకాలం......!*

*హైదరాబాద్‌.....*
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే టెట్‌ మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు, చేర్పులకు కూడా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. టీచర్‌ పోస్టుల భర్తీ కంటే ముందు టెట్‌ను నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో 2017 తర్వాత ఇప్పటివరకు టెట్‌ జరగలేదు. టెట్‌ పేపర్‌-1 పాసైన అభ్యర్థులు సుమారు 70 వేల మంది ఉన్నారు. అలాగే పేపర్‌-2లో అర్హత సాధించిన అభ్యర్థులు మరో లక్షమంది వరకు ఉన్నారు. టెట్‌ అర్హత లేని అభ్యర్థులు సుమారు 3లక్షల మంది వరకు ఉంటారు. వీరిలో 2017 తర్వాత వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసినవారు కూడా ఉన్నారు. అలాగే.. టెట్‌లో తాజాగా కొన్ని మార్పులు చేశారు. ఇంతకుముందున్న పద్ధతి ప్రకారం డిప్లొమా (డీఎడ్‌) చేసిన అభ్యర్థులు టెట్‌ పేపర్‌-1, బీఎడ్‌ చేసినవారు టెట్‌ పేపర్‌-2 పరీక్షలు రాయడానికి అర్హులు.

అయితే నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. బీఎడ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు పేపర్‌-1 పరీక్షలు రాయడానికి కూడా అర్హులవుతారు. అలాగే టెట్‌ వ్యాలిడిటీ ఇక నుంచి జీవితకాలం ఉంటుంది. ఒకసారి టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. దాని ఆధారంగా ఎప్పుడైనా టీచర్‌ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. ఈ నిర్ణయం 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి వర్తించనుంది. గతంలో టెట్‌ వ్యాలిడిటీ 7 సంవత్సరాలు ఉండేది. టెట్‌ రాయడానికి ఇంటర్మీడియట్‌, డిగ్రీ కోర్సుల్లో అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు 45శాతం మార్కులు అవసరం. కాగా.. టెట్‌ను జూన్‌లో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. మే నెల చివరి వారం లేదా జూన్‌ మొదటి వారంలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. మే చివరివారం నుంచి జూన్‌ 1వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే టెట్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు. మొత్తం టెట్‌ ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

link Media ప్రజల పక్షం🖋️

No comments:

Post a Comment