*మీడియా ముసుగులో వసూళ్లకు అడ్డుకట్ట వేయాలి!*
*డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య ఘటనపై నిష్పాక్షిక విచారణకు విజ్ఞప్తి*
*బాధ్యులుగా తేలిన రిపోర్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి*
*తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 19:
మీడియా పేరుతో అధికారులను, వ్యాపారులను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పాల్వంచ డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన రిపోర్టర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలను వెలికితీయాల్సిన మీడియా.. వాటిని ప్రోత్సహించే సాధనంగా మారడం బాధాకరమన్నారు. కొద్దిమంది అనైతిక చర్యలకు మొత్తం మీడియా వ్యవస్థను, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను నిందించడం సరికాదని స్పష్టం చేశారు. మీడియా గుర్తింపును అడ్డుపెట్టుకుని బెదిరింపులు, వసూళ్లకు పాల్పడేవారిపై సంబంధిత యాజమాన్యాలు, అధికారులు దృష్టి సారించాలని సూచించారు. మీడియా రంగంలో వృత్తిపరమైన అర్హతలు, నైతిక విలువలు, జవాబుదారీతనం పెంపొందించేందుకు జర్నలిస్టు సంఘాలు, మీడియా యాజమాన్యాలు, ప్రభుత్వం కలిసి స్వయం నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. ఇలాంటి చర్యలు కొనసాగితే మీడియాపై ప్రజల విశ్వసనీయత దెబ్బతింటుందని హెచ్చరించారు.
*“వసూళ్లకు వేదిక కాదు మీడియా.. విలువలకు నిలయం కావాలి!**
ప్రజలను, బాధితులను ఆదుకోవడానికి ముందుకు రండి. బ్రతికించడానికి రండి.. బ్రతుకుదెరువుకు మీడియాను అడ్డుపెట్టుకోవద్దు” అని మేడవరపు రంగనాయకులు హితవు పలికారు.
No comments:
Post a Comment