*పత్రికా ప్రకటన*
తేదీ: 22 అక్టోబర్ 2026
స్థలం: అమీన్‌పూర్, సంగారెడ్డి జిల్లా
*అమీన్‌పూర్‌లో ప్రభుత్వ, సీలింగ్ భూములపై అక్రమ నిర్మాణాలు, రిజిస్ట్రేషన్ల ఆరోపణలు — సమగ్ర దర్యాప్తు జరపాలి*
*కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు — పోలీస్ కమిషనర్‌కు ఆధారాలతో వినతి — విచారణకు అమీన్‌పూర్ పోలీసుల నోటీసు*
*ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ, సర్వే, మున్సిపల్, హెచ్‌ఎండీఏ, రిజిస్ట్రేషన్ శాఖల బాధ్యతను నిర్ధారించాలి: అడ్వకేట్ వి. రవికృష్ణ*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 22:
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 1035, 1036, 1042, 1043, 1044 మరియు వాటికి అనుబంధంగా ఉన్న భూముల్లో ప్రభుత్వ, సీలింగ్, అసైన్డ్ భూముల స్థితిగతులు, లేఅవుట్లు, నిర్మాణ అనుమతులు, రిజిస్ట్రేషన్లు, భూముల విక్రయాలపై నెలకొన్న తీవ్ర అనుమానాలను నివృత్తి చేసేందుకు సమగ్ర దర్యాప్తు జరపాలని అడ్వకేట్, సామాజిక కార్యకర్త వి. రవికృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.ఈ అంశంపై హైకోర్టు ఉత్తర్వులు, రెవెన్యూ రికార్డులు, ఇనాం/ఓఆర్‌సీ పత్రాలు, సీలింగ్ భూములకు సంబంధించిన రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర ఆధారాలతో కూడిన సమగ్ర ఫిర్యాదును 2026 ఆగస్టు 21న సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మరియు సంబంధిత శాఖల అధికారులకు సమర్పించినట్లు తెలిపారు.అదే అంశంపై సంగారెడ్డి జిల్లా ప్రజావాణిలో 2026 ఆగస్టు 24న DSANG24082600124 నంబర్‌తో ఫిర్యాదు నమోదైందని, దానిని పరిష్కారం కోసం సంగారెడ్డి సెక్షన్–ఈకి పంపినట్లు ప్రభుత్వ అధికారిక రసీదులో పేర్కొన్నారని వెల్లడించారు.సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఫిర్యాదు సంబంధిత పోలీసు అధికారులకు పంపబడిన అనంతరం, 900/DCP-SZ/S4-Get/Cyb/2026, తేదీ 21.09.2026 రిఫరెన్స్‌తో విచారణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ 11.10.2026న BNSS సెక్షన్ 94 కింద నోటీసు జారీ చేసి, సంబంధిత పత్రాలతో విచారణకు హాజరుకావాలని కోరినట్లు వెల్లడించారు.ఈ నోటీసు జారీ కావడం ఫిర్యాదుపై విచారణకు సంబంధించిన చర్య మాత్రమేనని, ఆరోపణలు రుజువైనట్లు భావించరాదని స్పష్టం చేశారు.
**హైకోర్టు ఉత్తర్వులు, భూ రికార్డుల మధ్య వ్యత్యాసాలపై స్పష్టత అవసరం**
నారాయణరావు లేఅవుట్‌కు సంబంధించిన 21.02.2014 హైకోర్టు ఉమ్మడి ఉత్తర్వులు, 1999 నాటి ఇనాం/ఓఆర్‌సీ పత్రాలు, సర్వే నంబర్లు 1042, 1043, 1044లకు సంబంధించిన సీలింగ్ భూముల రికార్డులను పరస్పరం పరిశీలించి, ప్రతి భూభాగం యొక్క వాస్తవ యాజమాన్యం, చట్టబద్ధ వర్గీకరణ, హద్దులు, స్వాధీనం వివరాలను నిర్ధారించాలని కోరారు.ముఖ్యంగా ఒక సర్వే నంబర్‌లో ఉన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో చూపించిన స్థలం, వాస్తవంగా మరో సర్వే నంబర్ పరిధిలో ఉందనే వివాదాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, ప్రతి ప్లాట్‌ను ప్రభుత్వ సర్వే రికార్డులతో సరిపోల్చి క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
*రూ 1.50 కోట్ల నుంచి రూ 2 కోట్ల వరకు ఇళ్ల విక్రయాలపై ఆందోళన**
వివాదాస్పద భూముల పరిధిలో కొత్త లేఅవుట్లు, జీ ప్లస్ 1 నిర్మాణాలు చేపట్టి, కొన్ని ఇళ్లను సుమారు రూ 1.50 కోట్ల నుంచి రూ 2 కోట్ల వరకు విక్రయిస్తున్నారనే సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు.
భూముల చట్టబద్ధ స్థితి నిర్ధారణ కాకముందే అమాయక కొనుగోలుదారులు జీవితకాల పొదుపులను పెట్టుబడిగా పెట్టి నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.హౌస్ నంబర్, ఆస్తిపన్ను అసెస్‌మెంట్, భవన నిర్మాణ అనుమతి లేదా రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన వివాదాస్పద భూమిపై చట్టబద్ధమైన యాజమాన్య హక్కు నిర్ధారణ అయినట్లు కాదని పేర్కొన్నారు.
**అనుమతులు ఇవ్వడమేనా? క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఎవరి బాధ్యత?**
రెవెన్యూ, మున్సిపల్, హెచ్‌ఎండీఏ, టౌన్ ప్లానింగ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రిజిస్ట్రేషన్ శాఖల పనితీరుపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు.భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారులు, అనుమతి పొందిన అదే సర్వే నంబర్‌లో, అదే స్థలంలో, మంజూరైన ప్లాన్ ప్రకారమే నిర్మాణం జరుగుతోందో లేదో ఎందుకు నిర్ధారించకూడదు?
ప్రభుత్వ భూమి లేదా సీలింగ్ భూమి అనే వివాదం ఉన్నప్పుడు సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించకుండా అనుమతులు, హౌస్ నంబర్లు, రిజిస్ట్రేషన్లు ఎలా కొనసాగుతున్నాయో పరిశీలించాలని డిమాండ్ చేశారు.నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే కేవలం నిర్మాణదారులపైనే కాకుండా, ఉద్దేశపూర్వకంగా సహకరించిన లేదా విధి నిర్వహణలో చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారుల బాధ్యతను కూడా చట్టప్రకారం నిర్ధారించాలని కోరారు.
**ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు**
*(1)*: సంబంధిత సర్వే నంబర్లపై రెవెన్యూ, సర్వే, మున్సిపల్, హెచ్‌ఎండీఏ, రిజిస్ట్రేషన్, పోలీసు శాఖలతో సంయుక్త క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలి.
*(2)*: అసలు ఇనాం/ఓఆర్‌సీ, సీలింగ్, సెత్వార్, పహాణీ, టిప్పన్, ఎఫ్‌ఎంబీ, లేఅవుట్, నిర్మాణ అనుమతుల రికార్డులను పరిశీలించాలి.
*(3)*: 2015 నుంచి జరిగిన జీపీఏలు, విక్రయ దస్తావేజులు, డెవలప్‌మెంట్ ఒప్పందాలు, తదుపరి రిజిస్ట్రేషన్లను పరిశీలించాలి.
*(4)*: నకిలీ పత్రాలు, తప్పుడు సర్వే వివరాలు, మోసం లేదా ప్రభుత్వ భూముల అక్రమ బదిలీలు జరిగినట్లు ఆధారాలు లభిస్తే సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేయాలి.
*(5)*: అవసరమైతే ఆర్థిక లావాదేవీలపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ద్వారా విచారణ జరిపించాలి.
*(6)*: చట్టవిరుద్ధ నిర్మాణాలు, తదుపరి విక్రయాలు, మూడవ పక్ష హక్కుల సృష్టిని చట్టప్రకారం నిరోధించి అమాయక కొనుగోలుదారులను రక్షించాలి.
*(7)*: ప్రజావాణి ఫిర్యాదుతో పాటు పోలీసు విచారణపై సర్వే నంబర్లవారీగా చర్యల నివేదిక అందించాలి.
**ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే**
“ప్రభుత్వ భూములను కాపాడటానికి అనేక శాఖలు, చట్టాలు, పర్యవేక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, అక్రమ ఆక్రమణలు, నిర్మాణాలు, విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అనుమతులు ఇచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో వాటి అమలును ఎవరు పరిశీలిస్తున్నారు? చివరికి కోట్ల రూపాయలు వెచ్చించి ఇల్లు కొనుగోలు చేసిన సామాన్యుడు నష్టపోతే బాధ్యత ఎవరిది?” అని రవికృష్ణ ప్రశ్నించారు.ఈ వ్యవహారంలో ఏ వ్యక్తినీ ముందుగానే దోషిగా ప్రకటించడం తమ ఉద్దేశం కాదని, ప్రభుత్వ రికార్డులు, భూముల వాస్తవ స్థితి, రిజిస్ట్రేషన్ లావాదేవీలు, నిర్మాణ అనుమతులపై స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు.
వి. రవికృష్ణ
అడ్వకేట్ & సామాజిక కార్యకర్త
అమీన్‌పూర్, సంగారెడ్డి జిల్లా
సెల్: 9618531012
No comments:
Post a Comment