*పర్యావరణ స్పృహ లేని పాలనలో నీళ్ళ ఆధారిత అభివృద్ధి నమూనా*
*కన్నెగంటి రవి,తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ,టీపీజేఏసీ*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 03:
రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు సేవ చేసే పేరుతో ఎన్నికైన ప్రభుత్వాలకు, ప్రజా ప్రతినిధులకు పర్యావరణ స్పృహ సాధారణ ప్రజల కంటే మరింత ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. బడ్జెట్ రూపొందించి ఖర్చు పెట్టే అధికారం, చట్టాలు చేసి, అమలు చేసే అధికారం ఉన్నంత మాత్రాన, అన్ని విషయాలలోనూ జ్ఞానం, అవగాహన ప్రభుత్వాలకు ఆటోమాటిక్ గా ఉంటుందన్న గ్యారంటీ ఏమీ లేదు.ఇలాంటి సమయంలో యూనివర్సిటీలు, శాస్త్రవేత్తల బృందాలు, ఉన్నతాధి కారులు ఆ బాధ్యతను సమర్ధంగా, సకాలంలో , ప్రజల, పర్యావరణ కోణంలో ఆలోచించి నిర్వహించకపోతే, ప్రభుత్వాల ముందు చర్చకు పెట్టకపోతే, అవినీతి చక్రంలో తాము కూడా ఒక భాగంగా మారిపోతే, అంతిమంగా ప్రభుత్వ పెద్దల స్వార్ధ ప్రయోజనాలే రాష్ట్ర అభివృద్ధి నమూనా రచిస్తాయి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎదుర్కుంటున్నది ఈ సంకట పరిస్థితినే. సుదీర్ఘ కాలం పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ప్రజలు, గత 12 ఏళ్లుగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పర్యావరణ స్పృహ ఏ మాత్రం లేని తప్పుడు అభివృద్ధి నమూనా దుష్ఫలితాలకు బలవుతున్నారు. తమ చేతుల్లో ఉన్న సహజ వనరులను కోల్పోతున్నారు. హక్కులను కోల్పోతున్నారు. మొత్తంగా తమ భవిష్యత్తును కోల్పోతున్నారు.
ముఖ్యంగా నీళ్ళ కోణం లో చూస్తే ఇది స్పష్టంగా కనపడుతుంది. సహజ వనరయిన నీటికి ఎప్పుడూ ఒక పరిమితి ఉంటుంది. ఒక రాష్ట్రానికి, ఆ రాష్ట్రం గుండా ప్రవహించే అంతర్ రాష్ట్ర నదీ జలాలపై అధికారానికి కూడా ఒక పరిమితి ఉంటుంది.
ప్రకృతి సహజ వనరైన నీళ్ళకు ఉండే పరిమితులను దృష్టిలో ఉంచుకోవడం అన్నిటి కన్నా ముఖ్యం. వాతావరణంలో వస్తున్న మార్పులు,పెరుగుతున్న ఉష్ణోగ్రతలు,భారీ వర్షాలు , అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు, నీటి నిల్వకు ఉండే రిజర్వాయర్ల పరిమితులు, ఆయా రిజర్వాయర్లలో వచ్చే నిర్వహణా సమస్యలు, నదీ జలాలను రిజర్వాయర్ లకు చేర్చడానికి "లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ" అయ్యే అదనపు ఖర్చులు సరిగా లెక్క వేసుకోవలసి ఉంటుంది.
ముఖ్యంగా నదుల నుండీ నీళ్ళను లిఫ్ట్ చేయడానికి, బోరు బావుల నుండీ పైకి తోడడానికి భారీ విద్యుత్ అవసరం. రాష్ట బడ్జెట్ లో అందుకయ్యే ఖర్చు, ఆ నిధులకు ఉండే పరిమితులు, భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోవడం, రాష్ట్ర సగటు వర్షపాతానికి అనుగుణంగా, భూగర్భంలోకి నీరు ఇంకక పోవడం, భూగర్భంలో రాతి పలకలు, భారీ రసాయన ఎరువుల వినియోగం వల్ల, నీటిని నిలవ చేసుకునే సామర్ధ్యాన్ని మన భూములు కోల్పోవడం, ఫలితంగా మన బావులు, బోరు బావులు వేగంగా ఎండిపోవడం - ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఉండే పరిమితులుగా అర్థం చేసుకోవడం చాలా అవసరం.
కానీ తెలంగాణ ప్రభుత్వాలు ఈ విషయాలపై కనీస అవగాహన లేకుండా, దృష్టి లేకుండా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలకు పర్యావరణ స్పృహ ఎలాగూ లేదు. వాతావరణంలో వస్తున్న మార్పుల గురించి, రాబోయే రోజుల్లో నీటికి ఏర్పడే కొరత గురించీ, ప్రపంచమంతా రోజూ చర్చించుకుంటున్న అంశాలు, మన ప్రభుత్వ పెద్దల చెవికి ఎక్కడం లేదని, వాళ్ళు ప్రోత్సాహిస్తున్న అభివృద్ధి నమూనా స్పష్టంగా మన ముందు కనపడుతుంది.2019 నుండీ ఇప్పటి వరకూ రాష్ట్రంలో అవసరానికి మించి, వరి సేద్యానికి ఇచ్చిన ప్రోత్సాహం ఇందుకు ఒక బలమైన ఉదాహరణ. కెసిఆర్ ప్రభుత్వం కోటి ఎకరాల మాగాణం పేరుతో వరిని ప్రోత్సాహిస్తే, రేవంత్ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ పేరుతో వరి సేద్యం మరింత పెరగడానికి కారణమయ్యింది. 50 రూపాయల విలువైన ఒక కిలో బియ్యం పండించడానికి 5000 లీటర్ల నీళ్ళు ( కిన్లే వాటర్ బాటిల్ ధర ప్రకారం చూస్తే లక్ష రూపాయలు) కావాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే, వరి సేద్యానికి ఎంత భారీ నీటి వినియోగం జరుగుతుందో తెలుస్తుంది. రాష్ట్ర అభివృద్ధి నమూనాలో భాగంగా ముందుకు వచ్చిన ఇథనాల్ కంపనీలు మన ప్రభుత్వాలకు పర్యవరణ స్పృహ లేదనడానికి మరో పెద్ద ఉదాహరణ. ఒక లీటర్ ఇథనాల్ తయారీకి కనీసం 8 నుండీ 10 లీటర్ల నీళ్ళు అవసరం. అంటే ఒక ఇథనాల్ కంపెనీకి రోజూ లక్షల లీటర్ల నీరు అవసరం. నీటి కొరత ఉండే తెలంగాణ రాష్ట్రంలో 30 ఇథనాల్ కంపెనీలకు అనుమతులు ఇవ్వడం ఎవరి ప్రయోజనాల కోసం? ప్రభుత్వాలకు ఉన్న మరో మోజు ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం. ఒక ఆయిల్ పామ్ మొక్కకు రోజూ 300 లీటర్ల నీరు అవసరం. సంవత్సరం పొడవునా అంత నీరు అందితేనే ఆ మొక్క బలంగా ఉంటుంది. ఎల్ నినో లాంటి పరిస్థితులు, భారీ ఉష్ణో గ్రతలు, తీవ్ర నీటి కొరత ఉన్న తెలంగాణ లో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడం నేరమే అవుతుంది. నిజానికి 1500 మిలీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, ఎప్పుడైనా 25 నుండీ 30 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు, 85 శాతం గాలిలో తేమ ఉండే వాతావరణ పరిస్థితులు అవసరమైన ఆయిల్ పామ్ సాగును , రాష్ట్రంలో ఏ మాత్రం అనువు గాని జిల్లాలు, ప్రాంతాలలో కూడా ప్రోత్సహించడం ఈ ప్రభుత్వానికి పర్యావరణ స్పృహ అసలు లేదనడానికి మరో ఉదాహరణ. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నగరీకరణ, డాటా సెంటర్ ల మోజు పుట్టింది. గ్రామాలను నాశనం చేసి ఫ్యూచర్ సిటీ నిర్మించడం, కొత్త కొత్త డాటా సెంటర్ ల నిర్మాణానికి కంపనీలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోవడం ఇందులో భాగమే.
ఈ రెండూ కూడా నీటిని అత్యధికంగా కోరుకునేవే. నగరాల పజలకు తాగు నీటి సరఫరాలో కూడా ఇప్పటికే కొరతను ఎదుర్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విచక్షణ లేకుండా , రాష్ట్రంలో 5000 మెగావాట్ల సామర్ధ్యంతో డాటా సెంటర్ లను ప్రోత్సహిస్తామని ప్రకటించడం చూస్తే, ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎంత నేరపూరితంగా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కొన్ని జిల్లాల ప్రజలు వినియోగించే తాగు నీటికి సరి సమానంగా ఒక కాంపౌండ్ లో ఉండే డాటాసెంటర్ నీటిని ఉపయోగిస్తుందనే సమాచారాన్ని ప్రజలకు చెప్పకుండా , బడా డాటా సెంటర్ ల నిర్మాణం కోసం ఒప్పందాలు చేసుకోవడం చూస్తే ఏమనాలి? 2016 లోనే డాటా సెంటర్ పాలసీ తెచ్చిన కెసిఆర్ ప్రభుత్వం, దానిని అమలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఒకే అభివృద్ధి నమూనాకు బొమ్మా, బొరుసూ గా ప్రజలు అర్థం చేసుకోవాలి. నీళ్ళ లాంటి సహజ వనరును ప్రజల నిజమైన అవసరాలకు ఉపయోగించాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వికారాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ లాంటి కరువు పీడిత ప్రాంతాల ప్రజలు ఒక వైపు ఆందోళనలు చేస్తున్నారు.
మరో వైపు, దానికి భిన్నంగా నీటిని కార్పొరేట్ కంపనీలకు పభూత్వాలు ధారాదత్తం చేస్తున్నాయి. గజ్వేల్ ప్రాంతంలో కోకోకోలా బాట్లింగ్ కంపెనీకి మిషన్ భగీరథ నీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం సరఫరా చేస్తే, అమెజాన్ డాటా సెంటర్ కు, ఇథనాల్ కంపనీలకు ఇప్పటి ప్రభుత్వం మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నది. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ అభివృద్ధి నమూనా అత్యంత అప్రజాస్వామికమైనది. సామాజిక న్యాయానికి భిన్నమైనది. పర్యావరణ వ్యతిరేకమైనది. దీనిని ప్రజలు ప్రతిఘటించాలి.
No comments:
Post a Comment