Thursday, October 15, 2026

గుర్తుంచుకోండి... అప్రమత్తతే సైబర్ నేరాలకు అసలైన విరుగుడు - వి.సజ్జనార్,ఐపీఎస్_

*'మా దాకా రాదులే’ అనుకోవద్దు.. సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దు!*

*గుర్తుంచుకోండి... అప్రమత్తతే సైబర్ నేరాలకు అసలైన విరుగుడు - వి.సజ్జనార్,ఐపీఎస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 14:

సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తుగడలను తిప్పికొడుతూ ప్రజల కష్టార్జితాన్ని రక్షించేందుకు హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం నిరంతరం అండగా నిలుస్తోంది. పౌరులు కూడా పూర్తి చైతన్యంతో వ్యవహరించినప్పుడే సైబర్ రహిత నగరాన్ని నిర్మించగలమని మేం పదేపదే స్పష్టం చేస్తున్నాం.అయితే, తాజాగా సోమవారం ఒక్క రోజే నగరంలో నమోదైన మూడు వేర్వేరు కేసుల్లో బాధితులు ఏకంగా దాదాపు రూ. 5.35 కోట్లను సైబర్ కేటుగాళ్ల చేతుల్లో పోగొట్టుకోవడం కలిచివేసింది. ఈ ఉదంతాల్లో నష్టపోయిన ముగ్గురు బాధితులతో నేనే స్వయంగా మాట్లాడాను. 
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... ముగ్గురూ ఉన్నత విద్యావంతులే, సమాజంపై పూర్తి అవగాహన ఉన్నవారే. అయినప్పటికీ ‘ఇలాంటి మోసాలు మా దాకా రావు కదా’ అనే అమాయకత్వం, అతి ధీమాతో మొదటి లావాదేవీ జరిగినప్పుడే అలర్ట్ కాకపోవడం వల్లే ఇంత భారీ మొత్తాన్ని కోల్పోయారు.

**బాధితులు ప్రదర్శించిన నిర్లక్ష్యం, కేటుగాళ్ల మాయాజాలం ఎంత ప్రమాదకరంగా మారాయో ఈ మూడు ఘటనలే నిదర్శనం.** 

నగరంలో పేరుపొందిన ఓ ప్రముఖ వ్యాపార సంస్థ అకౌంటెంట్ గుర్తుతెలియని జిప్ ఫైల్ ఓపెన్ చేసి, సీఈఓ డీపీతో వచ్చిన నకిలీ వాట్సాప్ సందేశాన్ని రోజూవారీ లావాదేవీల్లో వచ్చే ఓటీపీ క్లియరెన్స్‌లాగే పొరబడి ఏకంగా రూ. 2.70 కోట్లు బదిలీ చేసేశారు; ఎనిమిది రోజుల పాటు నిధులు మళ్లుతున్నా, బ్యాంక్ సందేశాలు వస్తున్నా ఆ సంస్థ యాజమాన్యం గమనించకపోవడం తీవ్ర నిర్లక్ష్యం. మరో ఉదంతంలో 72 ఏళ్ల వృద్ధురాలిని సీబీఐ, ఈడీ, మనీ లాండరింగ్ పేరుతో ‘డిజిటల్ అరెస్ట్’ చేశామంటూ 20 రోజుల పాటు భయపెట్టి, ఆమె బంగారాన్ని సైతం అమ్మించి రూ. 2.12 కోట్లు కాజేశారు. ఇక విదేశాల్లో పనిచేసి నగరానికి వచ్చిన ఓ ప్రముఖ వైద్యుడు గత పదేళ్లుగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న అనుభవజ్ఞుడే అయినప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకు 5 నుంచి 20 శాతం లాభాలంటూ వచ్చిన ప్రకటనల మాయలో పడి నకిలీ ట్రేడింగ్ యాప్‌లో రూ. 52.51 లక్షలు పోగొట్టుకున్నారు.సైబర్ నేరాలపై గౌరవ ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, పోలీస్ విభాగం తరఫున మేం నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నాం. 'జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్’ పేరుతో ఏడాది కాలంలోనే దాదాపు 11,417 అవగాహన సదస్సులు నిర్వహించి సుమారు 5.06 లక్షల మందికి అవగాహన కల్పించాం. అయినప్పటికీ ప్రజలు మేమిచ్చే అడ్వైజరీలను చాలా లైట్ గా తీసుకుంటుంన్నారు. అసలు మన దేశ చట్టంలో ఎక్కడా ‘డిజిటల్ అరెస్ట్’ అనే భావనే లేదని, ఏ దర్యాప్తు సంస్థా ఆన్‌లైన్‌లో నగదు డిమాండ్ చేయదని ఎన్నిసార్లు చెబుతున్నా భయాందోళనలకు లోనవుతున్నారు. మరోవైపు బ్యాంకుల నుంచి విడతలవారీగా కోట్ల రూపాయల సొమ్ము డెబిట్ అవుతుంటే ఖాతాదారులను అప్రమత్తం చేయడంలో బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదు. ఇది నాకు జరగదులే అని నిర్లక్ష్యంగా ఉండకండి, ‘నాక్కూడా జరగొచ్చు’ అన్న స్పృహతో అనుక్షణం అప్రమత్తంగా ఉండండి. 

**గుర్తుతెలియని లింకులు, ఫైల్స్ తెరవకండి, అపరిమిత లాభాల ప్రకటనలను గుడ్డిగా నమ్మకండి.**

గుర్తుతెలియని బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్యానిక్ కావొద్దు; కుటుంబ సభ్యులకు చెప్పడంతో పాటు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి లేదా డయల్ 112 కు ఫోన్ చేయండి. ముఖ్యంగా ఇంట్లోని వృద్ధుల ప్రవర్తనను పిల్లలు ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి నైతిక స్థైర్యాన్ని అందించాలి. ఒకవేళ ఎవరైనా దురదృష్టవశాత్తూ మోసపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యంత కీలకమైన 'గోల్డెన్ అవర్'లో వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. 

గుర్తుంచుకోండి... అప్రమత్తతే సైబర్ నేరాలకు అసలైన విరుగుడు!

No comments:

Post a Comment