Wednesday, October 7, 2026

బతుకమ్మ' పూల పండగను ఈనెల 10 వ తేదీనుండి 18 వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించాలి_

*'బతుకమ్మ' పూల పండగను ఈనెల 10 వ తేదీనుండి 18 వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించాలి*

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 05:

తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకత గాంచిన 'బతుకమ్మ' పూల పండగను ఈనెల 10 వ తేదీనుండి 18 వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. ఈనెల 10 నుండి 18 వ తేదీ వరకు నిర్వహించే  బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులు హాజయ్యారు.ఈ సందర్భంగా ఈనెల 18 వ తేదీన 'సద్దుల బతుకమ్మ'ను పురస్కరించుకొని ట్యాంక్ బండ్ పై వేలాది మంది మహిళలచే సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు సీఎస్ తెలిపారు. 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగాగల అమరవీరుల స్మారక కేంద్రం నుండి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా  వచ్చి ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారని, వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో  ర్యాలీగా వస్తారని ఆయన వివరించారు. 
ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని సీఎస్ అన్నారు. ఈ బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని పండగ శోభ వచ్చేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆయన ఆదేశించారు.   నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుండి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశమున్నందున వారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యదర్శి వాణి ప్రసాద్, సీపీ హైదరాబాద్ వీసీ సజ్జనార్, పంచాయితీ రాజ్ కమిషనర్ దివ్య, జిహెచ్ ఎం సి కమిషనర్ ఆర్.వి.కర్ణన్, ఆర్టీసీ ఎం.డి. నాగిరెడ్డి, సీపీ మల్కాజిగిరి బి.సుమతి, జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment