*ఎల్నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తోంది*
*ప్రజలను చైతన్య పర్చాలి - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 23:
ఎల్నినో ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై చూపే ప్రభావం, వాటి వల్ల తలెత్తే పరిణామాలపై ప్రజలను చైతన్య పర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై ఎల్-నినో చూపే ప్రభావాలను ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ముందస్తు జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేపట్టాలని సీఎస్ అధికారులకు సూచించారు.ఈరోజు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సమాచార శాఖ అధికారులు, సాంస్కృతిక సారథి కళాకారులకు నిర్వహించిన ఒకరోజు చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తోందని, దాని ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రజలకు సమయానుకూలంగా సరైన సమాచారం అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలో 20 శాతానికి పైగా వర్షపాతం తక్కువగా నమోదయిందని సీఎస్ అన్నారు.దీనితో, దాదాపు 20 శాతం పంట విస్తీర్ణం తగ్గిందని, తద్వారా సరిపడా ధాన్యం, పశుగ్రాసం తగ్గిందని సీఎస్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో కేవలం 30 నుండి 40 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో రానున్న జులై మాసం వరకు తాగు నీటికి అత్యంత ప్రాధాన్య నిస్తున్నామని వివరించారు. గత మూడు నెలలుగా రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ వినియోగం జరుగుతోందని, అత్యధికంగా 20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని ఆయన వెల్లడించారు. సమాచార, పౌరసంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక శాఖ సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రజా అవగాహన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. కార్యక్రమంలో సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ జి. ముకుంద రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఎ. నరసింహ రెడ్డి, సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు డి.ఎస్. జగన్, సంయుక్త సంచాలకులు కె. వెంకట రమణ, శ్రీనివాస్, మధుసూధన్ తో పాటు వ్యవసాయ, విద్యుత్, పశుసంవర్ధక శాఖల అధికారులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌర సంబంధాల అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment