*వేసవిలో నీటి ఎద్దడి నివారణకు జలమండలి ముందస్తు చర్యలు*
*ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్మాణ రంగ సంస్థలతో ప్రత్యేక సమావేశం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 17:
నవంబర్ 1 నుంచి డయల్-ఏ-గ్రీన్ ట్యాంకర్ సేవలకు సన్నాహాలు.తొలి దశలో రోజుకు 100 ఎంఎల్డీ శుద్ధి చేసిన నీటి వినియోగం లక్ష్యం.ఆన్లైన్ ట్యాంకర్ బుకింగ్, ట్రాకింగ్‌కు ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్. జలమండలికి సహకరిస్తామన్న క్రెడాయ్, నరెడ్కో, టీబీఎఫ్ ప్రతినిధులు.ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు, సింగూరు–మంజీరా జలాశయాలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జలమండలి ముందస్తు కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డి, ఐఏఎస్ ఆధ్వర్యంలో క్రెడాయ్, నరెడ్కో, టీబీఎఫ్ నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్ అవసరాలకు తాగునీరు, భూగర్భజలాలకు ప్రత్యామ్నాయంగా ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని ఎండీ సూచించారు. తొలి దశలో రోజుకు 100 ఎంఎల్డీ వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
నవంబర్ 1 నుంచి డయల్-ఏ-గ్రీన్ ట్యాంకర్ సేవలను ప్రారంభించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి చేస్తున్నామని, ఆన్లైన్ బుకింగ్, ట్యాంకర్ ట్రాకింగ్ సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. వారం నుంచి పది రోజుల్లో ప్లాట్‌ఫామ్ సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.ఇప్పటివరకు 51 ప్రైవేట్ ఎస్టీపీలు నమోదు చేసుకున్నాయని, వాటి ద్వారా రోజుకు సుమారు 1.5 ఎంఎల్డీ మిగులు శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఈ నీటిని నిర్మాణ అవసరాలకు వినియోగించడంతో పాటు సమీపంలోని ఎస్టీపీల నుంచి పైప్లైన్ల ద్వారా సరఫరా చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ట్యాంకర్ రవాణా ఖర్చులు తగ్గించడం, నీటి నాణ్యతా ప్రమాణాలు, సరఫరా విధానంపై త్వరలో మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు చెప్పారు.
రానున్న ఎనిమిది నెలలు నీటి సంరక్షణకు అత్యంత కీలకమని, తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు నిర్మాణ రంగం, పరిశ్రమలు, ప్రజలు సహకరించాలని ఎండీ కోరారు. జలమండలి కార్యాచరణకు పూర్తి సహకారం అందిస్తామని నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు తెలిపారు.ఈ సమావేశంలో జలమండలి ఈడీ సంతోష్, డైరెక్టర్లు నారాయణ, ప్రభు, సీజీఎంలు పద్మజ, సుజాత, క్రెడాయ్ అధ్యక్షులు జయదీప్ రెడ్డి, నరెడ్కో ఉపాధ్యక్షులు అశోక్ స్వామినాథన్, టీబీఎఫ్ ప్రతినిధి ప్రభాకర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment