*సున్నం చెరువు చెంత..అక్రమ బోర్లపై హైడ్రా కొరడా*
*గతంలోనే చెరువులో బోర్లను తొలగించిన హైడ్రా*
*నేడు పరిసర ప్రాంతాల్లో నీటి దందాకు హైడ్రా చెక్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 25:
హైడ్రా శనివారం భారీ ఆపరేషన్‌ను నిర్వహించింది. సున్నం చెరువు చెంత అక్రమ బోర్లపై హైడ్రా స్టింగ్ ఆపరేషన్ చేసి అక్రమ నీటి వ్యాపారం సాగుతున్న తీరును బయట పెట్టింది. ఇళ్లలో, బెడ్ రూంలలో, వంట గదుల్లో భారీ స్థాయిలో బోర్లు వేసి.. హైపవర్ మోటార్ల ద్వారా తోడిన నీటిని భూగర్భంలో వందలమీటర్ల పైపులు అమర్చి.. తరలించే వైనాన్నిబట్టబయలు చేసింది. ఎక్కడో బోరుంటుంది.. మరెక్కడో ట్యాంక్ ఉంటుంది. అలా తోడిని నీటిని భారీ వాటర్ ట్యాంకర్ల ద్వారా తీసుకువచ్చి చిన్న ట్యాంకర్లను నింపి.. అమ్ముకునే వైనాన్ని మీడియా సాక్షిగా బయట పెట్టింది. వెనువెంటనే రంగంలోకి దిగి సున్నం చెరువు చెంత నీటి దందాకు చెక్ పెట్టింది. సీఎంసీ, రెవెన్యూ, జలమండలి అధికారులతో కలిసి హైడ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఇళ్లలో బోర్లు వేసి.. గుట్టు చప్పుడు కాకుండా దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ నీటి వ్యాపారానికి హైడ్రా ఎట్టకేలకు చెక్ పెట్టింది. అక్రమంగా వేసిన బోర్లను పదుల సంఖ్యలో తొలగించింది. శనివారం మధ్యాహ్నానికి మొత్తం 15 బోర్లను ప్రత్యక్షంగా తొలగించిన హైడ్రా.. పరోక్షంగా పదుల సంఖ్యలో బోర్లను అనుసంధానం చేసే భూగర్భ పైపులను తొలగించింది. ఈ సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది.
**అక్రమ నీటి దందాతో సున్నం చెరువును ఖాళీ**
సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే పదుల సంఖ్యలో బోర్లు వేసి.. దుర్గంధ భరిత నీటి దందాకు హైడ్రా గతంలోనే చెక్ పెట్టింది. కాలుష్య నియంత్రణ మండలి ద్వారా అక్కడి బోరు నీటిని పరీక్షించి ప్రమాదకర, ప్రాణాంతక రసాయనాలున్నాయని తేల్చి చెప్పింది. కాడ్మియం, సీసం, నికెల్ వంటి లోహాలు అధికంగా ఉన్నాయని రుజువు చేసింది. ఈ నీళ్లు తాగిగే కాలేయ సమస్యలు... క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలతో పాటు.. గర్భశ్రావాలు జరుగుతాయి. ఇలాంటి నీళ్లను మాధాపూర్‌లోని హాస్టళ్లకు, హోటళ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకునే వారికి హైడ్రా చెక్ పెట్టింది. శనివారం నవభారత్‌నగర్, బోరబండ్ ఫేజ్ 3 ప్రాంతాల్లో ఉన్న బోర్లను తొలగించింది. సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తున్న క్రమంలో అందులోని 10 అడుగుల మేర పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించింది. దీంతో చెరువులో నీరు భూగర్భంలోకి ఇంకడం మొదలయ్యింది. భూగర్భ జలాలు పెరిగాయి. అయితే ఈ ఫలాలు అక్కడి నివాసితులకు దక్కకుండా.. నీటి వ్యాపారులు చేసినవైనంపై హైడ్రాకు ఫిర్యాదులందాయి. పదుల సంఖ్యలో నీటి ట్యాంకర్లు తరలించి నీటిని తోడేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా చర్యలు తీసుకుంది.
**బెడ్ రూంలు, ఇంటి గదుల్లో బోర్లు**
సున్నం చెరువు చెంత నివాసాలలో ఆశ్చర్యం కలిగించే విధంగా బోర్లున్నట్టు హైడ్రా గుర్తించింది. నిద్రపోయే బెడ్ల కింద, వంటగదుల్లో బోర్లును గమనించింది. నీటి సంపులో భారీ బోర్లు.. ఇలా నీటి దందా కొనసాగిన తీరు కనిపించింది. స్థానికుల ముందే వాటిని తొలగించింది. బోర్లకు బిగించిన మోటార్లతో సహాతొలగించి నీటి దందాకు హైడ్రా చెక్ పెట్టింది. శనివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభించిన ఆపరేషన్‌ను శనివారం సాయంత్రం వరకూ కొనసాగించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గతంలో 60 అడుగుల్లో నీల్లు పడేవి.. ఇప్పుడు 600ల అడుగులు వెళ్లినా బోర్లు పడట్లేదని వాపోయారు. బోర్లు ఎండిపోయి.. మోటార్లు కాలిపోవడంతో నీళ్లను కొనుక్కొంటున్నామని.. వాళ్లు మాత్రం నీటిని అమ్ముకుంటున్నారని వాపోయారు. సున్నం చెరువులో నీటి నిల్వలపైనా అక్రమ నీటి దందా ప్రభావం పడుతోందని వాపోయారు. వర్షాకాలం ఆదిలో పడిన వర్షంతో కొంతమొత్తంలో చేరిన నీటిని కూడా పరిసరాల్లో వేసిన భారీ బోర్లు గుంజేశాయని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పదుల సంఖ్యలో ట్యాంకర్లను నింపే కార్యక్రమాలు చేయడంతో తమకు దారిలేకుండా చేస్తున్నారని పలువురు వాపోయారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక తాగు నీటి కష్టాలు రాకముందే హైడ్రా ఇలాంటి చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment