Wednesday, October 7, 2026

భూగర్భజల నాణ్యతపై అప్రమత్తత అవసరం: జలమండలి_

*భూగర్భజల నాణ్యతపై అప్రమత్తత అవసరం: జలమండలి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 06:

సోషల్ మీడియాలో వీడియో సర్వేలో పరీక్షించినవి భూగర్భజల నమూనాలే.. జలమండలి సరఫరా చేసే శుద్ధి చేసిన నల్లా నీరు కాదు
ప్రాంతాన్నిబట్టి మారే భూగర్భజల నాణ్యత.. తాగేముందు పరీక్షించుకోవాలి
రోజుకు 560 MGD నీటి శుద్ధి.. సుమారు 5,500 నమూనాల పరీక్షలు మూడు దశల్లో క్లోరినేషన్.. ‘నాణ్యత’ యాప్‌తో రియల్‌టైమ్ పర్యవేక్ష లీకేజీలు, కలుషిత సమస్యల గుర్తింపునకు GIS ఆధారంగా 10 ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లో తాగునీటి నాణ్యతపై ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన వీడియో/సర్వేలో పరీక్షించినవి భూగర్భజల నమూనాలేనని, అవి జలమండలి శుద్ధి చేసి నల్లాల ద్వారా సరఫరా చేసే తాగునీటి నమూనాలు కావని జలమండలి స్పష్టం చేసింది. భూగర్భజల పరీక్షల ఫలితాలను జలమండలి సరఫరా చేసే నీటికి అన్వయించడం సరికాదని పేర్కొంది.భూగర్భజల నాణ్యత ప్రాంతాన్నిబట్టి మారుతుందని, సహజ భౌగోళిక, స్థానిక పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో TDS, హార్డ్‌నెస్, ఫ్లోరైడ్, నైట్రేట్ తదితర పారామీటర్లు నిర్దేశిత ప్రమాణాలకు భిన్నంగా ఉండవచ్చని తెలిపింది. అందువల్ల బోరు లేదా ఇతర భూగర్భజలాలను తాగేముందు నాణ్యత పరీక్షించుకోవాలని సూచించింది.

**రోజుకు 560 MGD నీటి శుద్ధి.. 5,500 నమూనాల పరీక్షలు:**

జలమండలి వివిధ జలవనరుల నుంచి సేకరించే రోజుకు సుమారు 560 MGD నీటిని నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేసిన అనంతరమే సరఫరా చేస్తోంది. నీటి వనరు నుంచి వినియోగదారుడి నల్లా వరకు వివిధ దశల్లో రోజుకు సుమారు 5,500 నమూనాలను QAT, O&M సిబ్బంది, లైన్‌మెన్లు, థర్డ్ పార్టీ సంస్థల ద్వారా పరీక్షిస్తోంది. ప్రతికూల ఫలితం నమోదైతే కారణాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టి, తిరిగి నమూనాలను పరీక్షిస్తోంది.
ఆసిఫ్‌నగర్‌లోని NABL గుర్తింపు పొందిన కేంద్ర ప్రయోగశాలతో పాటు ఇతర ప్రయోగశాలల్లో IS 10500:2012 ప్రమాణాలకు అనుగుణంగా భౌతిక, రసాయన, బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహిస్తోంది.

**మూడు దశల్లో క్లోరినేషన్.. రియల్‌టైమ్ పర్యవేక్షణ:**

తాగునీటి భద్రత కోసం ప్రీ, పోస్ట్, బూస్టర్ దశల్లో క్లోరినేషన్ నిర్వహిస్తూ, టెయిల్ ఎండ్ వరకు అవసరమైన అవశేష క్లోరిన్ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. సుమారు 330 క్లోరినేషన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. ‘నాణ్యత’ మొబైల్ యాప్ ద్వారా క్షేత్రస్థాయి పరీక్షలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తోంది.
పైప్‌లైన్ లీకేజీలు, స్థానిక కలుషిత సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించేందుకు GIS సాంకేతికతతో అన్ని జోన్లలో 10 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.

**శుద్ధి చేసిన నీటికి ప్రాధాన్యం ఇవ్వాలి: ఎండీ అశోక్ రెడ్డి**

భూగర్భజల నాణ్యత ప్రాంతాన్నిబట్టి మారుతుందని, బోరు నీటిని తాగేముందు పరీక్షించుకోవాలని జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి, ఐఏఎస్ సూచించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించడమే జలమండలి ప్రథమ ప్రాధాన్యమని, తాగునీటి నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సుదూర జలవనరుల నుంచి తీసుకొచ్చి శుద్ధి చేస్తున్న విలువైన నీటిని వృథా చేయకుండా ప్రధానంగా తాగునీటి అవసరాలకు వినియోగించాలని కోరారు. ప్రతి నీటి బొట్టును బాధ్యతగా వినియోగించి, అందరికీ సమానంగా నీరు అందేలా జలమండలికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment