Sunday, April 17, 2022

గులాబీలు చెప్పిందే చట్టం.. ఖాకీలు చేసేదే న్యాయం!

గులాబీలు చెప్పిందే చట్టం.. ఖాకీలు చేసేదే న్యాయం!

Courtesy by : తొలివెలుగు మీడియా website

మీరేమో మోడీ దిష్టిబొమ్మలు తగులబెట్టొచ్చు..
– మీకు వ్యతిరేకంగా ధర్నా చేస్తే అక్రమ కేసులా?
– ఇదెక్కడి న్యాయం?
– టీఆర్ఎస్ నేతలు, పోలీసుల దోస్తీ దేనికి సంకేతం?
– ఖాకీలు ఉంది ప్రజల కోసమా?
– గులాబీల గులాంగురి కోసమా?
– ఖమ్మం, రామాయంపేట ఘటనలపై..
– కేసీఆర్ ఏం సమాధానం చెప్తారు?
– రాష్ట్రంలో బయటకురాని ఘటనలు ఇంకెన్ని?

ప్రశ్నిస్తే కేసులు.. ఎదిరిస్తే కేసులు.. కక్షగట్టి కేసులు.. మేం చేసిందే చట్టం.. చేసేదే చట్టం.. గులాబీ రాజ్యంలో ఇంతకుమించి ఏం ఆశించగలమని అంటున్నాయి ప్రతిపక్షాలు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య.. రామాయంపేటకు చెందిన తల్లీకుమారుల సూసైడ్ ఘటనల తర్వాత గులాబీలు, పోలీసుల మధ్య క్విడ్ ప్రోకోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరంతా కలిసిమెలిసి తమను, సామాన్యులను ఎంతగా వేధిస్తున్నారో తేలిపోయిందని అంటున్నాయి ప్రతిపక్షాలు. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నిజానికి కేసీఆర్ పాలనలో మొదట్నుంచి పోలీసుల తీరుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. దానికి కారణం.. నియామకాల్లో జరుగుతున్న అవకతవకలేనని అంటున్నారు విశ్లేషకులు. పోలీస్ నియామకాలు.. రాజకీయ నియామకాలుగా మారాయని.. సీఎం స్థాయిలో ఆదేశాలు ఉండడంతోనే టీఆర్ఎస్ నేతలు బరితెగిస్తున్నారని చెబుతున్నారు. తమకు అనుకూలమైన వారిని నియమించుకుంటున్న గులాబీలు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. రాజ్యాంగబద్దమైన విధులను నిర్వహించడం వారు ఎప్పుడో మర్చిపోయారని గుర్తు చేస్తున్నారు.

పోలీస్ శాఖలో ఎక్కువమంది టీఆర్ఎస్ నేతలు ఏది చెబితే అదే చేస్తున్నారని.. ఇలాగే కొనసాగితే మరిన్ని ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్ట్ పెడితే చాలు.. వెంటనే పోలీసులు వాలిపోతున్నారని చెబుతున్నారు. ఎవరైనా ఎవరైనా ధిక్కార స్వరం వినిపిస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నారని.. ఇదంతా చూస్తుంటే టీఆర్ఎస్ కండువా కప్పుకున్న వారిలో పోలీసులు  మారిపోయారని అనిపిస్తోందని అంటున్నారు. అసలు.. పోలీస్ స్టేషన్లు టీఆర్ఎస్ కార్యాలయాలుగా మారాయని విశ్లేషణ చేస్తున్నారు.

జిల్లాల్లో గులాబీ నేతలు సెటిల్ మెంట్లు, భూదందాలు ఇలా అనేక విషయాల్లో ప్రజలను వేధిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. వాటిపై ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరిస్తున్నారు. పోలీసులు కూడా ఎమ్మెల్యే నుంచో, మంత్రి నుంచో ఫోన్ వస్తే చాలా అదే చేస్తున్నారని.. ఇప్పుడు రామాయంపేట, ఖమ్మం ఘటనలలో అదే జరిగిందని చెబుతున్నారు. బీజేపీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కారణంగా సాయి గణేష్ పై 30 వరకు కేసులు పెట్టారని గుర్తు చేస్తున్నారు. అటు రామాయంపేట ఘటనలో టీఆర్ఎస్ నేతలు ఎంత వేధిస్తే.. తల్లీకుమారులు కాల్చుకుని చచ్చిపోయి ఉంటారని అంటున్నారు.

ఇవే కాదు కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు కిందిస్థాయి లీడర్లను టీఆర్ఎస్ లో చేరాలని ఒత్తిడి చేయడం.. వారు పోలీస్ స్టేషన్ల ముందే ఆత్మహత్యకు పాల్పడడం అప్పట్లో కలకలం రేపాయి. అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక చాలామంది సూసైడ్ కు పాల్పడుతున్న పరిస్థితి.ఆమధ్య ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ ఏం చేశాడో చూశాం. ఇవన్నీ కొన్ని మాత్రమే. బయటకు రానికి ఎన్నో ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు.

మరోవైపు ప్రత్యర్థులను ఐటీ, ఈడీ, సీబీఐ పేరుతో మోడీ ప్రభుత్వం వేధిస్తోందని ఈమధ్యే కేసీఆర్ అన్నారు. మరి.. రాష్ట్రంలో జరుగుతోందేంటి? గులాబీల వేధింపులపై ఆయన ఏం సమాధానం చెప్తారు? పోలీసుల వేధింపులపై ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. మీరు ఏమైనా చేయొచ్చు.. కానీ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే కేసులు పెడతారా? ఇదెక్కడి న్యాయం. మీకో చట్టం.. ఇతరులకో చట్టమా? అని మండిపడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే కొద్దీ ఆందోళనలు పెరుగుతాయని.. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఇంకా జరిగే అవకాశం ఉంటుందని అంటున్నాయి. దాన్ని అడ్డుకునేందుకు అక్రమ కేసులు పెడితే.. రాష్ట్రం రావణకాష్టంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు పోలీసులు.. గులాబీలు చెప్పింది కాకుండా చట్ట ప్రకారం పని చేయాలని సూచిస్తున్నాయి. లేకపోతే తర్వాత వచ్చే ప్రభుత్వాల సమయంలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నాయి ప్రతిపక్షాలు.


No comments:

Post a Comment